నోరూరించే ఎగ్‌ మఫిన్స్‌, పనీర్‌ జల్ప్రెజీ తయారీ ఈజీగా ఇలా..

Egg Muffins Garlic Smashed Potatoes Orange Cauliflower Recipies In Telugu - Sakshi

కావల్సిన పదార్థాలు:  
గుడ్లు – ఆరు, స్ప్రింగ్‌ ఆనియన్‌ – ఒకటి, ఉల్లిపాయలు – రెండు, టోపు – ఆరు ముక్కలు, చీజ్‌ తురుము – అరకప్పు, ఉప్పు – అరటిస్పూను, ఆలివ్‌ ఆయిల్‌ – టీ స్పూను.

తయారీ విధానం:
►ముందుగా స్ప్రింగ్‌ ఆనియన్, ఉల్లిపాయలను సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. 
►తరువాత టోపును కూడా క్యూబ్‌లుగా తరగాలి. 
►ఒక గిన్నెలో టోపు ముక్కలు, స్ప్రింగ్‌ ఆనియన్, ఉల్లిపాయ ముక్కలు, చీజ్‌ తురుము గుడ్లు పగల కొట్టి వేసి కలపాలి. ఉప్పువేసి మరోసారి కలపాలి. 
►ఇప్పుడు మఫిన్‌ ఉడికించే పాత్రకు ఆలివ్‌ ఆయిల్‌ రాసి దానిలో ఈ గుడ్ల మిశ్రమాన్ని వేసి ఇరవై నిమిషాలపాటు బేక్‌ చేస్తే ఎగ్‌ మఫిన్స్‌ రెడీ.

పనీర్‌ జల్ప్రెజీ
కావల్సిన పదార్థాలు:  
పనీర్‌ – పావుకేజీ, క్యాప్సికం – ఒకటి, టొమాటోలు – రెండు, ఉల్లిపాయ – ఒకటి, అల్లం – అంగుళం ముక్క, వెల్లుల్లి రెబ్బలు – నాలుగు, ధనియాలు – టేబుల్‌ స్పూను, ఆయిల్‌ – మూడు టేబుల్‌ స్పూన్లు, జీలకర్ర – టీ స్పూను, కారం – అర టీస్పూను, పసుపు – అరటీస్పూను, గరం మసాలా – పావు టీస్పూను, ఉప్పు – రుచికి సరిపడా, కొత్తిమీర – గార్నీష్‌కు సరిపడా.

తయారీ విధానం:
►ముందుగా పనీర్‌ను చిన్నచిన్న ముక్కలుగా కట్‌చేసి వేడినీళ్లలో పదిహేను నిమిషాలపాటు నానబెట్టుకోవాలి. 
►క్యాప్సికం, టొమాటో, ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి రెబ్బలను సన్నగా పొడవుగా తరిగి పెట్టుకోవాలి. 
►ధనియాలను దోరగా వేయించి పొడిచేసి పక్కన పెట్టుకోవాలి.
►ఇప్పుడు స్టవ్‌ మీద బాణలి పెట్టుకుని ఆయిల్‌ వేసి వేడెక్కిన తరువాత జీలకర్ర, ఉల్లిపాయ, వెల్లుల్లి ముక్కలు వేసి వేగనివ్వాలి. 
►ఇవి వేగాక క్యాప్సికం, టొమాటో ముక్కలు, అల్లం ముక్కలు సగం వేయాలి. 
►ఇవి దోరగా వేగిన తరువాత ఉప్పు, ధనియాల పొడి, కారం, పసుపు, గరంమసాలా వేసి మీడియం మంటమీద కూరగాయ ముక్కలు రంగు పోకుండా వేయించాలి. 
►టొమాటోలు మెత్తబడిన తరువాత పనీర్‌ ముక్కలు వేసి కలిపి ఐదు నిమిషాలు మూతపెట్టి ఉడికించాలి.
►తరువాత కొత్తిమీరతో గార్నిష్‌ చేస్తే పనీర్‌ జల్ప్రేజీ రెడీ. ఇది నాన్, తందూరీ రోటీల్లోకి చాలా రుచిగా ఉంటుంది.

గార్లిక్‌ స్మాష్డ్‌ పొటాటో
కావల్సిన పదార్థాలు:  
బంగాళ దుంపలు – ఆరు, వెన్న – రెండు టేబుల్‌ స్పూన్లు, ఆలివ్‌ ఆయిల్‌ – రెండు టేబుల్‌ స్పూన్లు, ఉప్పు, మిరియాల పొడి – రుచికి సరిపడా, బరకగా దంచిన ఎండుమిర్చి కారం – టేబుల్‌ స్పూను, వెల్లుల్లి పొడి – టేబుల్‌ స్పూను.

తయారీ విధానం:
►ముందుగా బంగాళ దుంపలను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసి ఉప్పు కలిపి ఉడకబెట్టి నీళ్లు తీసేసి పక్కనబెట్టుకోవాలి.
►ఉడికించిన బంగాళ దుంప స్మాషర్‌తో మెత్తగా చిదుముకోవాలి. ఈ మిశ్రమంలో రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి, వెల్లుల్లి పొడి వేసి కలపాలి. 
►ఇప్పుడు ఈ దుంపల మిశ్రమాన్ని సన్నని స్లైసుల్లా చేసి నలభై ఐదు నిమిషాలపాటు బేక్‌ చేస్తే గార్లిక్‌ స్మాష్డ్‌ పొటాటోస్‌ రెడీ.

ఆరెంజ్‌ క్యాలీఫ్లవర్‌
కావల్సిన పదార్థాలు:  
క్యాలీఫ్లవర్‌ – పెద్దది ఒకటి
బ్యాటర్‌ కోసం: గోధుమ పిండి – ఒకటింబావు కప్పు, బాదం పాలు – కప్పు, పసుపు – టీ స్పూను, వెల్లుల్లి పొడి – టీస్పూను, ఉప్పు – పావుటీస్పూను.
ఆరెంజ్‌ సాస్‌: నీళ్లు – ముప్పావు కప్పు, ఆరెంజ్‌ జ్యూస్‌ – కప్పు, బ్రౌన్‌ సుగర్‌ – ముప్పావు కప్పు, మేపిల్‌ సిరప్‌ – ముప్పావు కప్పు, రైస్‌ వెనిగర్‌ – రెండు టేబుల్‌ స్పూన్లు, వెల్లుల్లి తరుగు – రెండు టీస్పూన్లు, అల్లం తురుము – ఒకటిన్నర టేబుల్‌ స్పూను, ఆలివ్‌ ఆయిల్‌ – టీస్పూను, కార్న్‌స్టార్చ్‌ – రెండు టేబుల్‌ స్పూన్లు. 

తయారీ విధానం:
►ముందుగా బ్యాటర్‌కోసం తీసుకున్న పదార్థాలన్నీ కలిపి బ్యాటర్‌ను రెడీ చేసుకోవాలి. 
►క్యాలీఫ్లవర్‌ను శుభ్రంగా కడిగి మీడియం సైజు ముక్కలుగా కట్‌ చేయాలి. ఒక్కోముక్కను బ్యాటర్‌లో ముంచి ముక్కకు పట్టించాలి. 
►అన్ని ముక్కలకు బ్యాటర్‌ పట్టించిన తరువాత ముక్కలను ఇరవై నిమిషాలపాటు బేక్‌ చేయాలి. 
►ఇప్పుడు కార్న్‌స్టార్చ్‌ను నీళ్లల్లో వేసి మందంగా కలుపుకోవాలి. 
►స్టవ్‌ మీద బాణలిపెట్టి ఆయిల్‌ వేసి వేడెక్కిన తరువాత వెల్లుల్లి, అల్లం తురుమును వేసి మూడు నిమిషాలు వేయించాలి.ఇవి వేగాక కార్న్‌స్టార్చ్‌ మిశ్రమం వేసి కలుపుతూ ఉడికించాలి. తరువాత ఆరెంజ్‌ సాస్‌కోసం తీసుకున్న పదార్థాలన్నీ వేసి ఐదు నిమిషాలపాటు ఉడికిస్తే ఆరెంజ్‌ సాస్‌ రెడీ అయినట్లే. 
►ఇప్పుడు బేక్‌ చేసిపెట్టిన క్యాలీఫ్లవర్‌ ముక్కలను ఆరెంజ్‌ సాస్‌లో ముంచి మరో పదినిమిషాల పాటు బేక్‌ చేయాలి. 
►ఐదు నిమిషాల తరువాత క్యాలీఫ్లవర్‌ ముక్కలను మరోవైపు తిప్పి గోల్డ్‌ కలర్‌లోకి మారేంత వరకు బేక్‌ చేస్తే ఆరెంజ్‌ క్యాలీఫ్లవర్‌ రెడీ.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top