సర్పదోషాలను పరిహరించే పంచలింగాల క్షేత్రం గురించి తెలుసా? | Do you know about the Secrets of panchalingala temple at kurnool | Sakshi
Sakshi News home page

సర్పదోషాలను పరిహరించే పంచలింగాల క్షేత్రం గురించి తెలుసా?

Oct 9 2025 10:42 AM | Updated on Oct 9 2025 11:02 AM

Do you know about the Secrets of panchalingala temple at kurnool

దేశంలో మరెక్కడా లేని విధంగా ఒకే పానవట్టం పై అయిదు లింగాలు వెలసిన దివ్యధామం కర్నూలులోని పంచలింగాల క్షేత్రం. పరీక్షిన్మహారాజు కుమారుడు జనమేజయుడి చేతుల మీదుగా ప్రతిష్థిమైన ఈ ఆలయ సందర్శనం సర్పదోషాలను  పరిహరించడంలో ప్రసిద్ధి గాంచింది. 

స్థల పురాణం ఏం చెబుతోందంటే... పూర్వం సర్పయాగాన్ని నిర్వహించిన జనమేజయ మహారాజు సర్పదోష నివారణ కోసం దేశ నలుమూలల కోటి లింగాలను ప్రతిష్టించారు. ఆ కోటి లింగాలలో చిట్టచివర ప్రతిష్టించినదే ఈ పంచలింగాల క్షేత్రం. ఇక్కడ జనమేజయుడు అనేకమంది యోగులు, మంత్ర సిద్ధుల చేత పంచలింగాలను ప్రతిష్టించి సర్పదోషం నుండి విముక్తి పొందినట్టుగా గంగా పురాణంలో ప్రస్తావించబడినది. శ్రీకృష్ణదేవరాయుల కాలంలో ఈ ఆలయం విరూపాక్ష ముఖ ద్వారంగా విలసిల్లింది. ఈ ఆలయాన్ని శ్రీకృష్ణదేవరాయులు దర్శించారని అక్కడి ఆలయం ముందు ఉండే శిలా శాసనాల ద్వారా తెలుస్తుంది. ఈ శాసనాలలో విజయ నగర సామ్రాజ్యానికి సంబంధించిన చిహ్నాలు కూడా నేటì కీ కనిపిస్తాయి. రాయల సీమ కూడా ఈ ప్రాంతం నుండే ఆరంభం అయినట్టు ఇక్కడ లభించే శిలాశాసనాల ద్వారా తెలియవస్తుంది. ఈ ఆలయంలో శ్రీకృష్ణదేవరాయుల కాలంలో ప్రతిష్టించబడిన వీరభద్రుడు, సకల కోరికలు తీర్చేటువంటి చాముండి మాతను కూడా మనం దర్శించుకోవచ్చు. ఇంకా ఈ ఆలయం చుట్టు అనేక శివాలయాలు వెలిశాయి. కానీ కాలక్రమేణా ఇవి శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇక్కడ గదాధరుడు అయినటువంటి గయా నారాయణుడిని కూడా దర్శించుకోవచ్చు. 

పూర్వం ఈ క్షేత్రాన్ని దక్షిణ గయగా కూడా పిలిచేవారట. ఈ క్షేత్రాన్ని దర్శించిన భక్తులకు సర్పదోషం, నవగ్రహ దోషం, మృత్యుదోషం, కుజ దోషం వంటి అనేక దోషాలు కూడా నివృత్తి అవుతాయని ఆలయ అర్చకుడు తెలిపారు. ఆలయానికి తూర్పు ముఖంగా ప్రవహిస్తున్న తుంగాతీరాన్ని ఆనుకుని వెలసిన ఈ క్షేత్రం ప్రముఖ శైవ క్షేత్రంగా భాసిల్లుతోంది. ఈ ఆలయాల నిర్వహణ బాధ్యతలను ప్రస్తుతం దేవాదాయ శాఖ వారు చూస్తున్నారు.

పంచభూతాల స్వరూపమే పంచలింగాల ఆకాశం, గాలి, నీరు, నిప్పు, వాయువు, భూమి ఈ పంచభూతాల స్వరూపమే ఇక్కడి పరమశివుడి స్వరూపంగా భక్తులు భావిస్తారు. ఇక్కడి ఆలయం ఎంతో ప్రశాంతంగా ఉండి భక్తుల మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఎంతోమంది ఋషులు ఇక్కడ తపస్సు ఆచరించి పరమశివుడి అనుగ్రహాన్ని   పొందినట్టు ఆలయ పండితులు, చారిత్రక పరిశోధకులు చెబుతున్నారు.

ఎలా వెళ్లాలంటే..?
కర్నూలు నుంచి కేవలం 5కి.మీ దూరంలో ఈ పంచలింగాల గ్రామం ఉంది. తుంగభద్ర నది తీరాన్ని ఆనుకుని ఈ గ్రామం ఉంది. ఈ ప్రాంతానికి సమీపంలో కాల్వబుగ్గ బుగ్గరామలింగేశ్వర స్వామి క్షేత్రం ఉంటుంది. అలాగే కర్నూలులో కొండారెడ్డి బురుజు, కొమ్మచెరువు ఆంజనేయ స్వామి ఆలయం, సమీపంలో అలంపూర్‌ జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర ఆలయాలు చూడదగ్గ సందర్శనీయ ప్రదేశాలు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement