ఆరుగంటలకు పైగా మంచులోనే..! బతికే ఛాన్సే లేదు! కానీ.. | Sakshi
Sakshi News home page

ఆరుగంటలకు పైగా మంచులో కూరుకుపోయింది! బతికే ఛాన్స్‌ లేదు కానీ..

Published Sun, Oct 1 2023 4:14 PM

Decades Ago USA Woman Survived Being Frozen Solid - Sakshi

అద్భుతాలెప్పుడూ అకస్మాత్తుగానే జరుగుతాయి. వాటిని కళ్లారా చూసినవారికి ‘ఔరా!’ అనిపిస్తే... చూడనివారికి, కొన్నాళ్ల తర్వాత ఆ కథ విన్నవారికి.. ‘ఔనా..?’ అనిపిస్తుంది. ఈ రెండిట్లోనూ ‘ఇదెలా సాధ్యం?’ అనే అనుమానం అంతర్లీనంగా ధ్వనిస్తుంది. ఆ అనుమానం తీరిందంటే.. ‘కొత్త ఒక వింత పాత ఒక రోత’ అన్నట్లుగా ఆ ఘటన ఇట్టే మరుగున పడిపోతుంది. అది అస్పష్టంగా మిగిలితే మాత్రం.. హిస్టరీలో మిస్టరీగా నిలిచిపోతుంది.

అది 1980 డిసెంబర్‌ 20, రాత్రి పది దాటింది. అమెరికా, మినెసోటాలోని లెంగ్‌బి అనే ప్రాంతం గుండా ఓ కారు వేగంగా దూసుకుపోతోంది. ఆ కారులో 19 ఏళ్ల జీన్‌ హిలీయార్డ్‌ అనే అమ్మాయి.. తన ఇంటికి చేరుకోవడానికి ఆ చిన్న మార్గాన్నే అడ్డదారిగా ఎంచుకుంది. చుట్టూ నిర్మానుష్యం. అక్కడక్కడా వీథి దీపాలు వెలుగుతున్నా కమ్ముకున్న మంచు ఆ వెలుతురును మసకబార్చే పనిలో పడింది. ఇంకాస్త ముందుకెళ్లేసరికి కారు హెడ్‌లైట్స్‌ కూడా చీల్చలేనంత చిమ్మచీకటి ముసిరింది. ఉన్నపళంగా బ్రేక్స్‌ ఫెయిల్‌ అయ్యి పక్కనే ఉన్న గుంతవైపు కారు ఒరిగిపోయింది. కారు చక్రాలు మంచు పెళ్లల్లో చిక్కుకోవడంతో.. ఎంత ప్రయత్నించినా ముందుకు కదల్లేదు.

గడ్డకట్టే ఆ చలికి రాత్రంతా కారులోనే ఉంటే ప్రాణాలకే ప్రమాదమని వెంటనే కారు దిగి.. సమీపంలోని ఏదో ఒక ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకుంది. అప్పటికి ఆమె చేతులకు గ్లౌజులు, ఒంటి మీద పొడవాటి చలి కోటు, కాళ్లకు బూట్లు ఉన్నాయి. అయితే కంగారులో టోపీ కారులోనే మరచిపోయింది. ఆ సమయంలో దాదాపు మైనస్‌ 22 డిగ్రీల సెల్సియస్‌ టెంపరేచర్‌తో మంచు.. వానలా పడుతుంది. అదంతా తనకు తెలిసిన దారే కావడంతో దగ్గర్లోని ఓ ఇంటికి వెళ్లి తలుపు కొట్టింది. అయితే ఆ ఇంట్లో ఎవ్వరూ లేరు. పెరుగుతున్న చలి ఒంట్లో వణుకు పుట్టిస్తోంది.


                                            జీన్స్‌, నెల్సన్‌(లేటెస్ట్‌ ఫోటోలు)

బుర్ర మొద్దు బారిపోతోంది. ఆ క్షణంలో జీన్‌ కి..  స్నేహితుడు వాలే నెల్సన్‌ గుర్తొచ్చాడు. అతడి ఇల్లు అక్కడికి సరిగ్గా రెండు మైళ్ల దూరంలో ఉంటుందని తనకు బాగా తెలుసు. వెంటనే అతడి ఇంటి వైపు నడక సాగించింది. అయితే చీకటి, పొగమంచు కలసి జీన్‌ని తికమక పెడుతున్నాయి. కళ్లు ఆర్పకుండా.. మిణుకు మిణుకుమంటున్న వెలుతురులో తోవ వెతుక్కుంటూ అడుగులు వేస్తున్న జీన్‌ లో ప్రాణభయం మొదలైంది. ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరవుతోంది. తీక్షణంగా చూసుకుంటూ.. తిన్నగా నడుస్తూ.. మొత్తానికి నెల్సన్‌ ఇంటి సమీపానికి చేరుకుంది. అప్పటికే సత్తువ సన్నగిల్లింది. నరాలు బిగుసుకుని.. శరీరం ఆధీనం కోల్పోయింది.
∙∙ 
మరునాడు ఉదయం ఏడు దాటింది. నెల్సన్‌ ఇంటి తలుపు తెరుచుకున్నాయి. గుమ్మానికి కాస్త దూరంలో మంచు పెళ్లల మధ్య.. ఓ వింత ఆకారం నెల్సన్‌  కంటపడింది. బెరుగ్గానే వెళ్లి చూశాడు. చూసి నివ్వెర పోయాడు. అచ్చం దెయ్యంలాగా కళ్లు పెద్దగా తెరచుకుని.. ఇనుప కడ్డీలా బిగుసుకుపోయి.. మంచులో కూరుకుపోయి ఉంది జీన్‌ హిలీయార్డ్‌. ఉలుకూ పలుకూ లేదు. సుమారు ఆరుగంటలకు పైగా.. ఆ మంచు గాలుల్లో ఉండిపోవడంతో ఆమె పూర్తిగా గడ్డకట్టుకుపోయింది. వెంటనే ఆమెను కాలర్‌ పట్టుకుని వరండాలోకి లాక్కెళ్లాడు నెల్సన్‌. ఆమె బోర్డు కంటే గట్టిగా బిగుసుకుపోయుంది.

ఆ తీరుకు ఆమె చనిపోయిందనే అనుకున్నాడు. కానీ ఆమె ముక్కు నుంచి కొన్ని బుడగలు రావడం చూశాడు నెల్సన్‌. వెంటనే ఫోస్టన్‌లోని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే ఆమెను పరీక్షించిన డాక్టర్లు షాక్‌ అయ్యారు. కనీసం ఇంజెక్షన్‌ చేయడానికి కూడా ఆమె శరీరం సహకరించలేదు. సూది చర్మంలోకి దిగలేదు. దాంతో వాళ్లు ఆమె చనిపోయిందని అనుకున్నారు. వెంటనే హీటింగ్‌ ప్యాడ్‌లతో ఆమెను వేడెక్కించే ప్రయత్నం చేశారు. కొన్ని గంటలకు ఆ ప్రయత్నం ఫలించింది. ఆమెలో కదలికలు మొదలయ్యాయి. మధ్యాహ్నం అయ్యేసరికి విషయం తెలుసుకున్న జీన్‌ తల్లి బెర్నిస్, తండ్రి లెస్టర్‌లు ఆసుపత్రికి పరుగుతీశారు. కూతురు ప్రాణాలతో తమకు దక్కినందుకు పొంగిపోయారు. జీన్‌ స్నేహితుడు నెల్సన్‌ కి వేలవేల కృతజ్ఞతలు తెలిపారు. కొన్నిరోజుల్లోనే ఆమె పూర్తిగా కోలుకుంది.

అయితే ‘ఆ రాత్రి నెల్సన్‌ ఇంటి ముందు పడిపోవడం వరకే నాకు గుర్తుంది. ఆసుపత్రి బెడ్‌ మీద నిద్రపోయి లేచినట్లుగా అనిపించింది. పడిపోయాక ఏం జరిగిందో నాకు ఏదీ గుర్తు లేదు’ అని జీన్‌ చెప్పడం ఆశ్చర్యకరం. కళ్లు తెరిచే బిగుసుకుపోయిన జీన్‌ కి ఏదీ కనిపించకుండా, ఏదీ గుర్తు లేకుండా, తిరిగి ప్రాణాలతో బయటపడటం అందరినీ నివ్వెరపరచింది. వార్తా ప్రతికలన్నీ ఈ అద్భుతాన్ని కథలు కథలుగా ప్రచురించాయి. ఇదే మూలాన్ని అల్లుకుంటూ.. ఎన్నో సినిమాలు, కథలు, డాక్యుమెంటరీలు పుట్టుకొచ్చాయి. నెల్సన్‌ , జీన్‌లకి ఎలా పరిచయం అంటే.. నెల్సన్‌ స్నేహితుడు పాల్‌.. గర్ల్‌ఫ్రెండే ఈ జీన్‌.

ఘటన జరిగిన ముందు రోజు కూడా జీన్, నెల్సన్‌  ఇద్దరూ పాల్‌ సమక్షంలో కలిశారట. ఫోస్టన్‌ అమెరికన్‌ లెజియన్‌లో హాటెస్ట్‌ స్పాట్‌లో ఓ పార్టీలో కలసి.. ఆటపాటలతో ఎంజాయ్‌ చేశారట.నెల్సన్‌ ఇప్పటికీ లెంగ్‌బీకి ఉత్తరాన ఉన్న క్లియర్‌బ్రూక్‌ సమీపంలో మీట్‌ షాప్‌ నడుపుకుంటూ నివసిస్తున్నాడు. జీన్‌ కొన్నాళ్లకు పెళ్లి చేసుకుని.. పిల్లల్ని కూడా కన్నది. కొన్నేళ్లకు విడాకులు తీసుకుని ఒంటరిగా జీవిస్తోంది.

ప్రస్తుతం కేంబ్రిడ్జ్‌లో ఉంటూ.. వాల్‌మార్ట్‌లో పని చేస్తోంది. ఈ ఘటన గురించి ఎప్పుడు అడిగినా ఆమె మొదటి స్పందన ఏంటో తెలుసా? ‘నేనురాత్రి పూట కారు డ్రైవింగ్‌ మానేశాను’ అని. ఈ రోజుల్లో, వైద్యరంగం బాగా అభివృద్ధి చెందింది. కానీ 1980లో.. అదీ.. ఒక గ్రామీణ ఆసుపత్రిలో.. కేవలం కొన్ని హీటింగ్‌ ప్యాడ్‌లతో.. చావు అంచులకు చేరిన మనిషిని కాపాడటం అనేది నేటికీ మిస్టరీనే.
 సంహిత నిమ్మన 

(చదవండి:  బుడగల మాదిరి భవనం..కట్టడానికే 14 ఏళ్లు..కానీ..)

Advertisement

తప్పక చదవండి

Advertisement