Couple Recreate 1979 Song Rimjhim Gire Sawan at Mumbai Roads - Sakshi
Sakshi News home page

రిమ్‌జిమ్‌ గిరే సావన్‌.. ఒక జంట.. ఒక వాన.. ఒక పాట..

Published Sun, Jul 9 2023 12:42 AM

Couple recreate 1979 song Rimjhim Gire Sawan at mumbai roads - Sakshi

వానొస్తుంటే ఎవరైనా ఏం చేస్తారు? కిటికీలో నుంచి చూస్తారు. బయటకెళ్లకండి అని భార్య అంటుంది. టీ పెట్టమని భర్త అంటాడు. కాని ముంబైకి చెందిన శైలేష్, వందన అనే భార్యాభర్తలు మాత్రం ముంబై రోడ్ల మీద తడవడానికి బయలుదేరారు. ఒకప్పటి‘మంజిల్‌’ సినిమాలో ‘రిమ్‌జిమ్‌ గిరే సావన్‌’ హిట్‌ పాటలో ఎలాగైతే అమితాబ్, మౌసమీ చటర్జీ తడుస్తూ తిరిగారో అచ్చు అలాగే తిరిగారు. పాటను షూట్‌ చేసి వదిలితే వైరలే వైరలు.

ఒక జంట. ఒక వాన. ఒక పాట. గతం మళ్లీ వర్తమానం అయ్యింది. నిజ పాత్రలు నటీనటులు అయ్యారు. ముంబై నగర వీధుల్లో ఒక సుందర దృశ్యం ఆవిష్కృతం అయ్యింది. చూసిన ప్రేక్షకులు మురిసిపోయారు. ఆనంద్‌ మహీంద్ర అంతటి వాడు ట్వీట్‌ చేసి మెచ్చుకున్నాడు. ఇప్పటి వరకూ లక్షల మంది వీక్షించారు. ఇంతకూ ఏమిటది? రిమ్‌జిమ్‌ గిరె సావన్‌ పాట. రీమేక్‌ పాట.
 

మంజిల్‌ సినిమా నుంచి
అమితాబ్, మౌసమీ చటర్జీ నటించిన ‘మంజిల్‌’ (1979) సినిమాకు దర్శకుడు బాసూ చటర్జీ. సినిమా ఓ మోస్తరుగా ఆడినా ‘రిమ్‌జిమ్‌ గిరె సావన్‌’ పాట పెద్ద హిట్‌. కిశోర్‌ కుమార్‌ వెర్షన్, లతా వెర్షన్‌ ఉంటాయి. లతా వెర్షన్‌ను బాసూ చటర్జీ నిజమైన వర్షంలో తీయాలనుకున్నాడు. ముంబైలో వాన కురుస్తున్న రోజు ఒక చిన్న యూనిట్‌ను పెట్టుకుని సూట్‌లో ఉన్న అమితాబ్‌ను, చీరలో ఉన్న మౌసమీ చటర్జీని రోడ్ల మీద నడిపిస్తూ పిక్చరైజ్‌ చేశాడు. ఈ పాట పెద్ద హిట్‌. సేమ్‌ ఇదే పాటను ఇన్నేళ్ల తర్వాత ఈ జంట మళ్లీ అభినయించింది.

వారి పేర్లు శైలేష్, వందన
ముంబైలోని థానేలో నివసించే శైలేష్, వందనలకు పెళ్లయ్యి 26 ఏళ్లు. ఒకరి పట్ల ఒకరికి చాలా ప్రేమ, ఇష్టం. ఈ ఇష్టం ఒక వానరోజున రికార్డు చేద్దామని, అదీ రిమ్‌జిమ్‌ గిరే సావన్‌ పాటలా ఉండాలని శైలేష్‌ కోరిక. భార్య దగ్గర ఎప్పుడు ప్రస్తావన తెచ్చినా ఆమె సిగ్గుతో ‘నేను చేయనండీ’ అనేది. శైలేష్‌ పట్టు వీడక ఈ సంగతి తన స్నేహితుడు అనుప్‌ రింగాన్‌గవాకర్‌కు చెప్పాడు. అనుప్‌ భార్య అంకిత ఇది విని ఉత్సాహపడింది. వాళ్లిద్దరినీ మనిద్దరం వానలో షూట్‌ చేద్దాం అని చెప్పింది. ఇంకేముంది శైలేష్‌ అచ్చు మంజిల్‌ సినిమాలోని సూట్‌ లాంటిది కుట్టించుకున్నాడు. వందన అలాంటి చీరలోనే నిరాడంబరంగా తయారైంది. మొన్న మొదలైన వానల్లో ఒకరోజు మొత్తం పాటను సేమ్‌ అవే లొకేషన్లలో తీశారు.

పెద్ద హిట్‌
పాత పాట ఎంత హిట్టో ఈ పాట అంతే హిట్‌ అయ్యింది. ‘మేము ఇంత రెస్పాన్స్‌ ఊహించలేదు’ అని శైలేష్‌ అన్నాడు. ‘మా లొకాలిటీలో మేము సెలబ్రిటీలం అయిపోయాం’ అని చెప్పాడు. దేశవిదేశాల్లో ఈ వీడియోకు ఆదరణ లభించింది. ‘మనసుండాలి గాని ప్రతి సందర్భాన్ని ఆనందమయం చేసుకోవచ్చు’ అని చాలా మంది మెచ్చుకున్నారు. ఈ జంటను చాలామంది డిన్నర్‌కు పిలుస్తున్నారు.

అన్నట్టు ‘మంజిల్‌’ కోసం ఈ పాటను నిజమైన వానలో తీసేప్పుడు అమితాబ్‌ నడకను అందుకోవడానికి మౌసమీ చటర్జీ పరుగులు తీయాల్సి వచ్చేది. అమితాబ్‌ కాళ్లు పొడవు కదా. ‘చాలాసార్లు ఆయన మెల్లగా నడిచి బేలెన్స్‌ చేసేవాడు. షూటింగ్‌ కోసం చాలాసేపు చీర నానడం వల్ల ఇంటికొచ్చాక దాని రంగు నా ఒంటి మీద అంటుకుపోయింది. వానలో పాట మాకు ఏమీ వినిపించేది కాదు. దూరం నుంచి డైరెక్టర్‌ కర్చీఫ్‌ ఆడిస్తే యాక్షన్‌ అని, మళ్లీ ఆడిస్తే కట్‌ అని భావించే నటించాం’ అని మౌసమీ చటర్జీ గుర్తు చేసుకుంది.
వానలు మనకు అంతగా పడట్లేదు. పడినప్పుడు ఈ పాట చూడండి.

Advertisement
Advertisement