కాఫీ పొడి పొగతో దోమలు పరార్‌..!

Coffee Powder Smoke Repels Mosquitoes - Sakshi

దోమ కాటు వల్ల చాలా మంది అనేక అనారోగ్య సమస్యలకు గురవుతుంటారు. అసలే ఇది వర్షాకాలం. ఈ సీజన్‌లో మురికిగా ఉన్న ప్రదేశాల్లో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. కొన్ని రకాల దోమల కాటుS వల్ల ప్రాణాంతక వ్యాధులైన డెంగ్యూ, మలేరియా వచ్చే ప్రమాదం అధికంగా ఉంది. దోమల బెడద నుంచి విముక్తి పొందడానికి అనేక రకాల మందులు, రసాయనాలు నేడు మార్కెట్లో అందుబాటులో ఉన్నప్పటికీ, అవి ఆశించిన ఫలితాలను ఇవ్వలేక పోతున్నాయి. అంతే కాకుండా ఈ రసాయనాలు మన ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతాయి. అందువల్ల కొన్ని చిట్కాల ద్వారా దోమలను తరిమి కొట్టేయవచ్చు సులువుగా...

ఇంట్లోని దోమలను తరిమికొట్టడంలో కాఫీ పొడి చాలా సమర్థంగా పని చేస్తుంది. ఇందుకోసం ముందుగా ఒక బౌల్‌లో నిప్పులు తీసుకుని.. అందులో ఒకటి లేదా రెండు టేబుల్‌ స్పూన్ల కాఫీ పౌడర్‌ను కొంచెం కొంచెంగా వేస్తే పొగ వస్తుంది. ఆ పొగ ఇల్లు మొత్తం వ్యాపించేలా చేయాలి. దాంతో ఇంట్లో దోమలు ఎక్కడున్నా బయటకు పారిపోతాయి. ఎందుకంటే, కాఫీ పొడి వాసన దోమలకు పడదు. ఒక్క దోమలనేæకాదు... ఇంకా ఏవైనా కీటకాలు ఉన్నా కూడా ఈ వాసనకు పరార్‌ అవుతాయి. నిన్న మొన్నటి వరకు పెద్దవాళ్లు సాయంత్రం వేళల్లోనూ, తలంటి పోసుకున్న తర్వాత కురులను ఆరబెట్టుకోవడం కోసమూ సాంబ్రాణి ధూపం వేయడం మనకు తెలిసిందే. నిప్పుల మీద వెల్లుల్లి పొట్టు వేసినా...  ఎండబెట్టిన వేపాకులు వేసినా కూడా ఆ వాసనకు దోమలతోపాటు ఇతర కీటకాలు కూడా పారిపోతాయి. 

తులసి మొక్క..
ప్రతి భారతీయుని ఇంట్లో తులసి మొక్క ఉంటుంది. ఈ తులసి మొక్క ద్వారా ఎన్నో రకాల ప్రయోజనాలున్నాయి. ఇది దోమల లార్వా, ఇతర కీటకాలను చంపడానికి చాలా సహాయపడుతుంది. తులసి వాసన కీటకాలు, దోమలను దరి చేరనివ్వకుండా చేస్తుంది. 

గుల్‌ మెహందీ మొక్క..
గుల్‌ మెహందీని మనం రోజ్మేరీ అని కూడా పిలుస్తారు. ఈ మొక్క దోమలు, ఇతర కీటకాలను దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఈ మొక్క పువ్వులు చాలా ఘాటైన వాసన కలిగి ఉంటాయి కాబట్టి దోమలను, కీటకాలను దూరంగా ఉంచేందుకు సహాయపడుతుంది.

పుదీనా.. 
వేసవిలో ఇంట్లో తయారు చేసే దాదాపు ప్రతి వస్తువులో పుదీనాను వాడతారు. పుదీనాలోంచి వచ్చే వాసన కీటకాలను, దోమలను తరిమికొట్టడానికి పనిచేస్తుంది కాబట్టి ఇంటి పెరటిలో లేదా కనీసం కుండీలలో అయినా పుదీనాను పెంచుకోవడం మంచిది. వాటినుంచి వచ్చే వాసన మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తుంది. 
    
బంతి మొక్క..
బంతి పువ్వును ప్రతి శుభకార్యంలో అలంకరణకు వాడతారు. దీనిని ఇంగ్లీష్‌లో మేరిగోల్డ్‌ అంటారు. దీనిని వివిధ దేశాలలో వివిధ రకాలుగా పిలుస్తారు. ఈ మొక్క ఆకులు, పువ్వుల నుంచి వెలువడే వాసన ఈగలు, దోమలు, ఇతర కీటకాలను దూరం చేస్తుంది.

నిమ్మ గడ్డి మొక్క..
నిమ్మ గడ్డి మొక్క గురించి చాలా మందికి తెలుసు. ఈ మొక్క ఘాటైన వాసనతో ఉంటుంది. దీనిని పెంచుకోవడం వల్ల ఇంటి నుంచి దోమలను తరిమికొట్టడానికి సహాయపడుతుంది.

అసలు దోమలు చేరకుండా ఉండాలంటే ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో చెత్త డబ్బాలో ఉన్న చెత్తను క్రమం తప్పకుండా పారేస్తుండాలి. తులసి, బంతి, లావెండర్‌.. వంటి మొక్కలను ఇంటి చుట్టూ కుండీల్లో పెంచుకోవాలి. ఈ మొక్కలు ఉంటే దోమలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. ఇక వేప నూనె, కొబ్బరి నూనె కలిపి.. రోజూ సాయంత్రం శరీరానికి రాసుకోవాలి. దాంతో ఆయా నూనెల వాసనకు దోమలు దగ్గరకు రాకుండా ఉంటాయి. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top