అంధత్వం కాదు అక్షర బంధుత్వం.. | Chintakindi Saijyothi writing to instill a positive outlook among the blind | Sakshi
Sakshi News home page

అంధురాలినని నిరాశ పడలేదు..! కానీ అలాంటి వారి కోసం..

May 28 2025 9:56 AM | Updated on May 28 2025 9:56 AM

Chintakindi Saijyothi writing to instill a positive outlook among the blind

అక్షరం ఆయుధమే కాదు చీకటి నుంచి వెలుగులోకి తీసుకువెళ్లే కాంతిపుంజం. ‘నేను అంధురాలిని’ 
అని ఎప్పుడూ నిరాశపడలేదు సాయిజ్యోతి. ఆమె ఉత్సాహం పేరు... అక్షరం. ఆమె శక్తి పేరు... పుస్తకం. గుంటూరు జిల్లా పాత మంగళగిరికి చెందిన చింతకింది సాయిజ్యోతి అంధుల్లో సానుకూల దృక్పథాన్ని కలిగించే లక్ష్యంతో కవితల నుంచి నవలల వరకు ఎన్నో ప్రక్రియలలో రచనలు చేస్తోంది...

పదేళ్ల వయసు వచ్చేవరకూ లోకాన్ని అందరిలాగే చూసింది సాయిజ్యోతి. ఉపాధ్యాయులు చెప్పేది విని నోటు పుస్తకంలో రాసుకునేది. కానీ జన్మతః వచ్చిన లోపం కారణంగా ఆ తరువాత కంటిచూపును కోల్పోయింది. అప్పటివరకూ అందంగా కనిపించిన రంగుల ప్రపంచం ఒక్కసారిగా చీకటైపోయింది.  

స్థానిక విజయమేరి ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలలో హైస్కూలు విద్య, హైదరాబాద్‌లోని చిన్న జీయర్‌ స్వామి నేత్ర విద్యాలయంలో ఇంటర్మీడియట్‌ పూర్తి చేసింది. మంగళగిరిలో డిగ్రీ, నాగార్జున విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్‌  పూర్తి చేసిన జ్యోతి ప్రస్తుతం నూతక్కి జిల్లా పరిషత్‌ హైస్కూలులో జూనియర్‌ అసిస్టెంటుగా ఉద్యోగం చేస్తోంది.

అక్షరాల తోటలోకి...
సాహిత్యంపై చిన్నప్పటి నుంచే సాయిజ్యోతికి ఆసక్తి ఉండటతో చిన్న చిన్న రచనలు చేసేది. ఆ తరువాత తన సాహిత్యానికి సోషల్‌ మీడియాను వేదిక చేసుకుంది. వివిధ సాహిత్య వేదికలకు చెందిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లాంటి గ్రూపులతో పరిచయం అయింది. ‘చైత్రశ్రీ’ అనే కలం పేరుతో రచనలకు శ్రీకారం చుట్టింది. తొలి కవితా సంకలనం ‘కవితాంజలి’ ఈ ఏడాది వెలువడింది.

తన జీవితమే తన నవల
‘మంచు తాకిన ప్రేమ‘ నవలకు మంచి పేరు వచ్చింది. ‘ఎవరు అతను?’ పేరుతో రెండో నవల రాసింది. మూడవ నవల ‘అన్వేషిత’ తన జీవితాన్నే స్ఫూర్తిగా తీసుకొని రాసింది. కుటుంబంలో ఒక అమ్మాయి అంధురాలిగా పుడితే ఆమెను కుటుంబం ఏ విధంగా చూసుకుంది? సమాజంలో తనని తాను ఏ విధంగా నిరూపించుకుంది? తోటి అంధులకు ఆమె ఏ విధంగా సహాయపడింది? స్ఫూర్తిని ఇచ్చింది? అంధుల జీవితం ఎలా ఉంటుంది.. మొదలైన అంశాలను తీసుకొని నవల రాసింది. అరవై భాగాలు ఉన్న ‘అన్వేషిత’ నవలను పుస్తక రూపంలోకి తీసుకు రానున్నారు. ఇవేకాక ఏడు చిన్న కథలు, ఆరు పాటలు రాసింది. అవి స్నేహితుల ద్వారా యూ ట్యూబ్‌ వరకూ చేరి ప్రేక్షకాదరణ పొందుతున్నాయి.

అందుకోసమే నా రచనలు
సానుకూల దృక్పధాన్ని ఎలా అలవర్చుకోవాలి, ప్రతికూల పరిస్థితులను ఏ విధంగా ఎదుర్కోవాలిలాంటి అంశాలే నా రచనకు మూలం. సమస్యలకు కుంగిపోకుండా పరిష్కారాలను అన్వేషించాలని నేను గట్టిగా నమ్ముతాను. సమాజంలో అంధుల పట్ల ఉన్న ఆలోచన ధోరణిని మార్చాలనేది నా ప్రయత్నం. అందుకోసమే రచనలు చేస్తున్నాను. అద్బుత విజయాలు సాధించడానికి అంధత్వం అడ్డుకాదని చరిత్ర నిరూపించింది. నిరూపిస్తూనే ఉంది.
 – చింతకింది సాయిజ్యోతి 

– బోణం గణేష్, సాక్షి, అమరావతి

(చదవండి: ఇద్దరు పిల్లలున్న అమ్మలకు గుడ్‌న్యూస్‌..! ఇక నుంచి..)

Advertisement
 
Advertisement
Advertisement