2024లో.. అగ్రరాజ్యానికి తొలి మహిళా ప్రెసిడెంట్‌!

Candace Owens To Run For President In US Election 2024 - Sakshi

కమల V/S క్యాడేస్‌

వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో క్యాండేస్‌ ఓవెన్స్‌ కనుక నిలబడితే, నిలబడి గెలిస్తే అమెరికా చరిత్రలోనే ఆమె ‘యంగెస్ట్‌ ప్రెసిడెంట్‌’ అవుతారు. తొలి మహిళా ప్రెసిడెంట్‌ అవుతారు. తొలి మహిళా బ్లాక్‌ ప్రెసిడెంట్‌ అవుతారు. తెల్లవాళ్ల గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీ (రిపబ్లికన్‌ పార్టీ).. అధ్యక్ష పదవికి నిలబెట్టిన తొలి ‘బ్లాక్‌’ క్యాండిడేట్‌ అవుతారు. అమెరికా చరిత్రలోనే జాన్‌ ఎఫ్‌.కెన్నెడి ‘యంగెస్ట్‌’ ప్రెసిడెంట్‌! జో బైడెన్‌ ‘ఓల్డెస్ట్‌’ ప్రెసిడెంట్‌! ప్రమాణ స్వీకారం చేసే నాటికి కెన్నెడీ వయసు 43. బైడెన్‌ వయసు 78. (థియోడర్‌ రూజ్‌వెల్ట్‌ 42 ఏళ్ల వయసులో అమెరికా అధ్యక్షుడు అయినప్పటికీ ఆయన నేరుగా ఎన్నికైన అభ్యర్థి కాదు. అధ్యక్షుడు విలియం మెకిన్లే హత్య జరగడంతో ఆ స్థానంలోకి వెళ్లినవారు).  బైడెన్‌ ‘అతి పెద్ద’ రికార్డును బ్రేక్‌ చేసే వారు బహుశా సమీప భవిష్యత్తులో ఉండకపోవచ్చు. కానీ, కెన్నెడీ రికార్డు భవిష్యత్తులో ఏ ఎన్నికల్లోనైనా బ్రేక్‌ అవచ్చు. అసలు వచ్చే ఎన్నికల్లోనే (2024) కెన్నెడీ రికార్డు ఓ అమ్మాయి చేతిలో బద్దలయ్యేలా కనిపిస్తోంది. ఆ అమ్మాయే క్యాండేస్‌ ఓవెన్స్‌. ప్రస్తుతం ఆమె వయసు 31. అమెరికా ప్రెసిడెట్‌గా పోటీ చేయడానికి కనీస వయసు 35. మరో నాలుగేళ్లలో ఆమె ఆ గీత దాటేస్తారు కనుక పోటీ చేసే అర్హత లభిస్తుంది. 


క్యాండేస్‌ ఓవెన్‌ : మరో నాలుగేళ్లలో అమెరికా ప్రెసిడెంట్‌? 

ఇటీవలే కదా అమెరికాలో ట్రంప్‌ వెళ్లిపోయి, జో బైడెన్‌ వచ్చింది! మళ్లీ ఎప్పటికో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిగా ఇంత అకస్మాత్తుగా క్యాండేస్‌ ఓవెన్స్‌ అనే యువతి పేరు వినిపించడం ఏమిటి? ఆమె ఎవరు? ఏ పార్టీ? రాజకీయ అనుభవం ఉందా? ముందుగా మొదటి ప్రశ్నకు సమాధానం. ఆమె పేరును ఎవరూ ప్రతిపాదించలేదు. తనే స్వయంగా ప్రకటించుకున్నారు. ‘ఐ లవ్‌ అమెరికా. థింకింగ్‌ అబౌట్‌ రన్నింగ్‌ ఫర్‌ ప్రెసిడెంట్‌’ అని ఫిబ్రవరి 7న ఒక ట్వీట్‌ ఇచ్చారు! క్యాండేస్‌ కన్సర్వేటివ్‌ ఆథర్‌. అమెరికన్‌ సంప్రదాయ విలువలకు కట్టుపడిన రచయిత్రి. ఇంకా.. ఆ దేశ రాజకీయ వ్యవహారాలపై చక్కటి వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు చేస్తుంటారు. సామాజిక కార్యకర్త కూడా. అధ్యక్ష ఉపాధ్యక్షులుగా జో బైడెన్, కమలా హ్యారిస్‌ వచ్చి ఇరవై రోజులైనా కాలేదు, అప్పుడు వాళ్లిద్దరి రాజకీయ వ్యవహార శైలులను ఆమె తప్పు పట్టడం ఆరంభించారు!

అయితే క్యాండేస్‌ చేసే ఏ కామెంట్‌ అయినా గాలిలో కలిసిపోయేదేమీ కాదు. స్వయంగా బైడెన్, కమల ఆ కామెంట్‌లను విని తమకు తాముగా సమీక్షించుకున్నా ఆశ్చర్యం లేదు. అంత ప్రామాణికంగా ఉంటాయి క్యాండేస్‌ సునిశితమైన పరిశీలనలు. ఆమె మాటకు, రాతకు అమెరికన్‌ సమాజంలో అంతటి విలువ ఉంది! ఫిబ్రవరి ఏడున ఆమె అలా ట్వీట్‌ పెట్టగానే.. ‘గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీ’ అయిన రిపబ్లికన్‌ పార్టీకి తెల్లవాళ్లను మాత్రమే తమ అధ్యక్ష అభ్యర్థిగా అంగీకరించే చరిత్ర ఉన్నప్పుడు ఆ పార్టీ నుంచి మీరెలా ఎన్నికల్లో నిలబడగలరు..’ అని ఒక యూజర్‌ ప్రశ్నించారు. అందుకు.. ‘దిస్‌ ఓన్ట్‌ ఏజ్‌ వెల్‌’ అని క్యాండేస్‌ సమాధానం ఇచ్చారు. ఎప్పటికీ అలాగనే ఉంటుందని ఎందుకు అనుకుంటున్నారు అని?

నల్లజాతి వాళ్లను చేరదీసేది డెమోక్రాటిక్‌ పార్టీనే అయినప్పటికీ, ఆ పార్టీ విధానాలను వ్యతిరేకిస్తుంటారు క్యాండేస్‌. ఆఫ్రికన్‌ సంతితి అమెరికన్‌ మహిళ ఆమె. అయినప్పటికీ ఆమె డొనాల్డ్‌ ట్రంప్‌ను సమర్థిస్తూ వచ్చారు. ఆయన ముఖ్య అనుచరురాలిగా ముద్ర పడ్డారు. సోషల్‌ మీడియాలో క్యాండేస్‌ చేసే వ్యాఖ్యలు తరచు వివాదాస్పదం అవుతుంటాయి. గత ఏడాది డిసెంబర్‌లో ‘వోగ్‌’ మ్యాగజీన్‌ ముఖచిత్రంగా వచ్చిన హ్యారీ స్టెయిల్స్‌ (27 ఏళ్ల బ్రిటిష్‌ నటుడు) దుస్తుల పై ఆమె కొన్ని విసుర్లు వేశారు. ఆ కవర్‌ పేజీపైన హ్యారీ కుచ్చుల పావడా వంటి డ్రెస్‌ను ధరించి మోడలింగ్‌ చేస్తూ ఉంటారు.

ఆ ఫొటోకు వోగ్‌ ఇచ్చిన కాప్షన్‌.. ‘బ్రింగ్‌ బ్యాక్‌ మ్యాన్‌లీ మెన్‌’. ఆ కాప్షన్‌ని ఎగతాళి చేస్తూ.. ‘ఫెమినైజేషన్‌ ఆఫ్‌ మెన్‌’ అని ట్వీట్‌ చేశారు క్యాండేస్‌. ఈ మధ్య కూడా యు.ఎస్‌. కాంగ్రెస్‌ ప్రతినిధి అలెగ్జాండ్రియా ఓకేషియో–కార్టెజ్‌ తనపై హత్యాయత్నం జరిగినట్లు ఫేక్‌ ప్రచారం చేయించుకున్నారు అని క్యాండేస్‌ అనడం డెమోక్రాటిక్‌లకు ఆగ్రహం తెప్పించింది. జనవరి 6న జరిగిన ‘కాపిటల్‌ హిల్‌’ భవంతి విధ్వంసంలో తనను అంతం చేయడానికి కొంతమంది రిపబ్లికన్‌లు ప్రయత్నించారని కార్టెజ్‌ ఆరోపించడమే క్యాండేస్‌ విమర్శకు కారణం. క్యాండేస్‌కు గత జనవరిలోనే తొలి బిడ్డ పుట్టాడు. భర్త జార్జి ఫార్మర్‌ ‘హెడ్జ్‌ ఫండ్‌’ అనే ఒక పెట్టుబడుల వ్యాపార సంస్థ ఉద్యోగి. 

క్యాండేస్‌ ఓవెన్స్‌ మరీ అనామకురాలైతే కాదు. ఆమెలో ఉన్న మరొక గుణం కొంతమంది మహిళా కాంగెస్‌ ప్రతినిధులు, సెనెటర్‌లలో ఉన్నదే. అంశాలపరంగా వారు విభేదిస్తారు. సొంత మనుషులనైనా, సొంత పార్టీల వారినైనా వదిలిపెట్టరు. అమెరికన్‌ రాజకీయాల్లో వ్యక్తిత్వం గల లీడర్‌గా ఎదగడానికి అవసరమైన స్వభావమే అది. ‘వోగ్‌’ కవర్‌ను అవహేళన చేసిన క్యాండేస్‌ తన కెరీర్‌ ఆరంభంలో ఆ పత్రికలో ఇంటెర్న్‌గా చేశారు. ప్రస్తుతం డెమోక్రాటిక్‌ విధాలను తప్పుపడుతున్న క్యాండీస్, ట్రంప్‌ అధ్యక్షుడు అవగానే డెమొక్రాటిక్‌ పార్టీ నుంచి రిపబ్లికన్‌ పార్టీలోకి మారిపోయారు.

క్యాండేస్‌ కనెక్టికట్‌లో జన్మించారు. నలుగురు పిల్లల్లో తను ఒకరు. తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడంతో అమ్మమ్మ తాతయ్యల దగ్గర పెరిగారు. క్యాండేస్‌ అభిప్రాయాలు స్పష్టమైనవీ, చురుకు పుట్టించేవి. టీనేజ్‌లోనే ఆమెపై మూడుసార్లు జాత్యహంకార దాడులు జరిగాయి. ఆమె ‘టెడెక్స్‌’ ప్రసంగాలను వింటే.. ప్రత్యర్థిపై దూకుడును ప్రదర్శించడంలో కమలా హ్యారిస్‌ కంటే క్యాండేస్‌ బలమైన వ్యక్తి అనిపిస్తుంది. అయితే వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో ‘కమల వర్సెస్‌ క్యాండేస్‌’ అనే మలుపు దగ్గరికి అమెరికా చేరుకునేందుకు అనేక రాజకీయ పరిణామాలైతే సంభవించవలసి ఉంటుంది. వాటిల్లో అనూహ్యమైనవీ ఉంటే ఉండొచ్చు. 

వివాదాస్పద విమర్శలు
♦అలెగ్జాండ్రియా ఓకేషియో–కార్టెజ్‌ : క్యాపిటల్‌ హిల్‌ ఘటనలో తనపై హత్యాయత్నం జరిగిందని కార్టెజ్‌ అనడాన్ని కూడా క్యాండేస్‌ ఓవెన్‌ హాస్యాస్పదం అన్నారు. అది ఫేక్‌ హత్యాయత్నం విమర్శించారు. 

♦‘వోగ్‌’ ఫ్యాషన్‌ మ్యాగజీన్‌ మీద వచ్చిన బ్రిటిష్‌ నటుడు హ్యారీ ఫొటో : ‘బ్రింగ్‌ బ్యాక్‌ మాన్లీ మ్యాన్‌’ అని వోగ్‌ ఈ ఫొటోకు కాప్షన్‌ పెడితే.. క్యాండేస్‌ ‘ఫెమినైజేషన్‌ ఆఫ్‌ మెన్‌’ అని 
అవహేళన చేయడం వివాదం అయింది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top