మనిషి నిద్రపోతుంటే..ఆత్మ లక్ష్యం కోసం ఎంత దూరమైన వెళ్తుందా? | Sakshi
Sakshi News home page

మనిషి నిద్రపోతుంటే..ఆత్మ లక్ష్యం కోసం ఎంత దూరమైన వెళ్తుందా? ఇది సాధ్యమా?

Published Sun, Jan 7 2024 3:50 PM

Buzzfeed News Mystery Stories From Anonymous People - Sakshi

‘బజ్‌ఫీడ్‌’ అనే అమెరికాకు చెందిన మీడియా సంస్థకు.. నెట్టింట మంచి క్రేజ్‌ ఉంది. ‘అన్‌ సాల్వ్‌డ్‌ మిస్టరీస్‌’ పై ప్రత్యేక కథనాలు చేసే ఈ సంస్థ.. ఆసక్తి కలిగించే స్టోరీలను ప్రజలకు అందించడంలో దిట్ట! ‘మీ జీవితాల్లోని విచిత్రమైన సంఘటనలు, భయానక అనుభవాలను రాసి మాకు పంపించండి’ అని ప్రకటించింది. దాంతో బజ్‌ఫీడ్‌కి సంబంధించిన మెయిల్స్‌ అన్నీ అజ్ఞాత వ్యక్తుల నుంచి వచ్చిన కథనాలతో నిండిపోయాయి. అందులోనిదే ఇదొకటి.

‘నేను హైస్కూల్‌ రెండవ సంవత్సరం చదువుతున్నప్పుడు, ఒకరోజు ఉదయాన్నే విపరీతమైన జ్వరంతో నిద్రలేచాను. అది గమనించిన మా మమ్మీ.. నన్ను ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకోమని చెప్పింది. కానీ ఆ రోజు నాకు ముఖ్యమైన పరీక్ష ఉండటంతో.. స్కూల్‌కి వెళ్తానని చాలాసేపు మారాం చేశాను. కానీ మా మమ్మీ వినిపించుకోలేదు. ‘‘అవసరం అయితే జ్వరం తగ్గాక స్కూల్‌కి వచ్చి ప్రిన్సిపాల్‌తో నేను మాట్లాడతాను’’ అని సర్దిచెప్పింది. దాంతో టాబ్లెట్స్‌ వేసుకుని.. సోఫాలోనే నిద్రపోయాను. సరిగ్గా మధ్యాహ్నం మూడు అయ్యేసరికి నాకు మెలకువ వచ్చింది. అంటే సుమారు 10 గంటల పాటు నేను నిద్రపోయాను. అప్పటికి నాకు జ్వరం పూర్తిగా తగ్గింది.

దాంతో ‘‘నేను.. స్కూల్‌కి వెళ్తాను, కొన్ని క్లాసులకైనా అటెండ్‌ అయినట్లుంటుంది కదా’’ అని.. మళ్లీ మా మమ్మీని బతిమాలాను. ఈసారి తను అంగీకరించింది. చివరికి నేను స్కూల్‌ క్యాంపస్‌లో అడుగుపెట్టేసరికి.. నా క్లాస్‌మేట్స్‌ చాలామంది క్లాస్‌ రూమ్‌ బయటున్నారు. వాళ్లంతా నన్ను చూసి.. ‘‘ఎక్కడి నుంచి వస్తున్నావ్‌’’ అని అడిగారు. ‘‘ఇంటి నుంచి! ఉదయం నుంచీ జ్వరం.. అందుకే ఉదయం రాలేకపోయాను’’ అని చెప్పాను. అంతా వింతగా చూశారు. కొందరైతే.. ‘‘అదేంటీ నువ్వు ఫస్ట్‌ అవర్‌ నుంచి ఇక్కడే ఉన్నావ్‌ కదా?’’ అని అడిగారు. ఆశ్చర్యపోయాను. మా టీచర్స్‌ కూడా అదే మాట చెప్పారు. ప్రతి ఒక్కరూ నన్ను ఆ రోజు స్కూల్లో మొదటి అవర్‌లో క్లాస్‌కి రావడం చూశామని అనడంతో నాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి.

సాధారణంగా నాకు మొదటి బెంచ్‌లో కూర్చునే అలవాటు ఉండటంతో వాళ్లు పొరబడే అవకాశం లేదని తేలింది. అయితే ఆ సమయంలో క్లాసుకైతే వచ్చాను కానీ యాక్టివ్‌గా లేనట. ఫస్ట్‌ అవర్‌లో నాతో కొందరు మాట్లాడటానికి ట్రై చేస్తే.. నేను మాట్లాడలేదని.. చాలా గంభీరంగా ఉన్నానని గుర్తు చేసుకున్నారు. ‘‘నేను మా ఇంట్లో నిద్రపోతే.. ఇక్కడి ఎలా వచ్చాను?’’ అనేది నాకు ఏమాత్రం అర్థం కాలేదు. ‘‘ఎంతసేపటి క్రితం కనిపించాను? ఎక్కడెక్కడ తిరిగాను?’’ అంటూ నా స్నేహితుల్ని చాలా ప్రశ్నలు వేశాను. ‘‘చాలాసేపు క్లాసులో ఎవరితోనూ మాట్లాడకుండా కూర్చున్నావ్‌.. తర్వాత క్లాస్‌  పూర్తి అయ్యాక ఎప్పటిలానే.. బుక్స్‌ లాకర్స్‌ దగ్గరకు వెళ్లాం.

ఆ తర్వాత నుంచి నువ్వు కనిపించలేదు. మేము కూడా అంతగా గమనించలేదు’’ అని చెప్పారు. నేను కనిపించని సమయం ఏమిటని ఆరా తీస్తే.. అది సరిగ్గా ఇంట్లో సోఫాలోంచి నేను నిద్ర లేచిన సమయం అని తేలింది. అసలు ఇది ఎలా సాధ్యం? నేను ఇంట్లో నిద్రపోవడం నిజమా? లేక స్కూల్‌కి వెళ్లడం నిజమా? క్లాస్‌మేట్స్‌ మాత్రమే కాకుండా టీచర్స్‌ కూడా నన్ను చూశామని చెప్పడమే నాకు ఆశ్చర్యంగా తోచింది. ఈ అస్పష్టమైన సంఘటన గురించి ఎంత ఆరా తీసినా నాకు సమాధానం దొరకలేదు. పైగా ఆ వయసులో దీని గురించి నేను కూడా అంతగా ఆలోచించలేదు. ఇదే నా జీవితంలో మరచిపోలేని వింత అనుభవం’ అని రాసుంది ఆ మెయిల్‌లో.

అసలు ఆ వ్యక్తి ఎవరు? అది ఏ స్కూల్‌? ఏ ఇయర్‌లో ఇలా జరిగింది? రాసిన వారు అమ్మాయా? అబ్బాయా? తనకు ప్రస్తుతం ఎంత వయసు? తను రాసింది నిజమా అబద్ధమా? ఒక మనిషి నిద్రపోతుంటే.. ఆ మనిషి ఆత్మ లక్ష్యాలను ఛేదించడానికి ఎంతదూరమైనా ప్రయాణిస్తుందా? ఏదైనా చేయగలుగుతుందా? కోరిక బలాన్ని బట్టి ఇలా జరిగే అవకాశం ఉందా? అసలు ఇది ఎలా సాధ్యం? లాంటి వేటికీ సమాధానాల్లేవు. దాంతో ఈ కథనం మిస్టరీగానే మిగిలిపోయింది. అయితే ఈ స్టోరీ మాత్రం రకరకాల పూకార్లను మోసుకుంటూ.. వైరల్‌ అవుతోంది.
సంహిత నిమ్మన 

(చదవండి: నడిచే చెట్లను ఎప్పుడైనా చూశారా? చూస్తే షాకవ్వాల్సిందే!)

Advertisement

తప్పక చదవండి

Advertisement