బియ్యం పిండేద్దాం...

Biyyam Pindi Vantalu Special Story In Family - Sakshi

కొత్త సంవత్సరం.. కొత్త బియ్యం.. కొత్త పిండి.. కొత్త వంటలు.. కొత్త రుచులు.. బియ్యం పిండివంటలు చేసి నోటిని కరకరలాడిస్తూ.. రుచుల శబ్దాలతో దుప్పటి కప్పుకున్న సూర్యుడిని నిద్ర లేపుదాం.. బియ్యప్పిండి వంటకాలను  ఆయనకు చూపిస్తూ ఆస్వాదిద్దాం..

పొంగనాలు

కావలసినవి
బియ్యప్పిండి – ఒక కప్పు; బొంబాయి రవ్వ – పావు కప్పు; పెరుగు – ముప్పావు కప్పు; ఉల్లి తరుగు – పావు కప్పు; పచ్చిమిర్చి తరుగు – అర టీ స్పూను; కొత్తిమీర తరుగు – 1 టేబుల్‌ స్పూను; ఉప్పు – తగినంత; వంట సోడా – చిటికెడు

తయారీ

  • ఒక పాత్రలో బియ్యప్పిండి, బొంబాయి రవ్వ, పెరుగు వేసి బాగా కలపాలి ∙కొద్దిగా నీళ్ళు జతచేసి, మరోమారు బాగా కలపాలి (దోసె పిండి కంటే గట్టిగా ఉండాలి)
  • మూతపెట్టి ఐదు నిముషాలు వదిలేయాలి
  • ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు, కొత్తిమీర తరుగు, ఉప్పు, వంట సోడా దీనికి జత చేసి, మరోసారి బాగా కలపాలి
  • స్టౌమీద పొంగణాల స్టాండ్‌ పెట్టి, అన్ని గుంటల్లోనూ సమానంగా నూనె వేయాలి
  • తయారు చేసుకున్న పిండిని, గుంటల నిండుగా వేయాలి
  • మూతపెట్టి, మీడియం మంట మీద మూడు నిముషాలు ఉంచాక, తిరగేసి కొద్దిగా నూనె వేసి మళ్ళీ మూత పెట్టాలి
  • మరో రెండు నిముషాల తరవాత పొంగనాలను ప్లేటులోకి తీసుకోవాలి
  • కొబ్బరి, అల్లం చట్నీలతో వేడిగా అందించాలి.

వడ

కావలసినవి
బియ్యప్పిండి – అర  కప్పు; ఉల్లి తరుగు – అర కప్పు; కొత్తిమీర తరుగు – ఒక టేబుల్‌ స్పూను; పచ్చిమిర్చి తరుగు – ఒక టీ స్పూను; అల్లం తురుము – అర టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; కారం – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – తగినంత

తయారీ

  • ఒక పాత్రలో ఉల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు, అల్లం తురుము, జీలకర్ర, కారం, ఉప్పు, కొత్తిమీర తరుగు, రెండు టీ స్పూన్ల నూనె వేసి, చేతితో బాగా కలపాలి
  • బియ్యం పిండి జత చేస్తూ కలపాలి ∙కొద్దికొద్దిగా నీరు జత చేస్తూ వడ పిండి మాదిరిగా గట్టిగా కలుపుకోవాలి
  • అర చేతికి కొద్దిగా నూనె పూసుకుని, కొద్దికొద్దిగా పిండిని చేతిలోకి తీసుకుంటూ వడ మాదిరిగా వత్తి పక్కన ఉంచుకోవాలి
  • స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, మంటను మీడియంలోకి తగ్గించి ఒత్తి ఉంచుకున్న వడలను నూనెలో వేసి, బంగారు రంగులోకి వచ్చే వరకూ రెండువైపులా వేయించి
  • పేపర్‌ నేప్‌కిన్‌ పైకి తీసుకోవాలి ∙సాస్‌తో అందించాలి.

చిప్స్‌

కావలసినవి
బియ్యప్పిండి – ఒక కప్పు; నీళ్ళు – ఒక కప్పు; ఉప్పు – తగినంత; పసుపు – పావు టీ స్పూను; మిరప కారం – అర టేబుల్‌ స్పూను; జీలకర్ర – అర టేబుల్‌ స్పూను; నూనె – 2 టేబుల్‌ స్పూన్లు + డీప్‌ ఫ్రైకి సరిపడా; నువ్వులు – ఒక టేబుల్‌ స్పూను; కొత్తి మీర తరుగు – ఒక టేబుల్‌ స్పూను

తయారీ

  • స్టౌ మీద ఒక వెడల్పాటి పాత్రలో నీళ్ళు మరిగించాలి
  • ఉప్పు, పసుపు, మిరప కారం, జీలకర్ర, నూనె, నువ్వులు, కొత్తిమీర తరుగు ఒకదాని తరువాత ఒకటి వేసి బాగా కలపాలి
  • స్టౌ ఆపేసి, మరుగుతున్న నీటిలో బియ్యప్పిండి కొద్దికొద్దిగా వేసి, కలుపుతుండాలి
  • కొద్దిగా చల్లారిన తరవాత పిండిని, ఐదు నిముషాల పాటు చపాతి పిండి మాదిరిగా కలపాలి
  • పిండిని పెద్ద పెద్ద ఉండలు చేసుకోవాలి ∙అప్పడాల పీటపై కొద్దిగా బియ్యం పిండి చల్లుతూ పెద్ద చపాతీగా ఒత్తు కోవాలి
  • చాకుతో కావలసిన ఆకారంలో కట్‌ చేసుకోవాలి
  • స్టౌ మీద బాణలిలో నూనె వేడయ్యాక, తయారుచేసి ఉంచుకున్న కాజాలను వేసి, దోరగా వేయించి, ప్లేటులోకి తీసుకోవాలి
  •  బాగా చల్లారాక గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవాలి.

హల్వా

కావలసినవి
బెల్లం – అర కప్పు; బియ్యప్పిండి – కప్పు; నీళ్ళు – కప్పు; ఏలకుల పొడి – అర టీ స్పూను; మిఠాయి రంగు – చిటికెడు; నూనె/నెయ్యి – కొద్దిగా

తయారీ

  • స్టౌ మీద ఒక గిన్నెలో బెల్లం, నీళ్ళు వేసి బెల్లం కరిగే వరకూ కలపాలి
  • ఏలకుల పొడి జత చేసి, స్టౌ కట్టేయాలి ∙కిందకు దింపేసి, చల్లారనివ్వాలి ’ బెల్లం నీళ్లు చల్లారాక బియ్యప్పిండి జత చేసి ఉండలు లేకుండా కలపాలి
  • కొద్దికొద్దిగా నీళ్ళు జతచేస్తూ, దోసె పిండి కంటే కొద్దిగా పలచగా ఉండేలా చేసుకోవాలి ∙చిటికెడు ఉప్పు జత చేయాలి
  • ఈ మిశ్రమాన్ని రెండు పాత్రల్లోకి సమానంగా తీసుకోవాలి ∙చిన్న గిన్నెలో టీ స్పూను నీటికి చిటికెడు మిఠాయి రంగు జత చేసి, కరిగించి ఒక పాత్రలో ఉన్న పిండికి జత చేయాలి
  • ఒక ప్లేటుకు నూనె కానీ, నేయి కానీ పూయాలి
  • స్టౌ మీద వెడల్పాటి పాత్రలో గ్లాసుడు నీళ్ళు పోసి, మరిగించాలి (పైన ఉంచే మూతను వస్త్రంతో గట్టిగా కట్టాలి)
  • నీళ్ళపై ఒక స్టాండ్‌ ఉంచి దాని మీద నెయ్యి లేదా నూనె రాసిన ప్లేటును ఉంచాలి
  • ముందుగా సిద్ధం చేసుకుని ఉంచుకున్న బియ్యప్పిండి మిశ్రమాన్ని ఒక లేయర్‌గా సమానంగా పరవాలి
  • వస్త్రం కట్టిన మూతను ఉంచి ఐదు నిముషాలు ఉడికించాలి
  • మూత తీసి రంగు కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని సమానంగా పరవాలి
  • మూత పెట్టేసి, పది నిముషాల పాటు ఉడికించాలి
  • మంట ఆర్పేయాలి
  • పది నిముషాల పాటు చల్లారిన తరవాత చాకుతో అంచులను జాగ్రత్తగా కట్‌ చేస్తూ, ప్లేటు నుంచి విడదీయాలి
  • కావలసిన ఆకారంలో ముక్కలను కట్‌ చేసుకోవాలి. 

దోసె

కావలసినవి
బియ్యప్పిండి – కప్పు; ఉల్లి తరుగు – పావు కప్పు; పచ్చి మిర్చి తరుగు – ఒక టీ స్పూను; అల్లం తురుము – ఒక టీ స్పూను; కొత్తిమీర తరుగు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; పసుపు – పావు టీ స్పూను; మిరప కారం – అర టీ స్పూను
తయారీ

  • ఒక పాత్రలో బియ్యప్పిండి, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు, అల్లం తురుము, కొత్తి మీర తరుగు, జీలకర్ర, ఉప్పు, పసుపు, మిరప కారం ఒక దాని తరువాత ఒకటి వేస్తూ బాగా కలుపుకోవాలి
  • కొద్దికొద్దిగా నీరు జత చేస్తూ దోసె పిండి మాదిరిగా కలుపుకోవాలి
  • చివరిగా రెండు గ్లాసుల నీళ్ళు జత చేసి, బాగా పలచగా చేసుకోవాలి
  • స్టౌ మీద పెనం వేడయ్యాక, గరిటెడు పిండి తీసుకుని, పలచగా దోసె వేసి, ఎర్రగా కాలాక నూనె వేసి, రెండో వైపు కూడా కాల్చి ప్లేటులోకి తీసుకోవాలి  కొబ్బరి చట్నీతో అందించాలి.

చపాతీ

కావలసినవి
బియ్యప్పిండి – అర కప్పు; గోధుమ పిండి – అర కప్పు; ఉప్పు – తగినంత; నూనె – తగినంత

తయారీ

  • ఒక పాత్రలో బియ్యప్పిండి, గోధుమ పిండి, ఉప్పు వేసి కలపాలి
  • నీరు జత చేస్తూ చపాతీ పిండి మాదిరిగా కలుపుకోవాలి
  • చివరగా కొద్దిగా నీరు జత చేసి, బాగా కలిపి మూత పెట్టి అరగంట సేపు పక్కన ఉంచాలి
  • పిండిని ఉండలు చేసుకోవాలి
  • అప్పడాల పీటమీద పొడి పిండి జల్లుకుంటూ ఒక్కో చపాతీని ఒత్తుకోవాలి
  • స్టౌ మీద పెనం వేడయ్యాక ఒక్కో చపాతీని, నూనె జత చేస్తూ కాల్చాలి
  • రెండువైపులా బంగారు రంగులోకి వచ్చే వరకూ కాల్చాలి
  • వేడి వేడి కుర్మాతో తింటే రుచిగా ఉంటాయి.
Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top