Munni Devi: ఇస్త్రీ చేసే మున్ని ఎంఎల్‌సి అయ్యింది

Bihar woman Munni Devi elected member of Legislative Council - Sakshi

బట్టలు ఉతికి, ఇస్త్రీ చేసి జీవించే 40 ఏళ్ళ మున్నీ రజక్‌ ఎం.ఎల్‌.సి. అయ్యింది. అందుకు కారణం ఆమె గట్టిగా మాట్లాడగలగడం. పెద్దగా అరవగలగడం. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పాల్గొనే ర్యాలీల్లో ఆమె గొంతు చించుకుని నినాదాలు చేస్తుంది. ధర్నాల్లో ముందు వరుసలో కూచుని టీవీలకు బైట్లు ఇస్తుంది. ఎన్‌డిఏ గవర్నమెంట్‌ను విమర్శిస్తూ ధైర్యంగా పాటలు పాడుతుంది. ఇవన్నీ ఆర్‌.జె.డి నేత లాలూను మెప్పించాయి. ఆమెను నిజమైన కార్యకర్తగా గుర్తించి తమ పార్టీ తరఫున ఎం.ఎల్‌.సి.ని చేశాడు. 75 మంది సభ్యుల విధాన పరిషత్‌లో కూచోబోతున్న మున్నీ రాజకీయాల మురికిని కూడా వదలగొడతానంటోంది.

కొన్ని ఘటనలు కొందరి మేలుకు జరుగుతాయి.
2019.
జుడీషియల్‌ కస్టడీలో ఉన్న రాష్ట్రీయ జనతాదళ్‌ పార్టీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ రాంచీలోని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో చికిత్స పొందుతున్నారు. బయటంతా రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన అభిమానులు. రాంచీకి 300 కిలోమీటర్ల దూరం ఉన్న భక్తియార్‌పూర్‌లో అక్కడి రైల్వేస్టేషన్‌ పక్కన ఇస్త్రీ బండి పెట్టుకుని జీవించే మున్నీ అంత దూరం నుంచి రాంచీకి లాలూని చూడటానికి వచ్చింది. కాని సెక్యూరిటీ వాళ్లు ఆమెను లోపలకు వదల్లేదు. దాంతో ఆమె టీవీ కెమెరాల ముందు పెద్దపెద్దగా ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ ‘నా దేవుడు లాలూని అన్యాయంగా కేసుల్లో ఇరికిస్తారా...’ అంటూ లాలూకు మద్దతుగా విపరీతంగా మాట్లాడింది. ఇది లాలూ కంట పడింది. ఆయన మెచ్చాడు.

కట్‌ చేస్తే –
భక్తియార్‌పూర్‌లో నడుచుకుంటూ వెళుతున్న మున్నీ పక్కనే మొన్నటి జూన్‌ మొదటి వారంలో ఒక జిప్సీ ఆగింది. ‘ఎక్కు’ అన్నారు అందులో ఉన్నవారు. బిహార్‌లో అధికారంలో ఉన్నది జె.డి.యు, బిజెపి అలెయెన్స్‌ ప్రభుత్వం. తాను ఆర్‌.జె.డి కార్యకర్త. పోలీసులు కాదుకదా అని భయపడింది. కాదు తమ పార్టీ వాళ్లే. అక్కడికి గంట దూరంలో ఉన్న పాట్నాలో రబ్రీదేవి బంగ్లాకు తీసుకెళ్లారు. లోపల రబ్రీ దేవి, పెద్ద కొడుకు తేజ్‌ ప్రతాప్‌ ఉన్నారు.

‘లాలూగారు నిన్ను ఎం.ఎల్‌.సి చేయడానికి నిశ్చయించుకున్నారు’ అని వారు తెలిపితే మున్నీకి మాట రాలేదు. కృతజ్ఞతలు చెప్పి బయట పడింది. ఈ విషయం రాష్ట్రమంతా చర్చనీయాంశం అయ్యింది. అయితే ‘అయినప్పుడు చూద్దాం’ అని కొందరు అనుకున్నారు. మరోవైపు పార్టీలో రజక వర్గానికే చెందిన మరొక నాయకుడు చురుగ్గా పని చేస్తున్నాడు. రజకులలో ఇవ్వాలనుకుంటే అతనికే ఇస్తారని ఊహించారు. కాని అంచనాలు తారుమారయ్యాయి. జూన్‌ 20న జరగనున్న ఎం.ఎల్‌.సి. ఎన్నికల్లో ఆర్‌.జె.డి. తరఫున పోటీ లేకుండానే గెలిచింది మున్నీ రజక్‌.

ముగ్గురు పిల్లల తల్లి
మున్నీ ముగ్గురు పిల్లల తల్లి. భర్త అవదేశ్‌ రజక్‌ కూడా వృత్తి పనే చేస్తున్నాడు. వీరికి భక్తియార్‌పూర్‌లోని రైల్వేస్టేషన్‌ పక్కనే ఉండే ఇస్త్రీ బండి ఆధారం. అయితే గత పదేళ్లుగా మున్నీ ఆర్‌.జె.డి. కార్యకర్తగా మారింది. ఆమె పాటలు పాడగలదు. పార్టీ సభలకు స్టేజ్‌ మీద పాటలు పాడుతుంది. అంతేకాదు లోకల్‌ టీవీ చానల్స్‌లో ఆమె పార్టీ విధానాలకు పెద్ద పెద్దగా అరిచి చెప్తుంది. నితీష్‌ ప్రభుత్వాన్ని బాగా తిట్టి పోస్తుంది. ఇవన్నీ పార్టీని ఆకర్షించాయి. ‘అట్టడుగు స్థాయి కార్యకర్తలను లాలూ అభిమానిస్తారని చెప్పడానికి, ఆ స్థాయి వారికి కూడా పదవులు దక్కుతాయని చెప్పడానికి మున్నీ ఎంపిక ఒక ఉదాహరణ’ అని ఆర్‌.జె.డి. నేతలు అంటున్నారు.

మున్నీ చాలా ఉత్సాహంగా పని చేయాలనుకుంటోంది. ప్రతిపక్షంలో గట్టిగా మాట్లాడేవాళ్లదే పైచేయి కాబట్టి విధాన పరిషత్‌లో ఆమె విమర్శలు అధికార పార్టీని ఇరుకున పెట్టడం ఖాయమని కొందరు విశ్లేషిస్తున్నారు. మున్నీ రజక్‌ గురించి మున్ముందు మనం మరిన్ని విశేషాలు వినడంలో ఆశ్చర్యం లేదు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top