
భారతీ సింగ్.. హాస్యప్రియులకు సుపరిచితమైన పేరు! దేశంలోని తొలి తరం మహిళా స్టాండప్ కమేడియన్లలో ఒకరు.. ద గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ చాలెంజ్ ఫేమ్, రియాలిటీ షోస్ పార్టిసిపెంట్ అండ్ హోస్ట్.. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... తన పేరుకు ముందు ఇన్ని విశేషణాలున్న భారతీ సింగ్ వాళ్లింట్లో అన్‌వాంటెడ్ చైల్డ్ అట. ఆమెకు ఇద్దరు తోబుట్టువులు. అన్న, అక్క తర్వాత ఆమె.
మనసులో మాట విన్నట్టుగా దేవుడు ఒక కొడుకు, కూతురుని ఇచ్చాడు.. ఇంక సంతానం చాలు అనుకుందట భారతీ వాళ్లమ్మ. కానీ మూడోసారీ గర్భం దాల్చింది. మూడో నెల వచ్చేదాకా ఆమెకు తెలీలేదు. తెలియగానే గాభరా పడిందట. ఎందుకంటే భారతీ సింగ్ తండ్రి ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో చిరుద్యోగి. ముగ్గురు పిల్లలను పెంచేంత ఆర్థిక స్థోమత లేదని ఇద్దరు పిల్లలే చాలనుకుంది భారతీ సింగ్ వాళ్లమ్మ.
అందుకే మూడో బిడ్డ కడుపులో పడిందని తెలియగానే గర్భస్రావం కోసం చెట్ల మందుల నుంచి, బొప్పాయి, ఖర్జూర పళ్లను తెగ తిన్నదట. బరువైన పనులు చేస్తే గర్భస్రావం అవుతుందని ఉదయం నుంచి రాత్రి దాకా వంచిన నడుము ఎత్తకుండా పనిచేసిందట. అయినా గట్టి పిండం.. భూమ్మీద పడింది. ఆసుపత్రికి వెళితే ఖర్చని.. ఇంట్లోనే కన్నదట. బొడ్డుతాడు కత్తిరించడానికి మంత్రసానిని మాత్రం పిలిపించిందట.
అందుకు ఆ మంత్రసాని అరవైరూపాయలు తీసుకుందట అంతే! అందుకే భారతీ సింగ్ అంటుంది ‘కేవలం అరవై రూపాయల ఖర్చుతో నేను పుట్టాను’ అని... రానీయకుండా చేద్దామనుకుంది కానీ.. పుట్టాక నన్నే ఎక్కువ గారంగా చూసింది. నా రెండో ఏటనే నాన్న చనిపోయాడు. అయినా మా ముగ్గురికీ ఏ లోటూ తెలియనివ్వలేదు. తల్లీతండ్రీ తానై కష్టపడి పెంచింది. అందుకే అమ్మంటే నాకు చాలా ఇష్టం’ అని చెబుతుంది భారతీ సింగ్.
ప్రముఖ పాడ్‌కాస్టర్ రాజ్ శమానీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలన్నీ పంచుకుంది అమృత్‌సర్ వాసి భారతీ. ‘మూడో సంతానం వద్దనుకున్న అమ్మ .. అబార్షన్‌తో నన్ను భూమ్మీదకు రాకుండా చేద్దామనుకుంది. నా జోకులతో జనాలను చావగొట్టే రాత రాసుంది కాబట్టి.. వచ్చాను. వద్దనుకున్న బిడ్డకు ఆసుపత్రి ప్రసవం ఎందుకని కేవలం 60 రూపాయల ఖర్చుతో నాకు జన్మనిచ్చింది. కానీ నేను అమ్మకు ఇప్పుడు కోటీ అరవై లక్షల రూపాయల ఖరీదు చేసే ఇల్లును గిఫ్ట్‌గా ఇచ్చాను.. నన్ను కన్నందుకు కృతజ్ఞత గా... అని సగర్వంగా చెబుతుంది.
(చదవండి: అందానికే అందం స్నేహ..! ఆమె ఇష్టపడే ఫ్యాషన్ బ్రాండ్స్..!)