Chinta Chiguru: చింతలు తీర్చే చిగురు

Benefits Of Tamarind Tree Pale Leaves - Sakshi

చింత చిగురు.. ఇప్పుడంటే అంతా కమర్షియల్‌ అయింది కానీ గతంలో పల్లెటూర్లలో అలా నడుచుకుంటూ వెళ్లి కోసుకొచ్చుకొనేవాళ్లు. పప్పులో, పచ్చడిలో, పులుసులో ఇలా పలు వంటకాల్లో చింతచిగురు చేరిస్తే దాని రుచే వేరంటారు భోజన ప్రియులు. కేవలం రుచి కోసమే కాదని, చింత చిగురు వల్ల మనకు ఆరోగ్యకర ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. ప్రధానంగా ఏప్రిల్‌– జూలై మాసాల్లో దొరికే చింత చిగురుతో ఎన్నో లాభాలున్నాయి, అవేంటో చూద్దాం..

ఇందులోనే ఫైబర్‌ కంటెంట్‌ కారణంగా మలబద్దకం సమస్య తొలగిపోతుంది. విరేచనం సులభంగా అయ్యేలా చూస్తుంది. పైల్స్‌ ఉన్న వారికి, జీర్ణాశయ సంబంధ సమస్యలు ఉన్నవారికి చింతచిగురు బాగా పనిచేస్తుంది. చింతచిగురులో ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటంతో శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. టడయాబెటీస్‌ ఉన్న వారు చింత చిగురును ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయి క్రమంగా తగ్గుతుంది. ఇందులోని విటమిన్‌ సి, యాంటీ ఆక్సిడెంట్లు, టార్టారిక్‌ యాసిడ్, ఆస్కార్బిక్‌ యాసిడ్‌ తదితరాలు రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు ఎముకల ధృఢత్వానికి తోడ్పడతాయి. చింత చిగురును మెత్తగా నూరి కీళ్లపై ఉంచితే నొప్పులు, వాపులు తగ్గుతాయి.

చింత చిగురును ఉడికించిన నీటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి, మంట, వాపు, పగుళ్లు వంటి నోటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. స్కర్వీ, మలేరియా వ్యాధులకు కూడా ఈ చిగురు చక్కగా పనిచేస్తుంది. కడుపులోని నులి పురుగులకు కూడా చింతచిగురు మంచి ఔషధం. చింతచిగురు టీ కానీ, చింతచిగురును వేణ్ణీళ్లలో మరిగించి కొంచెం తేనె కలుపుకుని తాగినా కానీ సాధారణ జలుబు, దగ్గులాంటివి మాయం అవుతాయి. చింతచిగురు జ్యూస్‌ ఆడవాళ్ల నెలసరి సమయంలో వచ్చే నొప్పులు తగ్గిస్తుంది. నేత్ర సంబంధ సమస్యలను కూడా చింత చిగురు దూరం చేస్తుంది. కళ్లు దురదగా ఉన్నప్పుడు కొంత చింత చిగురు తింటే వెంటనే ఉపశమనం లభిస్తుంది. థైరాయిడ్‌ సమస్య కూడా దీనివల్ల తగ్గుముఖం పడుతుంది. 

కేవలం చిన్న చిన్న రోగాలకే కాదు.. పలు రకాల కాన్సర్లు రాకుండా చూసే ఔషధ గుణాలు చింత చిగురులో ఉన్నాయి. వందగ్రాముల చింత చిగురులో దాదాపుగా 239 కాలరీల శక్తి, ఒక్కగ్రాము ఫ్యాట్, 3 గ్రాముల ప్రోటీన్, 26 ఎంజీ సోడియం, 63 గ్రాముల కార్బోహైడ్రేట్స్‌ ఉంటాయి. దాదాపు 16 శాతం ఐరన్, 6 శాతం విటమిన్‌ సీ, 1 శాతం విటమిన్‌ ఏ ఉంటాయి. సో... ఈసారి చింతచిగురు కనిపిస్తే వదలకండి!

(చదవండి: నవ్వు మాత్రమే కాదు.. ఏడుపూ మంచిదే.. !)

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top