నవ్వు మాత్రమే కాదు.. ఏడుపూ మంచిదే.. !

Crying Sometimes Better To Health Also - Sakshi

నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయన్నాడు మనసు కవి ఆత్రేయ. జైవిక భావోద్వేగాలలో ఏడుపు కూడా ఒకటి. ఎక్కువ ఆనందం లేదా బాధ కలిగినా వెంటనే కళ్ళలోంచి నీళ్లు ఉబికి వస్తుంటాయి. అయితే బాధతో వచ్చే కన్నీళ్లనే ఏడుపు అనడం పరిపాటి. ఏడుపంటే బాధకు చిహ్నం అనుకుంటాం కానీ, ఏడవడం వల్ల కూడా ఎన్నో లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

టెక్నాలజీ ఎంత వేగంగా అభివద్ధి చెందుతుందో మనిషి కూడా అంతేవేగంగా దాన్ని అందిపుచ్చుకునేందుకు ఉవిళ్లూరుతున్నాడు. ఈక్రమంలో ఉరుకులుపరుగుల జీవనంతో తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నాడు. కాస్త స్ట్రెస్‌ను తగ్గించుకునేందుకు వ్యాయామం, లాఫర్‌ యోగా వంటివి ప్రయత్నించి సేదతీరుతున్నాడు. ఈ క్రమంలో మనిషి ఆరోగ్యానికి నవ్వు ఎంతముఖ్యమో ఏడుపు కూడా అంతే ముఖ్యమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఏడవడం వల్ల లాభలేంటో చూద్దాం..

  • ఎక్కువ సమయం మనం దేనిగురించైనా బాధపడుతూ ఏడిస్తే మన మెదడులో ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్‌ అనే ఫీల్‌ గుడ్‌ రసాయనాలు విడుదల కావడంతో శారీరక, మానసిక భావోద్వేగాలకు సంబంధించిన మార్పులు కలుగుతాయి.
  • ఈ రసాయనాలతో శరీరానికి నొప్పిని తట్టుకునే సామర్థ్యం పెరుగుతుంది.
  • ఏడవడం వల్ల మెదడు శరీర ఉష్ణోగ్రతలు సంతులితంగా ఉంటాయి. దీంతో మనం సమన్వయంతో ఆలోచించగలుగుతాం ∙అప్పుడప్పుడు ఏడవటం ద్వారా మన బి.పి కూడా కంట్రోల్‌ అవుతుంది. దీంతో గుండె సంబంధిత సమస్యలు ఏవీ దరిచేరవు.
  • కళ్ల నుంచి నీరు కారడం వల్ల  కంటికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి మన కళ్లల్లో ఉండే దుమ్ము, మలినాలు బయటకు పోగొడతాయి.
  • కన్నీళ్లలో ఉండే ఐసోజైమ్‌లు .. క్రిములు, బ్యాక్టీరియాల నుంచి కన్నుకు రక్షణ కల్పిస్తాయి.
  • కన్నీళ్లు రావడం వల్ల చెడు ఆలోచనలు దూరం కావడంతోపాటు, మానసిక ప్రశాంతత కలిగి పాజిటివ్‌ ఆలోచనల వైపు దృష్టి మరులుతుంది.

కన్నీళ్లు మూడు రకాలుగా ఉంటాయి.
మొదటిది: బాసల్‌ టియర్స్‌... నిమిషానికి ఒకటి నుంచి రెండు మైక్రోలీటర్ల వరకు ఉత్పత్తి అయ్యే ఈ కన్నీళ్లు కళ్లను తేమగా ఉంచడంతోపాటు ఇన్‌ఫెక్షన్‌ల నుంచి కాపాడతాయి.
రెండోది: రెప్లెక్స్‌ టియర్స్‌..ఉల్లిపాయలు కోసినప్పుడు, కళ్లల్లో దుమ్మూధూళి పడ్డప్పుడు కళ్ల మంటను తగ్గించడానికి ఉపయోగపడతాయి.
మూడోది: ఎమోషనల్‌ టియర్స్‌..ఇది ఎక్కువగా భావోద్వేగాలకు గురైనప్పుడు కళ్లనుంచి నీరు ఉబికి వస్తుంది. దీని వల్ల మానసిక ఒత్తిడి దూరమవుతుంది. ఇదండీ కన్నీళ్ల కథ!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top