మంచివాడు అనుకుని ఫొటోలు, వివరాలు షేర్‌ చేసింది.. కానీ

Be Careful: Cheaters In Dating Apps Dont Share Your Details - Sakshi

అందమైన వల

రాధిక (పేరు మార్చడమైనది) డిగ్రీ పూర్తి చేసింది. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కానీ, తనకు నచ్చే వ్యక్తిని తను ఎంచుకోవాలనుకుంది. అందుకు తగినట్టుగా డేటింగ్‌ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకొని, తన వ్యక్తిగత వివరాలు ఇచ్చింది. ఎంతోమంది ఫ్రొఫైల్స్‌ పంపారు. వాటిలో తనకు నచ్చిన వాటిని ఎంపిక చేసుకుంది. అలా పరిచయం అయిన వాడే కుమార్‌ (పేరు మార్చడమైనది). కుమార్‌ మాటలు, ప్రవర్తన రాధికకు బాగా నచ్చాయి. చూడ్డానికి చాలా అందంగా ఉన్నాడు.

ఇంజినీరింగ్‌ చేశాడు. మంచి కంపెనీలో జాబ్‌. అన్ని విధాలా తనకు అనువైనవాడు అనుకుంది. తన ఫొటోలు, వివరాలు కూడా అతనితో షేర్‌ చేసుకుంది. కుమార్‌ కుటుంబ నేపథ్యం తెలిశాక ఇంట్లో పెద్దలతో మాట్లాడి సంబంధం ఓకే చేయించాలనుకుంది. బయట విడిగా కలవాలనుకున్నారు కానీ, కుమార్‌ ఉండేది బెంగళూరులో. ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని చెప్పాడు. ఇద్దరి మధ్య ఎలాంటి అరమరికలు లేకుండా ముందే అన్నీ మాట్లాడుకుంటే బాగుంటుందని కుమార్‌ చెప్పడంతో సరే అంది రాధిక. 
∙∙ 
రెండు రోజులుగా కుమార్‌ చాటింగ్‌ చేయడం లేదు. ఫోన్‌ చేస్తే స్విచ్డ్‌ ఆఫ్‌ వస్తోంది. ఆన్‌లైన్‌లో రెండు కూడా కనిపించడం లేదు. మరుసటి రోజు ఉదయాన్నే వార్తలు చూస్తోంది రాధిక. అందులో... ‘‘డేటింగ్‌ యాప్‌లు, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయాలు పెంచుకున్న కుమార్, వారి అర్ధనగ్న చిత్రాలు, వీడియోలను అడ్డుగా పెట్టుకొని లక్షల్లో డబ్బు లాగుతున్నాడని, ఇలా మోసపోయినవారిలో 200 మంది యువతులు, 100 మందికి పైగా మహిళలు ఉన్నారనీ...జల్సాలకు అలవాటు పడి గతంలో గొలుసు చోరీలు, ఇళ్లలో దొంగతనాలు కూడా చేశాడని, పరిచయస్తుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపి బంగారం తీసుకొని పారిపోయాడనీ’’ ఉంది. 


షాకైన రాధిక ఇంకెప్పుడూ తెలియని వ్యక్తులతో ఫోన్‌లో కూడా సంభాషించకూడదు అనుకుంది. మంచివాళ్లుగా అనిపించే మహామాయగాళ్లు చేతిలో ఉన్న ఫోన్‌ ద్వారానే మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారని అర్థం చేసుకుంది.  ‘ఇలా అయితే, ఎవరికైనా ప్రమాదమే. ఈ డేటింగ్‌ యాప్స్‌ అన్నీ బ్యాన్‌ చేస్తే ఎంతో మంది యువతులు, గృహిణులు సురక్షితంగా ఉంటారు’ అనుకుంది. అన్ని యాప్స్‌లో తన వివరాలన్నీ తొలగించి, హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది. 

వీడియోలు షేర్‌ చేయవద్దు
డేటింగ్‌ యాప్‌లో మీరు ఎంటర్‌ అవుతున్నారంటేనే అక్కడ నకిలీ ప్రొఫైల్స్‌ ఉంటాయని, మోసపుచ్చే మనుషులు ఉంటారని ముందే అవగాహనతో ఉండాలి. అవతలి వారి మాటలు వేటిని ఉద్దేశించి ఉంటున్నాయో వారి చాటింగ్‌ చదివితే ఇట్టే అర్థమైపోతుంది. అలాంటి వ్యక్తులతో సంభాషణ అంత సురక్షితం కాదు. పరిచయం అయ్యేవరకు డేటింగ్‌ యాప్‌ను వాడుకొని, రియల్‌ లైఫ్‌ నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం తమ పెద్దవారిని కలవమని చెప్పాలి. అంతే కాని మాయమాటలు నమ్మి బయటకు వెళ్లి కలవడం, వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు షేర్‌ చేయడం మంచిది కాదు. ఒకవేళ మోసపోయామని గుర్తించినా, పరువు పోతుందని ప్రాణం పోగొట్టుకోకూడదు. వీడియోకాల్స్‌ రికార్డ్‌ చేయడం, చాటింగ్‌ సేవ్‌ చేసుకోవడం వంటి ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఏమైనా జరిగితే, తల్లిదండ్రులకు చెప్పడం, పోలీసులకు పిర్యాదు చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది. మీ వివరాలు బయటకు రాకుండా, నేరస్తులను పట్టుకుంటాం. మోసపూరిత సమస్యల్లో ఇరుకున్నామనిపిస్తే సైబర్‌మిత్రా, మహిళామిత్ర వెబ్‌సైట్‌లలో కంప్లైంట్‌ ఇవ్వచ్చు. 


– జి.ఆర్‌. రాధిక, ఎస్పీ, (సైబర్‌ క్రైమ్‌ విభాగం), ఏపీ పోలీస్‌ 

గోప్యతా నిబంధనలు తప్పనిసరి
వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకోవడం అనేది ఈ రోజుల్లో బాగా చర్చించాల్సిన, అవగాహన పెంచుకోవాల్సిన విషయం. ఈ ఆధునిక జీవనంలో స్మార్ట్‌గా మోసం చేసే వ్యక్తులు ఒక్క క్లిక్‌ అంత దూరంలో ఉంటారనే విషయాన్ని విస్మరించ కూడదు. ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్, ఇతర డేటింగ్‌ యాప్స్‌ ఏవైనా మీ గోప్యతా నిబంధనలు తప్పక పాటించండి. అందులో సెట్టింగ్స్‌ను అర్ధం చేసుకోవాలి. మీరున్న లొకేషన్‌ను టర్న్‌ ఆఫ్‌ చేయాలి. మీ ఫొటోలు ఆన్‌లైన్‌లో పోస్ట్‌ చేయడం పట్ల జాగ్రత్త వహించాలి. మీ స్నేహితులు పంపినవి అయినా సరే, సోషల్‌ మీడియాలో వచ్చే లింక్‌లపై క్లిక్‌ చేయడం మానుకోవాలి. అపరిచితులను ఎప్పుడూ దూరం పెట్టడం మంచిది. 
– అనీల్‌ రాచమల్ల, డిజిటల్‌ వెల్‌బీయింగ్‌ ఎక్స్‌పర్ట్, ఎండ్‌ నౌ ఫౌండేషన్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top