ఆంతర్యమే అమోఘం.. | Bathukamma is celebrated in Telangana and is often called the festival of life | Sakshi
Sakshi News home page

ఆంతర్యమే అమోఘం..

Oct 10 2026 4:36 AM | Updated on Oct 10 2026 4:36 AM

Bathukamma is celebrated in Telangana and is often called the festival of life

బతుకమ్మ

పెద్దింటిలో పూసిన గులాబీలకే కాదు పేదింటి ముంగిట్లో విరిసిన ముద్దబంతికీ, అడవిలో తట్టుకుని నిలిచిన తంగేడుకు నిండుగా దీవించమని వచ్చిన గునుగుకు ప్రకృతిలో పూసే ప్రతి పువ్వుతోనూగుడి కట్టి కొలిచే శక్తి స్వరూపిణి బతుకమ్మ. కుటుంబ సౌభాగ్యం, సంతోషం, శ్రేయస్సుకు ఐక్యంగా కదిలివచ్చి, కొలిచే ఆదిపరాశక్తే బతుకమ్మ. పూలన్నీ కలిసి జనం గొంతులో నింపే సామూహిక స్ఫూర్తి. ఆచరణ, ఆధ్యాత్మికత, ఆనందాన్ని ఒడినిండా నింపుకునే ఆడబిడ్డల కోసం దివి నుంచి భువికి వచ్చిన గౌరమ్మ బతుకమ్మ.

తొమ్మిది రోజులు వేడుకగా అమ్మవారిని కోరినంతగా కొలుచుకునే భాగ్యం బతుకమ్మ రూపంలో తెలంగాణ ఇంటింటికీ చేరింది. జానపద జన జీవనాన్నీ, సాంస్కృతిక వారసత్వాన్ని,ప్రాంతీయ అస్తిత్వాన్ని అందంగా చాటుతూనే ఉంది. దేశ విదేశాలలోనూ నవరాత్రుల శోభ వెలుగులీనుతూ ఉంది. ఆడబిడ్డల వెతలు, అవగాహన కలిగించే కథనాలు పాటల రూపంలో పరవళ్లు తొక్కుతుంటాయి.  

ఎంగిలి పూల బతుకమ్మ: మహాలయ అమావాస్య రోజున మొదలయ్యే బతుకమ్మ ఇంటి పెద్దలను తలచుకోమని సూచిస్తుంది. కుటుంబ పరంపరను గుర్తు చేస్తుంది. ప్రకృతి లో లభించే తంగేడు, గునుగు తదితర పూలతో బతుకమ్మను పేర్చి పసుపు గౌరమ్మ చేసి, బెల్లం పుట్నాల పప్పును నైవేద్యంగా సమర్పించి, అమ్మని ఆరాధిస్తారు. 
    
అటుకుల బతుకమ్మ: రెండోరోజైన పాడ్యమినాడు పూలతో బతుకమ్మను పేర్చి, అటుకులతో చేసిన నైవేద్యం సమర్పిస్తారు.  

ముద్దపప్పు బతుకమ్మ: విదియ నాడు ఉడికించిన పప్పు, పాలు, బెల్లం వంటి పదార్థాలతో  నైవేద్యం సమర్పించడం ఆనవాయితీ. 

నానబియ్యం బతుకమ్మ: తదియనాడు బియ్యాన్ని నానబెట్టి, పాలతో లేదా బెల్లంతో కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు.
అట్ల బతుకమ్మ: చవితి రోజున బతుకమ్మకు బియ్యప్పిండితో చేసిన అట్లను నైవేద్యంగా సమర్పిస్తారు. బతుకమ్మ పాటలు, చప్పట్లు, కోలాటాల నడుమ మహిళలు సామూహికంగా వేడుకల్లో పాల్గొంటారు.

అలిగిన బతుకమ్మ: ఆరోరోజు అలిగిన బతుకమ్మగా పిలుస్తారు. ఆరోనాడు బతుకమ్మ ఆడరు. అలసిన బతుకమ్మ కాలక్రమంలో అలిగిన బతుకమ్మగా పేరు స్థిరపడిపోయింది. కుటుంబ,ప్రాంతీయ సంప్రదాయాలను బట్టి ఆచరణలో మార్పులు ఉంటున్నాయి. 

వేపకాయల బతుకమ్మ: వేపకాయల ఆకారం లో బియ్యప్పిండితో చేసిన వంటకాలను నైవేద్యంగా సమర్పించడం ఈ రోజు ప్రత్యేకత. అందుకే వేపకాయల బతుకమ్మ అంటారు.

వెన్నముద్దల బతుకమ్మ: సప్తమి నాడు కొన్నిప్రాంతాలలో వెన్న, నువ్వులు, బెల్లం వంటి పదార్థాలతో నైవేద్యం సమర్పిస్తారు. 

సద్దుల బతుకమ్మ: బతుకమ్మ పండుగలో ఇదే ప్రధాన ఘట్టం. ఐదు రకాల సద్దులు లేదా చిత్రాన్నాలు తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. పెద్ద పెద్ద పూలబతుకమ్మలను పేర్చి, అపర దేవేరులుగా అలంకరించుకొని పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ తీరొక్క విధాల సౌభాగ్యాలను ప్రసాదించేందుకు గౌరమ్మను కొలుస్తారు. పూల రూపమై వెలిగే బతుకమ్మ ఆంతర్యాన్ని తెలుసుకొని కోరి కొలుద్దాం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement