ఆడి చూపిస్తాడు

The Ban Is Over On Sreesanth - Sakshi

శ్రీశాంత్‌పై నిషేధం ముగిసింది. రీ ఎంట్రీకి నేను సిద్ధం అన్నాడు. ఇంకేం ఆడతావ్‌లే అన్నారెవరో! ఆడి చూపిస్తాడు అన్నారు శ్రీశాంత్‌ భార్య. భార్యగా ఆ మాట అనలేదు. శ్రీశాంత్‌ అభిమానిగా అన్నారు. ఆటను చూసి ప్రేమించి.. ఆట నుంచి నిషేధించారని తెలిసీ.. శ్రీశాంత్‌ని చేసుకున్నారు భువనేశ్వరి. స్టోరీలే లేని లవ్‌.. వీళ్ల లవ్‌ స్టోరీ!!

ఆదివారం జైలు నుంచి విడుదలైనట్లే అయ్యాడు శ్రీశాంత్‌! అవును జైలే. 149 కి.మీ. వేగంతో బంతిని విసరగల పేసర్‌ అతడు. ఏడేళ్లుగా అసలు బంతిని విసిరే అవకాశమే లేకుండా గడిపాడు. ఐపీఎల్‌ స్పాట్‌–ఫిక్సింగ్‌ ఆరోపణలతో జీవితకాల నిషేధాన్ని అనుభవిస్తూ, శిక్ష కుదింపునకు సుప్రీంకోర్టు చేసిన చొరవతో ఈ సెప్టెంబర్‌ 13న విముక్తుడైన 37 ఏళ్ల ఈ క్రికెటర్‌కు అదృష్టవశాత్తూ ఇంకా ఐదారేళ్ల ‘జీవితకాలం’ మిగిలే ఉంది. ఆటే అతడి జీవితం. ‘ఇక ప్రతి బంతినీ సంధిస్తాను చూడండి’ అన్నాడు పగ్గాలు తెగిన ఆనందంలో. ‘ఏం సంధిస్తావ్, వృద్ధుడివైపోలా! నీ మీద పడిన మరక పోతుందేమిటి? కామెంటరీ చెప్పుకుంటూ కాలం గడిపేయ్‌..’ అని తూటాలా ఓ మాట! ఎవరో అజ్ఞాత వ్యక్తి ట్వీట్‌ చేశాడు. వెంటనే ఆ వ్యక్తికి బదులు వెళ్లింది. ‘విచారించకండి. శ్రీశాంత్‌ యంగ్‌గా ఫిట్‌గా ఉన్నారు. క్రికెట్‌లోకి వచ్చిన రోజు ఎంత ఫాస్ట్‌గా ఉన్నారో ఇప్పుడూ అంతే ఫాస్ట్‌గా ఉన్నారు. దేశం పట్ల ఆయన ప్రేమ కూడా అలాగే ఉంది. ముందు మీరు మగవారిలా మీ గుర్తింపును బయటపెట్టుకుని మాట్లాడండి’ అని శ్రీశాంత్‌ భార్య భువనేశ్వరి ట్వీట్‌ చేశారు. అయితే ఆమె శ్రీశాంత్‌ భార్యగా ఆ ట్విటిజన్‌కి వడ్డించలేదు. శ్రీశాంత్‌ అభిమానిగా మాత్రమే ఒక బౌన్సర్‌ వేశారు. భార్యగా ఎప్పుడూ ఆమె చేసేది ఒక్కటే. శ్రీశాంత్‌కి విమర్శలను ఎదుర్కొనే శక్తిని ఇవ్వడం. 

2013 సెప్టెంబర్‌ 13. శ్రీశాంత్‌పై బి.సి.సి.ఐ.  జీవితకాల నిషేధం మొదలైన రోజు. అప్పటికి అతడి పక్కన భువనేశ్వరి లేరు. ఈ దివాన్‌పుర్‌ రాజకుమారితో శ్రీశాంత్‌ పెళ్లి ఏర్పాట్లు జరుగుతుండగానే ఆ నిషేధ ప్రకటన వెలువడింది. శ్రీశాంత్‌ తల్లిదండ్రులు మౌనంగా అయిపోయారు. భువనేశ్వరి తల్లిదండ్రులే జైపుర్‌ నుంచి కొచ్చి వెళ్లి వాళ్ల మౌనాన్ని పోగొట్టారు. ‘‘ఈ పెళ్లి ఆగిపోవడం లేదు’’ అని చేతుల్లో చేతులు వేసి చెప్పారు. ఒకవేళ శ్రీశాంత్, భువనేశ్వరిలది ప్రేమ వివాహం కాకపోయుంటే ఒకే ఒక కారణంతో ఆ పెళ్లి ఆగిపోయి ఉండేది. శ్రీశాంత్‌పై నిషేధం విధించడానికి ముందు అతడిని నెలరోజుల విచారణ కోసం తీహార్‌ జైల్లో ఉంచారు.

అయితే రాజస్థాన్‌ రాచకుటుంబం దాన్నొక విషయంగానే భావించలేదు. కూతురి ప్రేమే ముఖ్యం అనుకుంది. పైగా ఆ సమయంలోనే, తనింకా శ్రీశాంత్‌కి భార్య కాకుండానే అతyì కి అండగా నిలిచారు భువనేశ్వరి! అప్పటికి ఆరేళ్ల ప్రేమ వారిది! ఇరవై నాలుగేళ్ల వయసులో శ్రీశాంత్‌ మ్యాచ్‌ ఆడేందుకు జైపుర్‌ వెళ్లినప్పుడు భువనేశ్వరి స్కూల్‌ విద్యార్థిని. టెన్త్‌ చదువుతోంది. మ్యాచ్‌లో శ్రీశాంత్‌ని చూస్తూ చూస్తూ ప్రేమలో పడిపోయింది. శ్రీశాంత్‌ అరెస్ట్‌ అయిన ఏడాదే, బి.సి.సి.ఐ. అతడిపై జీవితకాల నిషేధం విధించిన ఏడాదే.. డిసెంబర్‌ 12న వాళ్ల పెళ్లి జరిగింది. శ్రీశాంత్‌ ఆటను చూసి ప్రేమలో పడిన అమ్మాయి శ్రీశాంత్‌ ఇక జీవితంలో ఆడలేని తెలిసీ అతడిని చేసుకుందంటే.. ‘ప్రేమంటే ఇదేరా..’ అనుకోవాలి.

ఆటే జీవితం అనుకున్న ప్లేయర్‌కి నిషేధం వల్ల ఏర్పడిన శూన్యాన్ని భర్తీ చేయడానికా అన్నట్లు భువనేశ్వరి శ్రీశాంత్‌ జీవితంలోకి వచ్చారు. మానసికంగా అతడికి బలాన్ని ఇచ్చారు. ఆమె అతడికి ఎంత సపోర్టుగా ఉండేవారో హిందీ బిగ్‌బాస్‌ షోలో వారాంతంలో అతడిని ఆమె కలవడానికి వచ్చినప్పుడు అందరికీ తెలిసింది. గట్టి ఎమోషనల్‌ బాండేజ్‌ ఉంది వాళ్ల మధ్య. అప్పుడే వాళ్ల లవ్‌ స్టోరీ గుట్టును విప్పారు. భువనేశ్వరి తన పదిహేనవ యేట అతడిని ప్రేమిస్తే, శ్రీశాంత్‌ ఆమెకు 20వ యేడు వచ్చే వరకు ఆగి అప్పుడు ఆమెను ప్రేమించడం మొదలు పెట్టాడు. అప్పటి వరకు వాళ్లిద్దరి మధ్య ఉన్నవి ఫోన్‌ సంభాషణలే. అప్పటివరకు అని కాదు. పెళ్లయ్యే వరకు కూడా! శ్రీశాంత్‌ మొదటిసారి భువనేశ్వరి చెయ్యి తాకింది.. పెళ్లిలో మామగారు తన కూతురి చేతిని అతడి చేతిలో పెట్టినప్పుడే! అది కూడా శ్రీశాంత్‌ ఆమె చెయ్యి పట్టుకున్నట్లు లేదు. ఆమే అతడి చేతిని పట్టుకున్నారు. ఈరోజు వరకూ ఆ చేతిని అలా పట్టుకునే ఉన్నారు భువనేశ్వరి. శ్రీశాంత్‌పై విమర్శలు వచ్చినప్పుడు ఆమె చెయ్యి మరింత భద్రంగా అతడిని పట్టుకుంటుంది.
భార్య భువనేశ్వరి, కూతురు శాన్విక, కొడుకు సూర్యశ్రీలతో శ్రీశాంత్‌.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top