అవకాశాల అవసరశాల

Avasarshala: Co founder of Ashwathy Venugopal is social entrepreneur - Sakshi

లాక్‌డౌన్‌ సమయంలో ఇళ్లకే పరిమితమైన పిల్లలను బిజీగా ఉంచడానికి నానా తంటాలు పడ్డారు తల్లిదండ్రులు. అశ్వతీ వేణుగోపాల్‌ మాత్రం పిల్లల భవిష్యత్‌కు ఉపయోగపడే విధంగా, సమయాన్ని సద్వినియోగం చేసే ‘అవసర శాల’నే ప్రారంభించింది. ‘‘పిల్లలు ఎక్కువగా ఆసక్తి కనబరిచే అంశాలు, వారిలో దాగున్న ప్రతిభను వెలికితీసే పోటీలు నిర్వహిస్తూ వారిని బిజీగా ఉంచడమేగాక, ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతోంది. అవసర శాల ఏర్పాటుకు ప్రేరణ ఇచ్చిన కెటిల్‌ సంస్థకే ఇండియా తరపున సభ్యురాలిగా ఎంపికైంది. లాక్‌డౌన్‌ కాలంలో ప్రారంభించిన చిన్న స్టార్టప్‌తో అతికొద్దికాలంలోనే అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన అశ్వతి గురించి ఆమె మాటల్లోనే...

‘‘కేరళలోని మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని నేను. అందరిలాగే కష్టపడి ఇంజినీరింగ్‌ తరువాత ఎంబీఏ చేశాను. క్యాంపస్‌ సెలక్షన్స్‌ లో అమెజాన్‌లో ఉద్యోగం వచ్చింది. అయినా సంతృప్తిగా అనిపించలేదు. ఏదైనా ఫెలోషిప్‌ చేయాలనుకున్నాను. ఈ క్రమంలోనే అంతర్జాతీయ ఫెలోషిప్స్‌ గురించి తెగ వెతికాను. అప్పుడు నాకు చాలా ఫెలోషిప్స్‌ కనిపించాయి. నూటపది దేశాల్లోని 17 నుంచి 26 ఏళ్ల యువతీ యువకుల ప్రతిభను ప్రోత్సహించే స్వచ్ఛంద సంస్థ... ‘నోవెల్స్‌ ఎడ్యుకేషనల్‌ అండ్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ లీడర్‌షిప్‌(కేఈసీటీఐఎల్‌– కెటిల్‌)’లో యూత్‌ప్రోగ్రామ్‌ ఫెలోషిప్‌ చేయడానికి అవకాశం లభించింది.

ఏడాదిపాటు ఆన్‌లైన్‌ ప్రోగ్రామ్‌ జరిగింది. 2019 జూన్‌లో అట్లాంటాలో వారం రోజుల పాటు జరిగే లీడర్‌షిప్‌ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన 27 మందిలో నేను కూడా ఉన్నాను. ఆ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో చాలా మంది చేంజ్‌ మేకర్‌లు, ఎంట్రప్రెన్యూర్‌లు, సామాజిక సేవాకార్యకర్తలు ఉన్నారు. వీళ్లంతా ఏదో ఒకటి సాధించి వచ్చినవారే. 17–20లోపు వాళ్లు వచ్చి వారు ఏమేం చేస్తున్నారో, సమాజంలో ఎటువంటి మార్పులు తీసుకొస్తున్నారో చెబుతుంటే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అప్పుడే నిర్ణయించుకున్నాను నేను కూడా ఏదో ఒకటి చేయాలని.

అవసరశాల
అట్లాంటా నుంచి ఇండియా వచ్చిన తరువాత చాలా ఆలోచించాను. అతి చిన్న వయసులో అనేక దేశాల్లోని పిల్లలు వివిధ రంగాల్లో ఎదిగి చూపిస్తున్నారు. కెటిల్‌ వేదికగా అవన్నీ ప్రత్యక్షంగా చూశాను. ఇండియాలో ఎంతోమంది ఉన్నారు. వారినెందుకు ఆ విధంగా తయారు చేయకూడదు అనిపించింది. అనుకున్న వెంటనే అమెజాన్‌లో ఉద్యోగం వదిలేశాను. నా భర్త సందీప్‌తో కలసి పిల్లల్లో ఉన్న ప్రతిభను వెలికి తేసేందుకు అనేక మార్గాలను అన్వేషించి 2020లో ‘అవసరశాల’ను ప్రారంభించాం. ఒకటోతరగతి నుంచి ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు స్థానికంగా, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న పోటీల లిస్టు తయారు చేశాం.

నవ్వుల పోటీ, ఫ్యాన్సీడ్రెస్, స్టోరీ టెల్లింగ్, గూగుల్‌ జూనియర్‌ కోడింగ్, నాసా స్పేస్‌ కాంటెస్ట్, జాతీయ, అంతర్జాతీయ స్కాలర్‌షిప్పులు, స్టూడెంట్‌ లీడర్‌ షిప్, అంతర్జాతీయ ఇన్నోవేషన్‌ ప్రోగ్రామ్స్, అంతర్జాతీయ ఎస్సే కాంపిటీషన్స్, జాతీయ స్థాయి మ్యూజిక్‌ కాంపిటీషన్, డ్యాన్స్‌ ఫెలోషిప్స్, జూనియర్‌ ఫుట్‌బాల్‌ లీగ్, క్విజ్‌లు, ఒలింపియాడ్స్, అంతర్జాతీయ ఆర్ట్‌ ఎగ్జిబిషన్స్‌ వంటివన్నీ చేపడుతున్నాను. వీటిద్వారా పిల్లల్లో ప్రతిభను వెలికి తీస్తున్నాము. ‘విజ్‌కిడ్స్‌ చాలెంజ్‌’ పేరిట మరో కార్యక్రమాన్ని ప్రారంభించి ఆర్ట్, సైన్స్, లైఫ్‌ స్కిల్స్, కుకింగ్, ఫైనాన్స్, ఇన్నోవేషన్స్‌లో శిక్షణ ఇస్తూ లాక్‌డౌన్‌లో పిల్లల్ని బిజీగా ఉంచాం. దేశవ్యాప్తంగా వేలమంది విద్యార్థులకు వివిధ అంశాలు, ఫెలోషిప్స్‌పై అవగాహన కల్పించి వారిలోని ప్రతిభను వెలికి తీస్తున్నాము. దీంతో వాళ్లు భవిష్యత్‌లో ఏ రంగంలోనైనా రాణించగలరు.

అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి
అవకాశం వచ్చినప్పుడే అందిపుచ్చుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడే జీవితంలో ఎదుగుతామనడానికి నేనే ఉదాహరణ. లాక్‌డౌన్‌ మొదట్లో ప్రారంభించిన అవసరశాల బాగా క్లిక్‌ అవ్వడంతో మంచి ఎంట్రప్రెన్యూర్‌గా ఎదిగాను. కెటిల్‌ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు మార్టిన్‌ లూథర్‌ కింగ్‌–3 ‘‘వచ్చే ఐదేళ్లలో నువ్వు ఏం చేస్తావు?’’ అని నన్ను అడిగారు. అప్పుడు నేను ‘‘ఆరుగురి కంటె ఎక్కువమందికి ప్రేరణగా నిలుస్తాను’’ అని చెప్పాను ‘అవసరశాల’తో ఆరుగురు కాదు వేలమందిని అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ నిరూపించే స్థాయిలో ప్రేరణ కలిగించాను. నా పనికి గుర్తింపుగా ఐకానిక్‌ ఉమెన్‌ ఆఫ్‌ 2020 అవార్డు, టాప్‌టెన్‌ సోషల్‌ ఇన్నోవేటర్, యూత్‌ కోలాబ్‌ నుంచి పీపుల్స్‌ చాయిస్‌ అవార్డులు వంటివెన్నో వరించాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నికైన సభ్యుల్లో ఇండియా నుంచి నేను ఉండటం ఎంతో గర్వంగా ఉంది’’ అని చెబుతోంది అశ్వతి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top