స్కూటీని ఎత్తి మురికి కాలువలో పడేసింది...

Assam Woman Bhavana Kashyap Viral Post - Sakshi

ఎలాంటి క్లిష్టపరిస్థితుల్లోనైనా సరే అమ్మాయిలు భయపడకుండా ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్పే సంఘటనలు దేశంలో అక్కడక్కడా చోటుచేసుకుంటున్నాయి. మహిళలకు ధైర్యమిచ్చే ఘటన ఇటీవల గౌహతిలో జరిగింది. అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో ఉంటున్న భావనా కశ్యప్‌ పని పూర్తిచేసుకొని రుక్మణి నగర్‌లో ఉంటున్న తన ఇంటికి బయల్దేరింది. అదేదో చీకటి పడ్డాక కాదు మధ్యాహ్నం 4 గంటల 30 నిమిషాల సమయం. రోడ్‌ సైడ్‌ నుంచి నడుచుకుంటూ ఇంటికి వెళుతున్న ఆమె వెనకాల ఓ స్కూటీ వచ్చి ఆగింది. ‘సినాకి పథ్‌’కి ఎలా వెళ్లాలి? అడిగాడు ఆ స్కూటీ వ్యక్తి. ఆ స్థలం గురించి తనకు తెలియదని మరొకరిని అడిగి తెలుసుకోమని, ఆమె మళ్లీ నడక మొదలుపెట్టింది. అతను మాత్రం స్కూటీని అతి నెమ్మదిగా నడుపుతూ ఆమెనే అనుసరించడం మొదలుపెట్టాడు. మరొకసారి అతనికి చెప్పింది ఇంకెవరినైనా ఆ అడ్రస్‌ గురించి అడగమని. కానీ, అతను అదేమీ పట్టించుకోలేదు. 

మురికి మనిషి
అతను ఆమె వెనకాల స్కూటీని నడుపుతూ ఉన్నాడు. భావన తన నడకలోని వేగం పెంచింది. అంతటితో ఊరుకోకుండా ఒక చేత్తో స్కూటీ నడుపుతూ, మరో చేత్తో ఆమెను అసభ్యంగా తాకి, వెళుతున్నాడు. ‘ఒక్క క్షణం నాకేమీ అర్ధం కాలేదు. పిచ్చి కోపం వచ్చేసింది. అంత కోపంలోనూ నా రెండవ ఆలోచనను విడిచిపెట్టలేదు. నా బలమంతా ఉపయోగించి పరిగెట్టి, అతని స్కూటీని పట్టుకున్నాను. వెనుక టైర్‌ను ఎత్తి, అంతే బలంతో పక్కనే ఉన్న మురికి కాలువలోకి తోసేసాను. అతను కూడా ఆ కాలువలో పడేవాడే. కానీ, మిస్సయింది’ అని సోషల్‌ మీడియా వేదికగా ఆమెకు కలిగిన బాధ తీవ్రతను పంచుకుంది. 


నిందితుడు రాజశేఖర్‌

తగిన శాస్తి
అతను తప్పించుకునే వీలు తను కల్పించినట్లయితే మరికొందరి మహిళలను టార్గెట్‌ చేసేవాడు. ఇదేవిధంగా బాధించేవాడు. భావన అరుపులు, స్కూటీని డ్రైనేజీలోకి నెట్టేయడం చూసిన చుట్టుపక్కల వాళ్లు అక్కడ గుమిగూడారు. విషయం తెలుసుకున్నారు. ఆ వ్యక్తి భయపడి కాలువ నుండి స్కూటీని బయటకు తీయడానికి సహాయం చేయమని అక్కడ చేరినవారిని ప్రాధేయపడ్డారు. కానీ, అందరూ ఛీత్కరించుకున్నారు.  ద్విచక్రవాహనం మీద వెళుతూ భావనను వేధించిన ఆ వ్యక్తి పేరు మధుసనా రాజ్‌కుమార్‌. అస్సామ్‌లోని పంజాబరిలో ఉంటున్నాడు. అతనిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 

భావనా కశ్యప్‌ ఈ వివరాలను రాస్తూ ‘మహిళలు వీధుల్లో ఒంటరిగా తిరగరాదని, రక్షణ అవసరమని సమాజంలో పాతుకుపోయిన భావజాలం ఎంత మాత్రం సరైనది కాదు. ఈ మగవారి మానసిక అనారోగ్య జాడ్యాన్ని వదిలించే బాధ్యత స్త్రీయే తీసుకోవాలి. ఒంటరిగా ఉన్న మహిళ బలహీనంగా ఉండాల్సిన పనిలేదు. రక్షణా అవసరం లేదు’ అని చేసిన సోషల్‌మీడియా పోస్ట్‌కు ప్రశంసలు అందుతున్నాయి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top