ఆమె సబల

AP Women Commission set up Sabala for women awareness - Sakshi

‘సబల’... మహిళకు భరోసానిచ్చే పదం ఇది.   తన మీద తనకు అనిర్వచనీయమైన నమ్మకాన్ని కలిగించే పదం. తరతరాలుగా నువ్వు ‘అబలవి, బలహీనురాలివి’ అన్నది సమాజం. ‘నువ్వు సబలవి’ అని చెప్పడమే ఓ ముందడుగు. ‘ఆమెకు అండగా ఆంధ్రప్రదేశ్‌’ మహిళ మనసును తాకే నినాదం.

తరతరాలుగా మన సమాజం ‘అబలవి, బలహీనురాలివి’ అనే భావాన్ని మహిళల నరనరాన ఇంకింప చేసింది. ‘నువ్వు అబలవి కాదు, సబలవి’ అని ఎంతగా నినదించినప్పటికీ ‘అబల’ అనే భావం మెదడు నుంచి తొలగిపోయేది కాదు. ఏ మాత్రం అవాంఛనీయం కానీ ఆ భావాన్ని ‘సబల’ అనే మూడక్షరాల పదం క్షణం సేపట్లోనే తుడిచేస్తోంది. తాను సబలననే భావనే మహిళను శక్తిమంతం చేస్తుంది. నామకరణంలోనే విజయవంతమైన ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్‌ మహిళాకమిషన్‌ రూపొందించింది. మార్చి ఎనిమిదవ తేదీన అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం ఏడాదిపాటు కొనసాగే కార్యాచరణ.

కమిషనే మహిళ దగ్గరకు
మహిళాకమిషన్‌ బాధ్యతలు రాజధానిలో ఆఫీస్‌లో కూర్చుంటే పూర్తయ్యేవి కావు. కమిషన్‌ దగ్గరకు వచ్చిన సమస్యను పరిష్కరిస్తే సరిపోదు. బాధిత మహిళలందరూ రాజధానిలో ఉండే కమిషన్‌ కార్యాలయానికి వెళ్లలేకపోవచ్చు. అందుకే ‘తామే బాధిత మహిళల దగ్గరకు వెళ్లాలి. కష్టంలో నీకు మేము తోడుగా ఉన్నామనే భరోసా కలిగించాలి. నీ కష్టం నుంచి బయటపడడానికి దారి ఉంది అని చెప్పాలి, ఆ దారిని చూపించాలి’ అనే ఉద్దేశంతో రాష్ట్రమంతటా కార్యక్రమాలను నిర్వహిస్తోంది మహిళాకమిషన్‌. నిస్సహాయ మహిళ ‘ప్రభుత్వం అనే పెద్ద వ్యవస్థ నాకు తోడుగా ఉంది. నాకేం భయం అక్కరలేదు’ అనుకున్నప్పుడే కమిషన్‌ తన బాధ్యతలను విజయవంతం గా నిర్వహించినట్లు... అంటున్నారు చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ.  
 
చైతన్య సమావేశాలు
‘సబల’ గురించి అవగాహన కల్పించడానికి రీజియన్‌ల వారీగా సెమినార్‌లు నిర్వహిస్తున్నారు. ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల రీజియన్‌కు గుంటూరులో, కృష్ణ, గోదావరి జిల్లాలకు ఏలూరులో సమావేశాలు జరిగాయి. రాయలసీమ జిల్లాలకు కడపలో ఈ నెల 30వ తేదీన, ఉత్తరాంధ్ర జిల్లాలకు విశాఖపట్నంలో ఏప్రిల్‌ ఆరవ తేదీన జరగనున్నాయి. ‘‘మహిళాచైతన్యం విషయంలో ఇంకా వెనుకబడి ఉన్నామనే చెప్పాలి. గ్రామీణ మహిళల కోసం ప్రత్యేకంగా పని చేయాల్సి ఉంటుందని భావించాం.

కానీ ప్రభుత్వ ఉద్యోగినులకు చాలామందికి పని ప్రదేశంలో లైంగిక వేధింపులకు గురైతే ఇంటర్నల్‌ కంప్లయింట్‌ కమిటీలో రిపోర్ట్‌ చేయవచ్చనే విషయం తెలియకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. గత ప్రభుత్వాలు ఆ మేరకు ఉద్యోగినులను డార్క్‌లో ఉంచేశాయని తెలిసినప్పుడు ఆవేదన కూడా కలిగింది. దాంతో ఈ సమావేశాలకు ఉద్యోగినుల తరఫున ప్రతినిధులుగా జిల్లా, మండల స్థాయి ఉమెన్‌ అసోసియేషన్‌ లీడర్‌లను ఆహ్వానిస్తున్నాం. ఈ ఉమెన్‌ లీడర్‌లు ఆయా జిల్లాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి ‘పోష్‌ యాక్ట్‌ (పీఓఎస్‌హెచ్‌) 2013, సెక్సువల్‌ హెరాస్‌మెంట్‌ ఆఫ్‌ ఉమెన్‌ యట్‌ వర్క్‌ ప్లేస్‌ 2013’ గురించి ఉద్యోగినులను చైతన్యవంతం చేస్తారు’’ అని చెప్పారామె.

క్యాంపస్‌ కాప్స్‌
కాలేజీలు, యూనివర్సిటీల్లో క్యాంపస్‌ కాప్స్‌ ఏర్పాటు చేయడం ద్వారా స్టూడెంట్స్‌ అందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తోంది సబల. ఈ కాప్స్‌ తమ దృష్టికి వచ్చిన సమస్యలను స్వయంగా పరిష్కరిస్తారు. వాళ్ల స్థాయిని మించిన అంశం అయితే ఉమెన్‌ కమిషన్‌కు నేరుగా తెలియచేయడానికి వీలుగా ఇందుకోసమే ఒక మెయిల్‌ఐడీ ఉంటుంది. అలాగే ప్రతి విద్యాసంస్థలో ఇంటర్నల్‌ కంప్లయింట్స్‌ కమిటీ జాబితాను తప్పకుండా నోటిస్‌ బోర్డులో ఉంచాలి.  
 
గృహ హింస– గడపదాటని శక్తి
రక్షణ కల్పించాల్సిన నాలుగ్గోడలే కత్తులబోనుగా మారితే ఇక ఆ మహిళ ఏం చేయాలి? సమాజంలోని హింసలో 30 శాతం గృహహింస కేసులేనంటే నమ్ముతారా? వరకట్న నిరోధక చట్టం ఉన్నప్పటికీ నేటికీ మహిళలకు వరకట్న వేధింపులు తప్పడం లేదు. మహిళల భద్రత కోసం రూపొందించిన చట్టాల గురించిన కనీస అవగాహన కూడా ఆ మహిళలకు లేకుండా జాగ్రత్త పడడం ఎంత అనైతికం? మహిళను చైతన్యవంతం చేయడం ప్రభుత్వ కర్తవ్యం మాత్రమే కాదు నైతిక విధి కూడా. ‘నువ్వు అబలవి కాబట్టి మేము ఆసరా ఇస్తాం’ అని చెప్పడం లేదు. ‘నువ్వు సబలవి, నీ శక్తి తెలుసుకో’ అని చెబుతోంది. గృహహింసకు వ్యతిరేకంగా చేసే యుద్ధంలో ఆ యోధ చేతిలో శక్తివంతమైన ఆయుధంగా మారుతోంది మహిళాకమిషన్‌.
 
చర్యలు కఠినంగా ఉండక తప్పదు!
పిల్లలపై లైంగిక వేధింపుల నిరోధానికి, భవిష్యత్తులో దాడులను నియంత్రించడానికి ఏకైక మార్గం... చర్యలు కఠినంగా తీసుకోవడమే. అలాగే తక్షణం స్పందించి చర్యలు తీసుకోవడమూ అవసరమే. లైంగిక వేధింపుల విషయంలో పోక్సో చట్టం గురించి వాళ్లకు తెలియచేసే ప్రయత్నం చేస్తోంది సబల. అలాగే మహిళకు ఎదురయ్యే వేధింపుల్లో తరాలుగా ఎదురవుతున్న సమస్యలిలా ఉంటే... ఇప్పుడు టెక్నాలజీ ఆధారంగా వంచనలు తోడయ్యాయి. ఈ సైబర్‌ నేరాలు, ప్రలోభాల బారిన పడకుండా మహిళలను రక్షించాలంటే ఆ నేరాల పట్ల అవగాహన కల్పించడమే అసలైన మార్గం. ఈ చట్టాల మీద, భద్రత మీద చైతన్యం కలిగించే పోస్టర్లను పంచాయితీ ఆఫీస్‌లో అతికించడంతోపాటు అంగన్‌వాడీ, ఆశా వర్కర్ల సహాయంతో గ్రామీణ మహిళలకు బుక్‌లెట్‌లు పంపిణీ చేస్తోంది ‘సబల’. మహిళలు చేతిలో ఉన్న ఫోన్‌ ద్వారా సమాచారాన్ని చేరవేయడానికి, సమస్యను తెలియాల్సిన చోటకు చేర్చడానికి సులువుగా వాట్సాప్‌ నంబర్‌ను అందరికీ అందుబాటులోకి తెచ్చింది.
 
అండగా నిలుద్దాం!
సబల ద్వారా ఈ ఉద్యమాన్ని గ్రామస్థాయికి తీసుకువెళ్లడమే మహిళాకమిషన్‌ ఉద్దేశం. అత్యాచారం, లైంగికవేధింపులు, హింసను ఎదుర్కోవడానికి మహిళకు ఆసరాగా ఉన్న చట్టాలేమిటో తెలియచేస్తోంది. బాధితుల్లో, బాధిత కుటుంబాల్లో ౖధైర్యం నింపే బాధ్యతను తీసుకుంది ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, చట్టాలు, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రూపొందించిన దిశ వంటి ప్రత్యేక చట్టం గురించి కూడా అవగాహన కల్పిస్తోంది సబల. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ‘ఆమె’కు అండగా నిలబడుతోంది. ‘ఆమె’ తన మనుగడ కోసం చేస్తున్న పోరాటంలో సమాజంలో ప్రతి ఒక్కరూ తమవంతుగా ‘ఆమె’కు అండగా నిలబడాలి.
– వాకా మంజులారెడ్డి

బాధితుల పక్షాన...
పనిప్రదేశాల్లో ఎదురయ్యే సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక, బాధను దిగ మింగుకునే వారెందరో!. పైగా ఫిర్యాదిచ్చిన వారినే దోషిగా చిత్రీకరిస్తూ వేధింపులకు గురిచేస్తున్న వైనాలు అనేకం. ’సబల– ఆమెకు అండగా ఆంధ్రప్రదేశ్‌’ అభాగినులకు అండగా నిలుస్తుంది. ఐసీసీ కమిటీల ఏర్పాటుతో పాటు సబల వాట్సప్‌ నెంబర్‌ ను ఉద్యోగినులకు అందుబాటులోకి తేవడం సముచితం.  
– జి.నిరీష, జూనియర్‌ అసిస్టెంట్, గుంటూరు  
 

మహిళకు మనోధైర్యం  
లైంగిక వేధింపులు, అవమానాలతో కుంగిపోతున్న మహిళలకు ’సబల’ కొండంత అండ. మహిళా ఉద్యోగులకు మనోధైర్యాన్ని కల్పిస్తుంది.  
– బి. సుశీల, చైర్‌ పర్సన్, ఏపీజేఏసీ అమరావతి  

చైతన్యవారధి ‘సబల – అఅఅ’
ఆమెకు అండగా ఆంధ్రప్రదేశ్‌ (ట్రిపుల్‌ ఏ) నినాదాన్ని బలంగా వినిపిస్తున్న సబల ప్రభుత్వానికి మహిళలకు మధ్య చైతన్యవారధి. సంక్షేమంతో పాటు రక్షణ, భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోన్న తరుణంలో.. ఇంటర్నల్, లోకల్‌ కమిటీల ఏర్పాటు ఉద్యమంగా సాగుతోంది.  
 – జి. నిర్మలా జ్యోతి, డిప్యూటీ కమిషనర్‌. (రాష్ట్ర జీఎస్టీ) విజయవాడ
 

మహిళల బలం
సబల సదస్సులు అర్ధవంతమైన చర్చలకు అవకాశమిచ్చాయి. లైంగిక వేధింపులు, హింసనే కాకుండా అనేక సమస్యల సత్వర పరిష్కారానికి సబల సదస్సులు దోహదపడతాయి. చట్టాల పై అవగాహన కల్పించడం మంచిదైంది. ఇప్పటి వరకు వెలుగులోకి రాని పోష్‌ చట్టం సబల వేదికల ద్వారా అందరికీ తెలిసి వస్తోంది.  
– రాజ్యలక్ష్మి, మెంబర్, ఆలిండియా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య, గుంటూరు

‘సబల’ పోటీలు!
ఉమెన్‌ సేఫ్టీ, సెక్యూరిటీ, దిశ చట్టం గురించి స్కూళ్లు, కాలేజీల్లో వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖనం పోటీలు నిర్వహించడానికి ప్రయత్నాలు మొదలు పెడుతున్నాం. పిల్లలకు ఒక విషయాన్ని పదిసార్లు పాఠం చెప్పినట్లు చెప్పడం కంటే ఒక పోటీ ద్వారా వాళ్ల మెదడులో ఆ అంశం ఎక్కువ కాలం నిక్షిప్తమై ఉంటుంది. ఈ పోటీలు అమ్మాయిలకు మాత్రమే పరిమితం కాదు, అబ్బాయిలకు కూడా. రాబోయే తరాలు కూడా ఇదే విషయం మీద శక్తియుక్తులను ధారపోయకుండా ఈ సమస్య ఈ తరంతో ఆగిపోవాలంటే... అమ్మాయిలను చైతన్యవంతం చేయడంతోపాటు అబ్బాయిలను సెన్సిటైజ్‌ చేయడం కూడా అవసరం.  
– వాసిరెడ్డి పద్మ,   చైర్‌పర్సన్, మహిళాకమిషన్, ఆంధ్రప్రదేశ్‌ 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top