ప్రయాణ పాఠాలతో.. ట్రావెల్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌గా ఎన్నో అవార్డులు

Anunay Sood Won The Travel Influencer Of The Year - Sakshi

ప్రయాణ ప్రేమికుడైన అనునయ్‌ సూద్‌ 30 దేశాల వరకు వెళ్లివచ్చాడు. చిన్న వయసులోనే ట్రావెలింగ్‌ అండ్‌ ఫోటోగ్రఫీ రంగంలో పెద్ద పేరు తెచ్చుకున్నాడు నోయిడాకు చెందిన అనునయ్‌ సూద్‌. వ్లోగ్స్, ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో సోషల్‌ మీడియాలో పాపులర్‌ అయిన అనునయ్‌ సూద్‌ ట్రావెల్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌గా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డ్‌లు అందుకున్నాడు. ట్రావెల్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌గా స్విట్జర్లాండ్‌ టూరిజం, విజిట్‌ సౌదీ, న్యూజిలాండ్‌ టూరిజం... మొదలైన సంస్థలతో కలిసి పనిచేస్తున్నాడు... 

‘నాకు ట్రావెలింగ్‌ అంటే ఎందుకు ఇష్టం అంటే ట్రావెల్‌ చేయకుండా ఉండలేను కాబట్టి’ నవ్వుతూ అంటాడు అనునయ్‌ సూద్‌. ఇంజినీరింగ్‌ చేసిన అనునయ్‌ కొంత కాలం ఉద్యోగం చేశాడు. జీతం రాగానే ఆ బడ్జెట్‌లో ఏదో ఒక ట్రిప్‌ ప్లాన్‌ చేసేవాడు. ప్రయాణ మాధుర్యాన్ని మరింతగా ఆస్వాదించడానికి ఉద్యోగానికి రాజీనామా చేసి ఫ్లెక్సిబుల్‌ ప్రాజెక్ట్స్‌లో పనిచేశాడు. సాహసకృత్యాలను ఇష్టపడే వారి కోసం ట్రెక్‌ ఆర్గనైజింగ్‌ కమ్యూనిటీని స్టార్ట్‌ చేశాడు. ఈ కమ్యూనిటీలో గైడ్, టీమ్‌ లీడర్‌గా వ్యవహరించాడు.

అనునయ్‌ ప్రతి ప్రయాణాన్ని కొత్త జీవితంతో పోల్చుతాడు. ప్రయాణ జ్ఞాపకాలను ఛాయాచిత్రాలలో భద్రపరిచే క్రమంలో ట్రావెల్‌ ఫొటోగ్రఫీలో కూడా నైపుణ్యం సాధించాడు. ట్రావెలింగ్, ఫొటోగ్రఫీపై ఉన్న ఇష్టాన్ని మిళితం చేసి డిజిటల్‌ కంటెంట్‌ క్రియేటర్‌గా విజయం సాధించాడు. ఆ తరువాత ‘మెటా–సోషల్‌’తో ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారాడు. ‘మెటా–సోషల్‌’ అనేది పెర్‌ఫార్మెన్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ సొల్యూషన్‌ కంపెనీ.

‘ట్రావెలింగ్‌పై నాకు ఉన్న ఇష్టాన్ని కమర్షియలైజ్‌ చేసుకోవాలనుకోలేదు’ అంటున్న అనునయ్‌ ‘ప్రాజెక్ట్‌ ఘర్‌’ పేరుతో హోమ్‌స్టే సర్వీస్‌ వెంచర్‌ను స్టార్ట్‌ చేసే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పటి వరకు 30 దేశాల వరకు వెళ్లి వచ్చిన అనునయ్‌ ‘ఫొటోగ్రఫీ విజన్, ట్రావెలింగ్‌పై ఫ్యాషన్‌ ఉంటే సాధారణ ప్రదేశాల నుంచి కూడా అసాధారణ అందాలను వీక్షించవచ్చు. ట్రావెల్‌ ఫొటోగ్రఫీపై మనకు విజన్‌ ఉంటే ఖరీదైన కెమెరాలతో పనిలేదు’ అంటున్నాడు అనునయ్‌ సూద్‌.
 
కొత్తదారులలో...
ప్రయాణ క్రమంలో ప్రకృతి నుంచి, సామాజిక బృందాల నుంచి నేర్చుకున్న పాఠాలు ఎన్నో ఉంటాయి. దృష్టి విశాలం కావడానికి, చురుగ్గా ఉండడానికి, సృజనాత్మకంగా ఆలోచించడానికి ప్రయాణాలు ఉపయోగపడతాయి. కొత్త దారులు కొత్త ఆలోచనలకు దారి తీస్తాయి.
– అనునయ్‌ సూద్‌

(చదవండి: ఇదు శ్రీలంక: చుక్‌ చుక్‌ చుక్‌... నాను వోయా టూ ఎల్లా !)

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top