అక్షర పూదోటలో విహారం

Alluri Penmetsa Lakshmi: Author and Retaired Govt Employe Special Story - Sakshi

‘తోటలో అడుగుపెట్టినప్పుడు చెట్లకు పూచిన అందమైన పూలను చూస్తాం, వాటి పరిమళాలను ఆస్వాదిస్తాం. ఎండి రాలిన ఆకులను చూసి బాధపడుతూ కూర్చోం. జీవితమూ అంతే... మనం దేనిని తీసుకోవాలో తెలిస్తే అదే మన జీవితం అవుతుంది’ అంటారు అల్లూరి (పెన్మెత్స) గౌరీలక్ష్మి.

ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ రచనా వ్యాసంగాన్ని కొనసాగించిన సాహితీ ప్రేమికురాలు ఆమె. అక్షరం అమూల్యమైనది. మనసు పలికిన అక్షరాలను మాలలుగా అల్లుతున్న ఈ కవయిత్రి... విశ్రాంత జీవనాన్ని హైదరాబాద్‌లో ఆమె అల్లుకున్న అక్షర పూదోటలో విహరింప చేస్తున్నారు.

రాయాలి... ఏం రాయాలి? రాయాలంటే... రాయాలనే తపన ఉండాలి. అంతకంటే ముందు చదవాలనే తృష్ణ దహించి వేయాలి. అలా లైబ్రరీ మొత్తం చదివేసిందామె. ‘పెద్ద లైబ్రరీలో తనకు నచ్చిన రచనలకు మాత్రమే పరిమితమై ఉంటే... సాహిత్యంలో కొన్ని కోణాలను మాత్రమే స్పృశించగలిగేదాన్ని. లైబ్రరీ మొత్తం అక్షరం అక్షరం చదివేశాను... కాబట్టి, అందులో కొన్ని రచనల మీద పెద్దవాళ్ల విశ్లేషణను, అభిప్రాయాలను విన్నాను కాబట్టి ఏం రాయకూడదో తెలిసివచ్చింది.

నా బాల్యంలోనే జై ఆంధ్ర ఉద్యమాన్ని చూశాను, ఇండో – పాక్‌ యుద్ధాన్ని చూశాను... కాబట్టి మనిషి ఎదుర్కొనే అసలైన కష్టం ఏమిటో అర్థమైంది. మనం కష్టాలుగా భావించే ఏదీ నిజానికి కష్టం కాదు. ఇవన్నీ మనకు మనంగా కల్పించుకున్న వెతలు మాత్రమే. వాటికి పరిష్కారం కూడా మనలోనే ఉంటుంది. ఆ పరిష్కారం కోసం మనలోకి మనం తరచి చూసుకుంటే సరిపోతుంది. నా రచనల్లో అదే చెప్పాను’ అన్నారామె. చిన్న జీవితం మనది, ఆ చిన్న జీవితాన్ని హాయిగా, ఆహ్లాదంగా జీవించాలి. ఇదీ ఆమె ఫిలాసఫీ.

‘మగాడు’ కథ
కోనసీమ జిల్లా అంతర్వేదిపాలెం అమ్మాయి... గోదావరిలో ఈతకొడుతూ పెరిగిన అమ్మాయి, చెట్టునే మగ్గిన మామిడి పండును కొరికి తిని టెంకను చెట్టుకే వదిలేసిన అందమైన అల్లరి బాల్యం, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రికల్లోని అక్షరాల్లో ప్రపంచాన్ని చూసింది. ఆ అక్షరాలతోనే స్నేహం చేసింది. ముగ్గురు అక్కలు, అన్న పెంపకంలో ఒకింత పెద్ద లోకాన్ని అర్థం చేసుకుంది. వాళ్ల ఊరి నుంచి పొరుగూళ్ల థియేటర్లలో కూడా మారిన సినిమాలన్నీ చూసేసింది.

ఆడపిల్ల చదువుకోవడానికి పొరుగూరికి వెళ్తుంటే ఆశ్చర్యంగా కళ్లు పెద్దవి చేసి చూసే అతి చిన్న ప్రపంచంలో ఆమె సైకిల్‌ మీద కాలేజ్‌కి వెళ్లి ఓ ట్రెండ్‌ను సెట్‌ చేసింది. డిగ్రీ చదివిన తొలి అమ్మాయిగా ఊరికి ఒక రికార్డునిచ్చింది. గోదావరి నదిని ఈదినంత సునాయాసంగా సాహిత్యసాగరంలో ఈదుతున్నప్పుడు కూడా ఆమెలో రాయాలనే ఆలోచన కలగలేదు. మనసును చివుక్కుమనిపించిన ఓ రచన ఆ పని చేసింది. ఆ కథ పేరు ‘ఆడది’.

‘‘మల్లిక్‌ గారు రాసిన ‘ఆడది’ కథలో భారతీయ సమాజంలో సగటు గృహిణి పాత్రను వర్ణిస్తూ కథ చివరిలో ‘పాపం ఆడది’ అని ముగించారు. నాకు వెంటనే కోపం వచ్చేసింది. ‘మగాడు’ అని హెడ్డింగ్‌ పెట్టి ‘పాపం ఎంతైనా మగాడు’ అని చివరి వాక్యం రాశాను. కానీ ఎలా మొదలుపెట్టాలో, కథనం ఎలా సాగాలో తెలియదు. పూర్తి చేయడానికి నెలలు పట్టింది. ‘విజయ’ మాస పత్రికకు పంపిచాను. వాళ్ల నుంచి రిప్లయ్‌ లేదు. నా కథ చూసి నవ్వుకుని ఉంటారని తలచు కుని తలచుకుని సిగ్గుపడిపోయాను. ఆరు నెలలకు పోస్టులో ‘విజయ’ మంత్లీ మా ఇంటికి వచ్చింది. అందులో నా కథ. అలా మగాడు కథతో రైటర్‌నయ్యాను’’ అన్నారు గౌరీ లక్ష్మి నవ్వుతూ.

చేయి చాచవద్దు!
‘‘ఆడవాళ్లు సమానత్వ సాధన కోసం శ్రమిస్తున్నారు. వాణిజ్య ప్రపంచంలో స్త్రీ అయినా పురుషుడైనా ఒక మనిషి గుర్తింపుకు సంపాదనే కొలమానం అవుతోంది. కాబట్టి ఆర్థిక స్వావలంబనతోనే సమానత్వ సాధన సాధ్యమవుతుందంటారు గౌరీలక్ష్మి. సంపాదనలో పురుషుడికి దీటుగా నిలిచినప్పుడు ‘మమ్మల్ని గౌరవించండి, సమానమైన అవకాశాలివ్వండి’ అని ఎవరినీ అడగాల్సిన అవసరం ఉండదంటారామె.

‘‘సమానత్వం కోసం చేయి చాచి యాచించవద్దు... అంటూనే ఆర్థిక స్థిరత్వాన్ని సాధించినప్పుడు ఇక సమానత్వ సాధన కోసం పిడికిలి బిగించి పోరాడాల్సిన అవసరమూ ఉండదు. వరకట్నం అనే దురాచారం కనుమరుగయ్యే మంచి తరుణం కూడా అప్పుడే వస్తుంది. కన్యాశుల్కంతో పోరాడి బయటపడేటప్పటికి వరకట్నం రూపంలో మరో దురాచారం కోరల్లో చిక్కుకుంది భారతీయ స్త్రీ. చదువుకుంటే అన్నీ చక్కబడతాయనుకుంటే... మహిళ ఎంత సాధించినా పని చేసే చోట వివక్ష, లైంగిక వేధింపులను ఎదుర్కోక తప్పని పరిస్థితి ఇంకా ఉంది.

అదే పిటీ. అలాగని మహిళలు సెల్ఫ్‌ పిటీలోకి వెళ్లకుండా ధైర్యంగా నిలబడాల్సింది ఇక్కడే. నేను 36 ఏళ్లు ఉద్యోగం చేసిన అనుభవంతో చెప్తున్నాను. మహిళ తన ఉనికిని నిలుపుకోవడానికి అవసరమైతే ఎన్ని ఉలి దెబ్బలను తట్టుకోవడానికైనా సరే సిద్ధంగా ఉండాలి’’ అన్నారామె. ఆమె రచనల్లో స్త్రీ ఒక గృహిణిగా, ఒక ఉద్యోగినిగా, వైవాహిక జీవితంలో అపసవ్యతలు ఎదురైన మహిళగా సమాజంలో ఎదొర్కొనే రకరకాల సమస్యలను ప్రస్తావించారు.

సరైన నిర్ణయమే!
గౌరీ లక్ష్మి తన ముఖంలో ప్రసన్నతకు కారణం జీవితం పట్ల ఎటువంటి ఎక్ట్‌పెక్టేషన్‌లు లేకపోవడమేనంటారు. ‘‘ఉద్యోగం మానేసి పూర్తి సమయాన్ని రచనల కోసమే కేటాయించమని యండమూరి సూచించినప్పుడు... ‘నాకు చదవడం, రాయడం ఇష్టం. అక్షరాలంటే ప్రేమ. అక్షరాలను కమర్షియల్‌గా మార్చుకోవడం ఇష్టం లేదు. ఉద్యోగం చేసుకుంటూ, రాయాలనిపించినప్పుడు రాస్తుంటాను’... అని చెప్పాను. అది సరైన నిర్ణయమే.

నా రచనకు ఎంత గుర్తింపు వచ్చింది, ఎన్ని కాపీలు అమ్ముడయ్యాయి, రివ్యూలు ఎలా వచ్చాయి, ఎంత పారితోషికం వస్తోంది... వంటి లెక్కలేవీ ఉండవు నాకు. కీర్తికాంక్ష కోసం వెంపర్లాట కూడా లేదు. నా స్పందనకు అక్షరరూపమిస్తున్నాను. ఆ స్పందనకు ఏ కమర్షియల్‌ కొలమానాలూ అక్కరలేదు. అందుకే హాయిగా ఉన్నాను’’ అన్నారామె. గౌరీలక్ష్మితో మాట్లాడినప్పుడు వృత్తి ప్రవృత్తి మధ్య సమతూకం తెలిసినప్పుడు జీవితంలో అన్నీ తూకంగానే ఉంటాయనిపించింది. తామరాకు మీద నీటి బిందువులా జీవించడానికి సద్గురువుల బోధనలు అక్కరలేదు, అనవసరపు అంచనాల, ఆకాంక్షల పరిభ్రమణానికి దూరంగా ఉండగలిగితే చాలు... అని తెలిసింది.

అక్షరాల మడి
హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో ఉండేవాళ్లం. సిటీలోకి వచ్చి వెళ్లడానికి రోజూ నలభై కిలోమీటర్లు బస్సులో ప్రయాణం చేసి ఉద్యోగం చేశాను. వారాంతాల్లో కథా సదస్సుల్లో పాల్గొంటూ నా అభిరుచిని చిగురింపచేసుకున్నాను. ఇవన్నీ భర్త, ఇద్దరు పిల్లలతో ఇంటిని చక్కబెట్టుకుంటూనే. వీటి మధ్యలోనే పొలిటికల్‌ సైన్స్‌లో పీజీ చేశాను. సాహిత్యపరంగా నాలుగు కథా సంపుటాలు, మూడు నవలలు, రెండు కవితా సంపుటాలు, రాజకీయ వ్యంగ్య కథనాలు కూడా రాశాను. ఇప్పుడు డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ మీద కాలమ్స్‌ రాస్తున్నాను.  నన్ను నిత్యనూతనంగా ఉంచుతున్నది సాహిత్యమే.  మనిషి వ్యక్తిత్వాన్ని చక్కటి శిల్పంలా తీర్చిదిద్దగలిగిన గొప్ప సాధనం సాహిత్యం. అందుకే సాహిత్యంతో స్నేహం చేయడం అందరికీ మంచిదని చెబుతాను. నాకంటూ నేను పెంచుకున్న సాహిత్యవనంలో విహరిస్తూ విశ్రాంత జీవితాన్ని ఆహ్లాదంగా ఆస్వాదిస్తున్నాను.
– అల్లూరి (పెన్మెత్స) గౌరీలక్ష్మి,
జనరల్‌ మేనేజర్‌ (రిటైర్డ్‌), ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్‌ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌)

– వాకా మంజులారెడ్డి
ఫొటోలు: నోముల రాజేశ్‌రెడ్డి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top