మిస్‌ యూనివర్స్‌ థర్డ్‌ రన్నరప్‌.. సవాళ్ల శిఖరం

Adline Castelino is 3rd runner-up at Miss Universe 2020 - Sakshi

మహిళలు తమ కలలను నిజం చేసుకోవడానికి వారి జీవితంలో ప్రతిరోజూ అసమానతల సవాళ్లను ఎదుర్కోవాల్సిందే. అడ్లైన్‌ కాస్టెలినో సవాళ్లను ఎదుర్కొంటూనే విజయపథం వైపుగా పయనిస్తోంది. కర్ణాటకకు చెందిన ఈ 22 ఏళ్ల మిస్‌ ఇండియా సోమవారం జరిగిన 69వ మిస్‌ యూనివర్స్‌ పోటీలో థర్డ్‌ రన్నరప్‌ (నాలుగో స్థానం)గా నిలిచి దేశం గర్వించేలా చేసింది.

ఎవరీ అడ్లై్లన్‌ కాస్టెలినో...
కువైట్‌లో పుట్టి పెరిగిన భారతీయ యువతి అడ్లైన్‌ కాస్టెలినో. కర్ణాటక రాష్ట్రం ఉడిపిలోని ఉదయరాకు చెందిన ఆల్ఫోన్స్, మీరా కాస్టెలినో దంపతులు ఉద్యోగరీత్యా కువైట్‌లో ఉండేవారు. అక్కడే అడ్లై్లన్‌ పుట్టింది. కువైట్‌లోని ఇండియన్‌ సెంట్రల్‌ స్కూల్‌లో చదువుకుంది. . ‘అమ్మాయిల ఎదుగుదలకు ఎలాంటి దారి లేని దేశం అది. అలాంటి చోట పుట్టి, పెరిగిన నేను మిస్‌యూనివర్స్‌గా గెలుపొందిన వారిని విస్మయంగా చూసేదాన్ని. ప్రతిష్టాత్మక వేదిక మీద మిస్‌యూనివర్స్‌ కిరీటం అందుకోవాలన్నది నా కల’’ అంటూ తన జీవన ప్రయాణాన్ని వివరిస్తోంది అడ్లైన్‌ కాస్టెలినో.

ఆమె ఆకాంక్షను తెలుసుకున్న తల్లిదండ్రులు 15 ఏళ్ల వయసులో భారతదేశానికి తిరిగి వచ్చారు. అక్కడ నుంచి ముంబై వెళ్లారు. సెయింట్‌ జేవియర్స్‌ హై స్కూల్‌లో చదువుకున్న అడ్లైన్‌ ఆ తర్వాత విల్సన్‌ కాలేజీ నుండి బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ పూర్తి చేసింది. మాతృభాష కొంకణితో పాటు ఇంగ్లిష్, హిందీ, కన్నడ భాషలలో నిష్ణాతురాలు. 2020లో జరిగిన లివా మిస్‌ దివా యూనివర్స్‌ పోటీలో విజేతగా నిలిచిన అడ్లైన్‌కు ఇప్పుడు 22 ఏళ్లు. ఈ ఏడాది మిస్‌ యూనివర్స్‌ పోటీలో భారత ప్రతినిధిగా నిలిచింది.

సాధనే ధ్యేయంగా ముందడుగు
 ‘మిస్‌ యూనివర్స్‌ కిరీటం దక్కించుకోవాలన్న ఆకాంక్ష సౌకర్యవంతంగా ఉండే జీవనం నుంచి నన్ను బయటకు తోసేసిందనే చెప్పాలి’ అంటారు అడ్లైన్‌. ఇప్పుడు ఇండియాలో అడ్లైన్‌ ఒక టాప్‌ మోడల్‌. ప్రముఖ ఏజెన్సీలతో కలిసి పనిచేస్తోంది. ఫ్యాషన్, లైఫ్‌సై ్టల్‌ బ్రాండ్లు, మ్యాగజైన్‌ కవర్లు, టెలివిజన్, డిజిటల్‌ ప్రచారాలలో కనిపిస్తోంది. మరిన్ని సృజనాత్మక రంగాలలో అవకాశాలను పొందడానికి కృషి చేస్తోంది. స్మైల్‌ ట్రెయిన్‌కు గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా ఉంది. మహిళల ఆరోగ్య సంరక్షణకు అందించే స్నేహ అనే ఎన్జీవోతో కలిసి పనిచేస్తోంది. రైతుల హక్కుల కోసం, అణగారిన గ్రామీణ వర్గాలకు చేయూతనందించే సంస్థలతో కలిసి పనిచేస్తోంది. జీవనం గడవడానికి కొన్నాళ్లు షూస్‌ తయారుచేసి, అమ్మకాలు కొనసాగించింది. టాప్‌మోడల్‌గా, స్వచ్ఛంద సేవకురాలిగా ఎదగడానికి ముందు తనలో ఉన్న నత్తి సమస్యను అధిగమించడానికి కొన్నేళ్లపాటు సాధన చేసింది అడ్లైన్‌. ఇండియా నుంచి మిస్‌యూనివర్స్‌ కిరీటానికి పోటీపడి థర్డ్‌ రన్నరప్‌గా నిలిచింది..

దేశ మహిళల తరపున..
‘ఎప్పుడూ సాహసోపేత వ్యక్తిగా ఉండటానికి ఇష్టపడతాను. ఎంతటి కష్టమైనా వెనుకంజ వేయను. వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రయత్నించడానికి సిద్ధంగా ఉంటాను’ అంటున్న ఈ నవీన యువతి గురించి ఎంత తెలుసుకున్నా తక్కువే అనిపించకమానదు. ‘నిన్నటి వరకు నన్ను నేను ఒక అమ్మాయిలా భావించాను. కానీ, ఇప్పుడు నేను సమాజానికి మద్దతు ఇచ్చే ఒక మహిళను. ఈ ప్రయాణం నాకు ఎంతో నేర్పించింది. ఈ దేశం ఇచ్చే ప్రేమను నేను ఎప్పటినుంచో పొందుతున్నాను. నాకు మద్దతుగా నిలిచి నేను థర్డ్‌ రన్నరప్‌(నాల్గవ స్థానంలో)గా నిలిచేందుకు సాయం చేసిన దేశ ప్రజలందరికీ కృతజ్ఞతలు’ అని తెలిపింది అడ్లైన్‌ కాస్టెలినో.
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top