మా పాట అడవి దాటింది.. ఆదివాసీ గాయని లక్ష్మీబాయ్‌ 

Adilabad: Penduru Lakshmi Bai Adivasi Singer Successful Journey - Sakshi

ధ్వని పుట్టింది... రాగం ఆవిర్భవించింది. మాట పుట్టింది... పాట రూపుదిద్దుకుంది. ఆది సంస్కృతి... ఆదిరాగాన్ని ఆవిష్కరించింది. ఆ రాగాల పరిరక్షణకు అంకితమైన గాయని లక్ష్మీబాయ్‌.

హైదరాబాద్‌లో గవర్నర్‌ బంగళా. ఈ ఏడాది మార్చిలో మహిళాదినోత్సం వేడుకలకు సిద్ధమైంది. తమ తమ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన మహిళలు పురస్కారాలందుకుంటున్నారు. వారిలో ఓ మహిళ పెందూరు లక్ష్మీబాయ్‌.

ఆదిలాబాద్‌ నుంచి వచ్చిన ఆదివాసీ గాయని ఆమె. గవర్నర్‌ చేతుల మీదుగా సన్మానం చేయించుకున్న సంతోషం ఆమె ముఖంలో ప్రతిఫలిస్తోంది. ఈ గౌరవాన్ని అందుకున్న లక్ష్మీబాయ్‌ తన జీవితాన్ని ఆదివాసీ సంస్కృతి పరిరక్షణకే అంకితం చేసింది. ఆమె సాక్షితో పంచుకున్న వివరాలివి. 

‘‘మాది ఆదిలాబాద్‌ జిల్లా గుడి హత్నూర్‌ మండలం, తోషం గ్రామం. మా తెగ పేరు తోటీ. సిటీల వాళ్లు టాటూ అని ఇప్పుడు ఫ్యాషన్‌గా వేసుకుంటున్నారు చూశారా... అదే... పచ్చబొట్టు. ఆ పచ్చబొట్టు వేయడం మా వృత్తి. అడవుల్లో మూలికలు, వేళ్లను సేకరించి పసరు తయారు చేసుకుంటాం.

మా సంస్కృతి, జీవనం గోంద్‌ రాజులతోపాటుగా ఉండేది. గోంద్‌ రాజుల దగ్గర కళాకారులం. కిక్రీ అనే వాయిద్యంతో పాటల రూపంలో మహాభారతం, రామాయణం, రాజుల కథలను చెబుతాం. రేలా పాటలైతే వందల్లో ఉంటాయి. అవన్నీ మాకు నోటికి వస్తాయి. పుస్తకం చూడాల్సిన అవసరం లేదు. మా పేర్లు కూడా రామాయణ, మహాభారతాలు, గొప్ప రాజుల చరిత్ర కథల్లో ఉండే పేర్లే ఉంటాయి. 

పాటని వదలం
అన్నం దొరకకున్నా సరే పాటను మాత్రం వదలం. మా పుట్టిల్లు మంచిర్యాల జిల్లా, జన్నారం మండలం, పుట్టిగూడ. మా చిన్నప్పుడు తినడానికి కూడా ఇప్పుడున్నంత వెసులుబాటు ఉండేది కాదు. గోంద్‌ రాజుల ఇంట్లో పండగ, శుభం... అశుభం... ఏదో ఒక సందర్భంలో వాళ్లు జొన్నలు పెడితే అదే సంతోషం. మిగిలిన రోజుల్లో అడవి తల్లే ఆధారం.

అలాంటి గడ్డు రోజుల్లో కూడా మేము మా సంస్కృతిని వదల్లేదు. కిక్రీ వాయిద్యాలను మూలన పెట్టలేదు. సంస్కృతిని, కళను అంతరించి పోనివ్వకూడదని మాకు మేము ఒట్టు పెట్టుకుంటాం. మా వంశాల్లో తరతరాల సంపద మా నోటిపాట, మాట. చిన్నప్పటి నుంచి ఎన్నో ఏళ్లపాటు నేర్చుకుంటూ, మర్చిపోకుండా సాధన చేస్తూనే ఉంటాం. అప్పట్లో మా పాట అడవిలోనే ఉండేది. ఇప్పుడు సర్కారు శ్రద్ధ పెట్టడంతో మా కళ అందరికీ తెలుస్తోంది. ఆకాశవాణిలోనూ మా పాటలు వచ్చాయి.  

పురస్కారం మా కళకే!
నా భర్త తుకారామ్‌ కిక్రీ వాద్యకారుడు. నేను రేల పాటలు పాడుతాను. ఆయన, నేను పాటలు పాడుతూ ఊళ్లు తిరిగాం. ఢిల్లీలో 2006లో రిపబ్లిక్‌ దినోత్సవాలకు వెళ్లి మా కళలను ప్రదర్శించాం. రాష్ట్రపతి అబ్దుల్‌ కలామ్‌ గారి చేతుల మీదుగా సన్మానం అందుకున్నాం. ఈ ఏడు హైదరాబాద్‌లో గవర్నర్‌ చేతుల మీద సన్మానం, మధ్యలో ఆదిలాబాద్‌ జిల్లాలో అనేక కార్యక్రమాల్లో మా పాటలు, దండలు, శాలువాలతో గౌరవించారు.

అంతపెద్ద వాళ్లు మాకు దణ్ణం పెడుతుంటారు. ఆ దణ్ణం మాక్కాదు, మా ఆకలి తీరుస్తూ, మమ్మల్ని కడుపులో పెట్టుకుని కాపాడే మా అడవి తల్లికి. అక్షరం రాని మా నాలుక మీద పెద్ద పెద్ద గ్రంథాలను పలికిస్తున్న మా కులదైవానికే. మేము ఏటా జనవరిలో ఒకసారి, ఈ నెలలో (మే నెల) ఒకసారి మా ఉత్సవాలు చేసుకుంటాం. మా పాటలన్నీ మా నాలుకల మీద నాట్యం చేస్తున్నాయి.  

నగరానికి చేరిన ‘ఆది’ పాట 
ఐఏఎస్‌ ఆఫీసర్‌ దివ్య దేవరాజన్‌ ఈ కళను మా దగ్గరే ఆగిపోనివ్వకుండా అందరికీ తెలియచేయాలని సంక్షేమ హాస్టల్‌లో చదువుకుంటున్న ఆడపిల్లలకు నేర్పించమన్నారు. ఆమె మాట మీద రెండు నెలలు అక్కడే ఉండి నేర్పించాను. నాకు రాయడం రాదు, వందల పాటలు పాడతాను. మా చిన్నప్పుడు బడుల్లేవు. ఇప్పుడు మా ఆదివాసీలు పిల్లలందరినీ చదివించారు.

మేము మా నలుగురు పిల్లలనూ చదివించాం. రాయడం వచ్చినోళ్లు ఈ పాటలను రాస్తే ఎప్పటికీ ఉంటాయి. ఇప్పటోళ్లు మేము పాడుతుంటే పాటలు రికార్డ్‌ చేసి యూ ట్యూబులో పెడుతున్నారు. మా పాట నగరాలకు చేరుతోంది. నగరాల వాళ్లు ఈ పాటలను టీవీల్లో పాడుతున్నారు.

వాటిని చూసినప్పుడు మాకు ఖుషీగా ఉంటుంది. నా కంఠంలో ప్రాణం ఉన్నంత కాలం పాట ఆపను. నా భర్తతో కలిసి ఎన్నెన్ని పాటలు పాడానో... ఇప్పుడు నాతో ఉన్నది ఆయనతో పాడిన పాటలే’’ అని తాను ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు అంకితమైన వైనాన్ని వివరించారు పెందూరు లక్ష్మీబాయ్‌.  
వాకా మంజులారెడ్డి  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top