నెలన్నర రోజులు బాయ్స్‌ హాస్టల్‌ ఉన్నాం..

Actress Gouri Priya Reddy Special Story - Sakshi

ముందస్తు ప్రణాళికలు లేవు వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవాలనే తపన ఉంది. గెలుస్తానా.. ఓడుతానా.. అనే సందేహం లేదు.  ప్రయత్నిద్దాం అనే అభిలాష ఉంది. సింగర్‌గా శభాష్‌ అనిపించుకొని బ్యూటీ కాంటెస్టెలలో భేష్‌గా నిలిచి మెయిల్‌.. అంటూ ఓటీటీ సినిమాతో రోజాగా తెలుగు ప్రేక్షకులకు చేరువైన గౌరి ప్రియారెడ్డిని పలకరించింది సాక్షి.

మెయిల్‌ సినిమా వల్ల వచ్చిన పేరును ఎలా ఎంజాయ్‌ చేస్తున్నారా?
గౌరి ప్రియా రెడ్డి: చాలా హ్యాపీగా ఉంది. అమ్మనాన్నలు, నా ఫ్రెండ్స్, విదేశాల్లో ఉన్న మా రిలేటివ్స్‌ కూడా నా యాక్టింగ్‌ గురించి మాట్లాడుతున్నారు. మాటల్లో చెప్పలేను ఆ ఆనందాన్ని. 

మెయిల్‌ మూవీ.. ఎక్స్‌పీరియెన్స్‌ గురించి ..
గౌరి: చాలా ఉన్నాయి. మొత్తం 60 రోజులు సినిమా షూటింగ్‌. నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. పల్లె గురించి అస్సలు తెలియదు. ఎప్పుడూ వెళ్లలేదు కూడా. అలాంటిది షూటింగ్‌ కోసం మారుమూల తండాల్లాంటి ప్రాంతాలకు వెళ్లాం. మహబూబాబాద్‌లోని గవర్నమెంట్‌ బాయ్స్‌ హాస్టల్‌లో దాదాపు నెలన్నర రోజులు ఉన్నాం. ఇప్పటి వరకు ఎప్పుడూ నేను హాస్టల్‌లో ఉండలేదు. ఆ ఎక్స్‌పీరియన్స్‌ కూడా చేశాను. అక్కడ నుంచి మెట్టవాడ, బురుగుపాడు, గౌరారం, కంబాలపల్లి, బయ్యారం... వంటి ఊళ్లు లొకేషన్‌ స్పాట్స్‌. ఎంత తిరిగానో.. ఆ పల్లె ప్రాంతాలు. అక్కడ పొలాల్లో పనులు చేసే అమ్మాయిలను కలవడం, పెద్ద వారితో మాట్లాడటం, వ్యవసాయం గురించి, ప్రభుత్వ పథకాలు.. వాళ్లు చెప్పేవన్నీ శ్రద్ధగా వినేదాన్ని. ఒక చోటుకి వెళితే.. కామ్‌గా ఉండను. అన్నీ తెలుసుకుంటుంటాను. అలా షూటింగ్‌ ఉన్నన్ని రోజులు నేను మరో లోకంలో ఉన్నట్టు ఎంజాయ్‌ చేశాను.

అన్ని రోజులు షూటింగ్‌లో మీ పేరెంట్స్‌ మీ వెంటే ఉన్నారా?
గౌరి: లేరు. వాళ్లు హైదరాబాద్‌లో. నేను విలేజ్‌లో. అసలే కోవిడ్‌ టైమ్‌. వాళ్లని ఇబ్బంది పెట్టకూడదు అనుకున్నాను. నాతోపాటు ఒక హెయిర్‌ డ్రెస్సర్‌ అమ్మాయి. మిగతా అంతా మెన్‌. అంతమందిలో మేమిద్దరమే అమ్మాయిలం. కానీ, ఎక్కడా అసౌకర్యం అనిపించలేదు. భయం అన్నదే లేదు. అమ్మానాన్నలకు కూడా నా గురించి బాగా తెలుసు. అస్సలు భయపడరు. 

అంత ధైర్యం అమ్మానాన్నలకు ఎలా కలిగించారు?
గౌరి: నాన్న శ్రీనివాస్‌రెడ్డి ఒక ప్రైవేట్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలో కన్‌సల్టెంట్‌ ట్రైనర్, అమ్మ వసుంధర హౌజ్‌వైఫ్‌. వారికి నేనొక్కదాన్నే కూతురుని. అలాగని నా పెంపకంలో ఎప్పుడూ భయపడలేదు వాళ్లు. చిన్నప్పటి నుంచి నా ఇష్టానికే ప్రాధాన్యత. నాన్న బాగా ఎంకరేజ్‌ చేస్తారు. డిగ్రీవరకు చదువుకున్నాను. చిన్నప్పుడు ఇంట్లో సినిమా పాటలు బాగా పాడుతుండేదాన్ని. అది చూసి మ్యూజిక్‌ క్లాసులో చేర్పించారు. పెద్దవుతున్న కొద్దీ నా గొంతు నాకే బాగున్నట్లనిపించేది. నాన్న ప్రోత్సాహంతోనే 9వ తరగతిలో టీవీ షో బోల్‌ బేబీ సీజన్‌–2లో పాల్గొన్నాను, విజేతగా నిలిచాను. యాక్టింగ్‌ మాత్రమే కాదు... స్పోర్ట్స్‌ అంటే కూడా చాలా ఇష్టం. బాగా ఆడతాను. ఎవరితో మాట్లాడాలన్నా భయపడను. థియేటర్‌ ఆర్ట్స్‌ అన్నా ఇష్టమే. స్టేజి ఫియర్‌ అస్సలు లేదు. నా మనస్తత్వానికి సరిపడా పనులు చేసుకుంటూ వెళుతుంటాను. నేనేంటో అమ్మనాన్నలకు బాగా తెలుసు. అందుకే నా గురించి అస్సలు భయపడరు. 

బ్యూటీ కాంటెస్ట్‌ల్లోనూ పాల్గొన్నట్టున్నారు..
గౌరి: ఒకసారి మా కాలేజీలో మిస్‌ హైదరాబాద్‌ కాంటెస్ట్‌ స్టాల్‌ పెట్టారు. ఇంటికి వచ్చాక నాన్నకు చెప్పాను. పోటీలో పాల్గొనమన్నారు. ఫస్ట్‌రౌండ్‌ వరకైనా క్వాలిఫై అవుతానా.. అనే సందేహం వచ్చింది. కానీ, ప్రయత్నిద్దాం అనుకుని వెళ్లాను. పోటీలో విజేతగా నిలిచాను. అక్కణ్ణుంచి మోడలింగ్, యాక్టింగ్‌ అవకాశాలు వస్తున్నాయి. మ్యూజిక్‌ నా మొహంలో ఫీలింగ్స్‌ని బాగా పలికించేందుకు దోహదపడింది. అందుకే, ఈ రంగంలో నాకు అవకాశాలు వస్తున్నాయి అనుకుంటున్నాను. సినిమాల్లోనూ ముఖ్యమైన రోల్స్‌ చేస్తున్నాను. అవి విడుదల కావల్సి ఉంది. 

నెక్ట్స్‌ ప్లాన్స్‌ ఏంటి?
గౌరి ప్రియా రెడ్డి: నా ఏజ్‌ 22. ఎప్పుడూ ప్లానింగ్‌ అంటూ చేసింది లేదు. ఇక ముందు అలా ఏమీ ఉండదు. అన్నీ ఫ్లోలో వెళ్లిపోతున్నాయి అంతే. ఎలాంటి అవకాశాలు వస్తాయో.. నేనూ ఎగ్జయిటింగ్‌గా ఎదురు చూస్తున్నాను. ప్రస్తుతానికి ‘మెయిల్‌’ సినిమా సక్సెస్‌ని ఎంజాయ్‌ చేస్తున్నాను. 

ఆల్‌ ద బెస్ట్‌..
గౌరి: థాంక్యూ సో మచ్‌. 

– సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top