
ప్రతిభను వెలికితీయడానికి ప్రత్యేక కార్యక్రమాలు
నగరంలో సీనియర్ సిటిజన్స్ మొట్టమొదటి ఆడిషన్స్
50 ఏళ్లు పైబడిన వారి కోసం ‘ఖ్యాల్ 50 అబౌవ్ 50’ కాంటెస్ట్
నో రిటైర్‌మెంట్.. ఓన్లీ రిఫ్రెష్‌మెంట్..
ఉద్యోగ విరమణ అనంతరం ప్రతి ఒక్కరి జీవితంలో నూతన అధ్యాయం మొదలవుతుంది. ఈ దశలో విశ్రాంతి తీసుకుంటూ, కుటుంబంతో సమయం గడుపుతూ, తమకు ఇష్టమైన పనులను ఆనందంగా కొనసాగిస్తారు. అయితే దేశంలో 50 ఏళ్లకు పైబడి ఉన్నవారిలో ఎంతో ప్రతిభవున్నప్పటికీ దానిని ప్రదర్శించడానికి సరైన వేదికలు, అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలో వయసు అనే సరిహద్దులను దాటుతూ, సీనియర్ సిటిజన్స్ ప్రతిభను వెలికితీసేలా 50 ఏళ్లు పైబడిన వారికి కళాత్మక వేదిక అందించాలనే లక్ష్యంతో ‘ఖ్యాల్ 50 అబౌవ్ 50’ అనే వినూత్న వేదిక ప్రారంభించింది. నగరంతో పాటు దేశమంతటా ఖ్యాల్ కమ్యూనిటీ ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. 2026 సంవత్సరానికి సంబంధించి మొదటి పోటీ హైదరాబాద్‌లోని ‘అమేయా సోషల్’ వేదికగా నిర్వహించారు. – సాక్షీ, సిటీ బ్యూరో
నటినయ్యా.. కానీ సింగింగ్ ఇష్టం..
నాకు సింగింగ్ అంటే ఇష్టం. కానీ నటన పరంగా మంచి అవకాశాలు వచ్చాయి. గాయనిగా సరైన సమయంలో అవకాశాలు అందుకోలేదు. ఈ వేదిక గురించి ఫేస్‌బుక్‌లో తెలుసుకుని వచ్చా. నాకు నచ్చిన కళని ప్రదర్శించా. వ్యక్తిగత ఆశయాలు సాధించుకునే అద్భుత అవకాశంగా భావిస్తున్నా. – మిర్చి మాధవి, సినీ నటి
రూ.కోటి నగదు బహుమతులు..
50 ఏళ్లకు పైబడిన వారు తమ జీవితం అక్కడితో ముగిసిందని, ఇంటికే పరిమితం కాకూడదని, కలను నెరవేర్చుకునేందుకు ఈ సంస్థ ఏర్పాటైంది. హిమాన్షు జైన్, ప్రీతిష్ నెల్లెరి ఈ వేదికను స్థాపించారు. ఈ ఆడిషన్స్‌లో 500 మందిని ఎంపిక చేసి అందులో టాప్–10 విజేతలకు ప్రత్యేక బహుమతులు, మిగతా వారికి కన్సోలేషన్ బహుమతులు అందిస్తారు. – ఎస్.రామ చంద్రన్, ఖ్యాల్ సౌత్ ఇండియా రీజినల్ హెడ్
ఆరోగ్య కళ.. యోగా..
నేను యోగా సాధకురాలిని, శిక్షకురాలిని. ఆరు పదుల వయసులో యోగా ఒక కళగా ప్రదర్శించడానికి అద్భుతమైన వేదిక లభించింది. వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణ, సామాజిక పరిరక్షణ అవసరమని ఈ వేదికలో భాగస్వామ్యం అయ్యా. ఈ వయసులో ఆరోగ్య సంరక్షణ గురించి తెలియజేసేలా అవకాశాన్ని వినియోగించుకుంటున్నా. – రాజేశ్వరి (60) యోగా నిపుణురాలు
కళలు, క్రీడలు, వ్యాపారం, సాంకేతికత, సామాజిక అంశాలు.. ఇలా ఏ రంగానికి చెందిన వారైనా సరే, ఈ వేదికగా కొత్త సవాళ్లను స్వీకరిస్తూ, అంకితభావం, కళాత్మకతతో ఇతరులకు స్ఫూర్తినిచ్చే వారిని సత్కరిస్తుంది ఈ వేదిక. సరికొత్తగా రూపొందిన ఖ్యాల్ 50 అబవ్ 50 కాంటెస్ట్‌లో 50 ఏళ్లకు పైబడిన వారి ప్రతిభను ప్రపంచానికి చూపిస్తుంది. తమకు ఇష్టమైన రంగంలో పాల్గొనవచ్చని ఖ్యాల్ యాజమాన్యం చెబుతోంది. ఈ పోటీల్లో నగరం నుంచి విభిన్న రంగాలకు చెందిన సీనియర్ సిటీజన్స్ పాల్గొని పాటలు, వంటలు, నృత్యం, కథలు, చిత్రాలు వంటి కళలను ప్రదర్శించారు. ఈ ఆడిషన్స్‌లో సింగింగ్, యోగా, నటన వంటి సృజనాత్మక కళలతో ఆడిషన్స్‌లో పాల్గొన్నారు.