ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): అందరికీ న్యాయం జరగాలనే లక్ష్యంతో పనిచేస్తున్న న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అందించే ఉచిత సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి అన్నారు. సోమవారం స్థానిక జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనంలో న్యాయ సేవాధికార దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గత నవంబర్ నుంచి ఇప్పటివరకూ పలు న్యాయ సేవా కార్యక్రమాలు నిర్వహించామని, 15100 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా 4 వేల మందికిపైగా ఉచిత న్యాయ సలహాలు/న్యాయ సహాయం అందించామన్నారు. మూడు జాతీయ లోక్ అదాలత్‌లలో 24 వేలకు పైగా కేసులను రాజీ చేసి రూ.132 కోట్ల వరకు పరిహారం అందించే ఏర్పాటు చేశామన్నారు. ఉమ్మడి జిల్లాలో 102 మంది ట్రైనీ మీడియేటర్ల ద్వారా 1,427 కేసులలో మధ్యవర్తిత్వం నిర్వహించి 247 కేసులను పరిష్కారించామన్నారు. పాఠశాల్లో లీగల్ ఎయిడ్ క్లబ్‌లను ఏర్పాటు చేసి విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. 1వ అదనపు జిల్లా జడ్జి యు. ఇందిరా ప్రియదర్శిని, 5వ అదనపు జిల్లా జడ్జి ఆర్‌వీవీఎస్ మురళీకృష్ణ, 8వ అదనపు జిల్లా జడ్జి ఐ.శ్రీనివాసమూర్తి, పర్మినెంట్ లోక్ అదాలత్ చైర్‌పర్సన్ ఎ.మేరీ గ్రీస్ కుమారి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి, న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోనె సీతారాం తదితరులు పాల్గొన్నారు.
పోలవరం రూరల్: అఖండ గోదావరి మధ్యలోని పట్టిసం శివక్షేత్రాన్ని దర్శించే భక్తుల సౌకర్యార్థం నది దాటేందుకు ప్రత్యేక పంటును ఏర్పాటుచేశారు. కార్తీక మాసం ప్రారంభం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి దర్శనానికి వస్తుంటారు. ఇటీవల భారీ వర్షాలతో గోదావరిలో వరద తగ్గుతూ పెరుగుతూ ఉంది. లాంచీల్లో తక్కువ మందిని మాత్రమే క్షేత్రానికి తరలించేవారు. పంటు ఏర్పాటుతో ఎక్కువ మందిని తరలించే అవకాశం ఉంటుంది. దీంతో ఇక్కడ లాంచీ స్థానంలో పంటును ఏర్పాటు చేశారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): వచ్చే మార్చిలో జరిగే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు ఫీజుల చెల్లింపు షెడ్యూల్ విడుదలైనట్టు డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ ప్రకటనలో తెలిపారు. ముందుగా హెచ్‌ఎంలు యూడైస్ వెబ్‌సైట్‌లో విద్యార్థుల వివరాలను నవీకరించి సరిచూసుకోవాలని సూచించారు. అనంతరం ఎటువంటి ఆలస్య రుసుం లేకుండా ఈనెల 11 నుంచి 25 వరకు, రూ.50 ఆలస్య రుసుంతో ఈనెల 26 నుంచి డిసెంబర్ 2 వరకు, రూ.200 రుసుంతో డిసెంబర్ 3 నుంచి 9 వరకు ఫీజులు చెల్లించవచ్చన్నారు. రెగ్యులర్ విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు రూ.125, గరిష్ట్టంగా 3 సబ్జెక్టులకు హాజరయ్యే విద్యార్థులు రూ.110, ఒకేషనల్ విద్యార్థులు అదనంగా రూ.60, వయసు నిబంధనల సడలింపు కోరే విద్యార్థులు రూ.300 అదనంగా చెల్లించాలని సూచించారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో అర్నబ్, మురసు తుపాన్ల కారణంగా జరిగిన పంట నష్టాలపై నివేదికలను వెంటనే సమర్పించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. సోమవారం వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాలో వివిధ వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయని, వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టాలను పరిశీలించి, నివేదికను వెంటనే సమర్పించాలని ఆదేశించారు. నష్టాలపై నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం అత్యవసరంగా కోరిందని, రైతు పేరు, పంట విస్తీర్ణం, పంట రకం, పంట నష్టం వివరాలు, తదితర సమాచారాన్ని శాసీ్త్రయంగా లెక్కించి వెంటనే ఆన్‌లైన్‌లో పొందుపరచాలన్నారు. జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ బాషా, మండల వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.


