● దువ్వ, అత్తిలి మండలాలను వీడని వరద
● ప్రజలకు తప్పని ఇబ్బందులు
తణుకు అర్బన్: వరుస తుపాన్ల కారణంగా తణుకు మండలం దువ్వ గ్రామంలో వయ్యేరు కాలువ ఉగ్రరూపం దాల్చిన విషయం తెలిసిందే. తాజాగా వరద నీటి ప్రవాహం కొంతమేర తగ్గినా, గ్రామాలు మాత్రం ఇంకా ముంపులోనే ఉన్నాయి. ఎర్రకాలువ ఉధృతి కారణంగా ప్రమాద స్థాయిని మించి వరద నీరు వయ్యేరులోకి రావడంతో సమీపంలోని రహదారులపైకి నీరు చేరింది. దీంతో వ్యవసాయ క్షేత్రాలు గోదావరి నదిని తలపిస్తున్నాయి. దువ్వ గ్రామ పొలాల నుంచి జాతీయ రహదారిపైకి వరదనీరు చొచ్చుకురావడంతో ఒక సమయంలో రవాణా ప్రమాదకరంగా మారింది. సోమవారం నీటి ప్రవాహం తగ్గడంతో వాహనాల రాకపోకలకు పెద్దగా ఇబ్బందులు ఎదురుకాలేదు. వయ్యేరు గట్టును ఆనుకుని నివసించే పేదల గుడిసెలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి.
ముంపులోనే దువ్వ గ్రామం...
దువ్వ గ్రామంలో వరి చేలు ఇప్పటికీ పూర్తిగా మునిగి ఉండగా, కొన్ని రహదారులు మనుషులు మునిగే స్థాయిలో ఉన్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దువ్వ ప్రధాన రహదారి సమీపంలోని వీధులు ఇంకా ముంపులోనే ఉన్నాయి. ముఖ్యంగా దువ్వ నుంచి వరిఘేడుకు వెళ్లే ప్రధాన రహదారిలో గౌడ రామాలయం ప్రాంత వీధులు ఇంకా నీట మునిగి ఉండటం ఆందోళనకరంగా మారింది. చిన్న పిల్లలు మునిగిపోయే స్థాయిలో వరద నీరు నిల్వ ఉన్నా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు వాపోతున్నారు. దువ్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్తిగా నీటిలో చిక్కుకుపోగా, వీధుల్లో మురుగునీరు రోడ్లపైనే తిష్టవేసింది. వయ్యేరు సామర్థ్యానికి మించి వరద నీరు రావడం దువ్వ గ్రామస్తులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. కేవలం 16 వేల క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న వయ్యేరు రెగ్యులేటర్‌కు, ఈనెల 7వ తేదీ వరకు ఎగువ ప్రాంతాల నుంచి 22 వేలకు పైగా క్యూసెక్కుల వరద నీరు రావడంతో గ్రామస్తులు, భయాందోళనల మధ్య కాలం గడిపారు. ప్రస్తుతం సోమవారం 17 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం వెళ్తున్నట్లు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు.
వరద ముంపులో వరిఘేడు,
తిరుపతిపురం గ్రామాలు
అత్తిలి: యనమదుర్రు డ్రెయిన్ ఉధృత ప్రవాహానికి అత్తిలి మండలం వరిఘేడు, తిరుపతిపురం గ్రామాలను వరదనీరు ముంచెత్తడంతో ఆయా ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. యనమదుర్రు డ్రెయిన్ నీటిమట్టం కొంచెం మేర తగ్గినప్పటికీ, ఆరుదలకోడు అవుట్‌ఫాల్ స్లూయిజ్ గేట్లు మూసిఉండటంతో ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరదనీరు ఆరుదలకోడు డ్రెయిన్ ద్వారా గ్రామాలను ముంచెత్తింది. వరిఘేడు, తిరుపతిపురం గ్రామాల్లోని పల్లపు ప్రాంతాలు నీట మునగడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. వరిఘేడు వెళ్లే ప్రధాన రహదారులపై వరదనీరు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. తిరుపతిపురం, రామచంద్రాపురం గ్రామాల్లోనూ రోడ్లపై నీరు ప్రవహించడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఇళ్లలోకి నీరు వచ్చి చేరడంతో పలు కుటుంబాలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాయి. ఇటువంటి తీవ్రమైన వరద 2005లో సంభవించిందని, మళ్లీ ఇప్పుడే వచ్చిందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. యనమదుర్రు డ్రెయిన్‌కు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరదనీరు తగ్గడానికి మరో రెండు రోజులు పడుతుందని, అప్పటి వరకు ఈ రెండు గ్రామాలు ముంపు నుంచి బయటపడే పరిస్థితి లేదని తెలుస్తోంది. మరోవైపు పశువులకు తగినంత పశుగ్రాసం దొరకక రైతులు నానా తంటాలు పడుతున్నారు. ప్రస్తుతం తిరుపతిపురం, వరిఘేడు, బల్లిపాడు, గుమ్మంపాడు, ఈడూరు ఆయుకట్టు ప్రాంతాలు సముద్రాన్ని తలపిస్తున్నాయి.


