తాడేపల్లిగూడెం రూరల్: వరద బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కేఆర్ కల్పశ్రీ అధికారులను ఆదేశించారు. సోమవారం మండలంలోని నందమూరులో వరద బాధితులను పరామర్శించి, రేషన్ నిల్వలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా వరద కారణంగా నీట మునిగిన ఇళ్లను పరిశీలించిన జేసీ కల్పశ్రీ, బాధిత కుటుంబాలతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. తొలుత రేషన్ దుకాణాన్ని తనిఖీ చేసి, అక్కడి నిల్వలు, రేషన్ పంపిణీ తీరును పరిశీలించారు. కార్యక్రమంలో ఆమె వెంట తహసీల్దార్ ఎం. సునీల్‌కుమార్ ఉన్నారు.
నరసాపురం: బాలికల క్రికెట్‌లో రాణిస్తున్న విద్యార్థిని తరుమాని శరణ్య జాతీయ అండర్–17 క్రికెట్ జట్టుకు ఎంపికై ంది. ఈ విషయాన్ని శ్రీ గౌతమి స్కూల్ కరస్పాండెంట్ చినిమిల్లి దుర్గాప్రసాద్ తెలిపారు. గోదావరి జిల్లాల నుంచి జాతీయ జట్టుకు ఎంపికై న తొలి క్రీడాకారిణి శరణ్యనే అని పేర్కొన్నారు. ఇది మనందరికీ గర్వకారణమని చెప్పారు. ఈ సందర్భంగా శరణ్యను అభినందించడంతోపాటు, భవిష్యత్‌లో ఆమెకు అన్ని విధాలా సహకరిస్తామని హామీనిచ్చారు.
తణుకు అర్బన్: ఆంధ్రప్రదేశ్ రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ (ఏపీఆర్‌ఎస్‌ఏ) ఆధ్వర్యంలో 38వ అంతర్ జిల్లా రోలర్, ఇన్‌లైన్ హాకీ చాంపియన్‌షిప్ పోటీలను తణుకులోని మాంటిస్సోరీ పాఠశాలలో నిర్వహించనున్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. మంగళవారం నుంచి ఈ నెల 12వ తేదీ ఈ పోటీలు జరుగుతాయన్నారు. పాఠశాల డైరెక్టర్ అనపర్తి ప్రకాశరావు మాట్లాడుతూ పోటీలను తమ పాఠశాలలో నిర్వహించడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ టోర్నమెంట్‌కు వివిధ జిల్లాల నుంచి 250 మందికి పైగా క్రీడాకారులు హాజరవుతున్నట్లు తెలిపారు.
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): శాసన మండలి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకూ 14 వేల దరఖాస్తులు వచ్చాయని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌వో) తిప్పేనాయక్ తెలిపారు. కలెక్టరేట్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాకినాడ జిల్లాలో 3,349, కోనసీమ జిల్లాలో 1,499, తూర్పు గోదావరి జిల్లాలో 2,747, పశ్చిమ గోదావరి జిల్లాలో 2,986, ఏలూరు జిల్లాలో 2,370, పోలవరం జిల్లాలో 1,061 చొప్పున దరఖాస్తుల డేటా ఎంట్రీ పూర్తయ్యిందన్నారు. ఇంకా దాదాపు 2 వేల దరఖాస్తుల పరిశీలన, డేటా ఎంట్రీ పూర్తి కావాల్సి ఉందని చెప్పారు. వీటితో దరఖాస్తుల సంఖ్య 16 వేలు దాటే అవకాశముందని వెల్లడించారు. అర్హత కలిగిన ఉపాధ్యాయుల పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేస్తామని డీఆర్‌ఓ చెప్పారు.
ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు
ద్వారకాతిరుమల: చినవెంకన్న దర్శనార్థం స్కూటీపై వెళుతున్న ఇద్దరు మహిళలు రోడ్డుపై ఉన్న గుంతలోపడి తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికుల కథనం ప్రకారం. ఏలూరుకు చెందిన ఎం.పద్మ, ఎం.రాజేశ్వరి స్కూటీపై సోమవారం రాత్రి ద్వారకాతిరుమల క్షేత్రానికి వెళుతున్నారు. స్థానిక నిమ్మకాయల మార్కెట్ యార్డు వద్దకు వచ్చేసరికి రోడ్డుపై ఉన్న గుంతలో స్కూటీ పడటంతో అదుపుతప్పి వారు రోడ్డుపై పడిపోయారు. వారికి తీవ్ర గాయాలయ్యాయి. కామవరపుకోట 108 ఆంబులెన్స్‌లో క్షతగాత్రులను భీమడోలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
ఉండి: మనస్తాపంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉండి మండలం ఎన్నార్పీ అగ్రహారం బీసీ కాలనీకి చెందిన కింజంగి సాయిరాం (38) మద్యానికి బానిసై పనికి కూడా వెళ్లడం లేదు. దీనిపై తరచూ భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 7వ తేదీ రాత్రి భార్యతో మరోసారి గొడవపడ్డాడు. దీంతో మనస్తాపానికి గురైన అతడు కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకుని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతడిని భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. దీనిపై ఆసుపత్రి నుంచి అందిన సమాచారం మేరకు హెడ్ కానిస్టేబుల్ ఏసయ్య కేసు నమోదు చేశారు.


