ద్వారకాతిరుమల: అజ్ఞానాంధకారాన్ని పారద్రోలి జ్ఞానజ్యోతులను వెలిగించే దీపావళి పర్వదినం.. ఆధ్యాత్మిక శోభతో అలరారింది. మిరుమిట్లు గొలిపే బాణసంచా వెలుగులు.. మంగళవాయిద్యాల మధురనాదాలు.. వేదమంత్రాల పఠనాల నడుమ ఉభయ దేవేరులతో కొలువుదీరిన శ్రీవారు క్షేత్ర పురవీధుల్లో విహరించి భక్తులకు కనువిందు చేశారు. ద్వారకాతిరుమల క్షేత్రంలో ప్రతి ఏటా సంప్రదాయబద్ధంగా నిర్వహించే దీపావళి ఉత్సవాన్ని పర్వదిన తిథిలో తగులు, మిగులు కారణంగా దేవస్థానం అధికారులు సోమవారం రాత్రి అత్యంత వైభవంగా జరిపారు. తొలుత దేవస్థానం సిబ్బంది ఆలయ ప్రాంగణాన్ని దీపాలతో సర్వాంగసుందరంగా అలంకరించారు. అనంతరం అర్చకులు స్వామి, అమ్మవార్లను తోళక్క వాహనంపై ఆశీనులను చేసి, వివిధ రకాల పుష్పాలతో విశేషంగా అలంకరించి శాస్త్రోక్తంగా పూజలు, హారతులు సమర్పించారు. ఆ తరువాత వేదపండితుల మంత్రోచ్చరణలు.. మేళతాళాలు.. మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనం ప్రధాన రాజగోపురం మీదుగా క్షేత్ర పురవీధులకు బయలుదేరింది. ఈ సందర్భంగా ప్రధాన మెట్ల మార్గంలో దేవస్థానం సిబ్బంది భారీ ఎత్తున బాణసంచా కాల్చి వేడుకకు మరింత శోభను చేకూర్చారు. అనంతరం పాదుకా మండపం వద్ద దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాథరావు దంపతులు స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్షేత్ర పురవీధుల్లో స్వామివారి వాహనం ముందుకు సాగుతుండగా భక్తులు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చుతూ తమ భక్తిప్రపత్తులను చాటుకున్నారు.
బాణసంచా వెలుగుల్లో దేదీప్యమానంగా
దర్శనమిచ్చిన చినవెంకన్న


