ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): వచ్చే డిసెంబర్ 11 నుంచి 22 వరకు తెలంగాణలో జాతీయ స్థాయి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ జరుగనున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ జట్ల ఎంపిక కోసం ఈ నెల 10న రాష్ట్ర స్థాయి సెలక్షన్లు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్‌ఏ అజీజ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎంపికలు పలు ప్రాంతాల్లో జరగనున్నాయి. కాకినాడలో ఖో–ఖో బాలుర విభాగం, గుంటూరులో కబడ్డీ 70 కేజీల విభాగం, భీమవరంలో మల్లకంబ్ బాలురు, బాలికల విభాగం ఎంపికలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆసక్తి గల ఏలూరు జిల్లా క్రీడాకారులు ఈ నెల 10వ తేదీ ఉదయం 8:30 గంటలకు పైన తెలిపిన సంబంధిత కేంద్రాల్లో హాజరు కావాలని సూచించారు. 2009 జనవరి 1వ తేదీ తర్వాత జన్మించిన వారు మాత్రమే ఈ ఎంపికలకు అర్హులని స్పష్టం చేశారు. వివరాలకు కాకినాడ జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి 87126 22568, గుంటూరు జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి 81431 43222, భీమవరం జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి 96405 03679 నెంబర్లలో సంప్రదించాలన్నారు.
జంగారెడ్డిగూడెం(బుట్టాయగూడెం): బావను బావమరిది హత్య చేసిన ఘటన జంగారెడ్డిగూడెం మండలంలోని మైసన్నగూడెంలో చోటుచేసుకుంది. ఎస్సై ఎన్‌వీ ప్రసాద్ తెలిపిన వివరాలు ఇవి. మైసన్నగూడెంకు చెందిన బషీర్ (40) మద్యానికి బానిసై తన భార్య గౌసియాభేగంను గత కొంతకాలంగా హింసిస్తున్నాడు. ఇది మంచి పద్ధతి కాదని గౌషియాభేగం అన్న సుభాని తన బావ బషీర్‌ను పలుమార్లు హెచ్చరించాడు. అయినా తీరు మార్చకోకపోగా సోమవారం కూడా మద్యం సేవించి వచ్చిన బషీర్ తన భార్యను హింసించడంతో కోపోద్రిక్తుడైన బావమరిది సుభాని చాకుతో బషీర్‌పై దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన బషీర్‌ను జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా, మృతిచెందినట్లు ఎస్సై ఎన్‌వీ ప్రసాద్ తెలిపారు. మృతునికి ఇద్దరు సంతానం కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి సీఐ ఎంవీ సుభాష్ దర్యాప్తు చేస్తున్నారు.


