న్యూస్‌రీల్
జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. గురువారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ నిర్వహణకు సర్వం సిద్ధమైంది. జిల్లాల పునర్విభజన తర్వాత ఏలూరు జిల్లాలో తొలిసారి పరిషత్ ఎన్నికలు జరుగుతున్నాయి.
సాక్షి ప్రతినిధి, ఏలూరు: జిల్లా వ్యాప్తంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మురసు తుపాను ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటం, ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతూ కొన్ని ప్రధాన రహదారులు జలదిగ్బంధంలో చిక్కుకున్నప్పటికీ, పోలింగ్‌ను యథావిధిగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఈ మేరకు అధికారులు తగిన భద్రతా చర్యలతో సిద్ధమయ్యారు.
12.96 లక్షల మంది ఓటర్లు
జిల్లాలోని 27 మండలాల పరిధిలో మొత్తం 26 జెడ్పీటీసీ, 443 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో 12,96,515 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. జిల్లావ్యాప్తంగా 1,555 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఓటింగ్ కోసం 2,444 బ్యాలెట్ బాక్సులను వినియోగిస్తున్నారు. ఇప్పటికే పెదవేగి జెడ్పీటీసీ స్థానంతో పాటు 11 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కావడంతో, మిగిలిన స్థానాల్లో ఎన్నికల సమరం సాగుతోంది.
పకడ్బందీ ఏర్పాట్లు : రెవెన్యూతో పాటు ఇతర శాఖల ఉద్యోగులకు ఎన్నికల విధులు కేటాయించి, ముందస్తు శిక్షణ పూర్తి చేశారు. బుధవారం సాయంత్రానికే పోలింగ్ సామాగ్రి పంపిణీ ప్రక్రియ పూర్తయింది. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఒక ప్రిసైడింగ్ అధికారి, ముగ్గురు పోలింగ్ సిబ్బంది విధుల్లో ఉంటారు. నిరంతర పర్యవేక్షణ కోసం రూట్ ఆఫీసర్లను నియమించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఉదయం 7 నుంచి..
స్థానిక ఎన్నికల పోలింగ్ ఉదయం 7:00 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5:00 గంటల వరకు కొనసాగుతుంది. గురువారం ఉదయం 6:00 గంటల నాటికే పోలింగ్ కేంద్రాల్లో మాక్ పోలింగ్ సహా అన్ని ప్రాథమిక ఏర్పాట్లు పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఈ నెల 7వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడతారు.
పోలింగ్ ప్రక్రియను అప్రమత్తతో నిర్వహించాలి
భీమడోలు: జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను సిబ్బంది అత్యంత అప్రమత్తతతో, బాధ్యతాయుతంగా నిర్వహించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. భీమడోలులోని శ్రీవేంకటేశ్వర డిగ్రీ కళాశాలలో బుధవారం ఏర్పాటు చేసిన పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని ఆమె పరిశీలించి, ఏర్పాట్లపై సిబ్బందిని పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని 26 జెడ్పీటీసీ, 443 ఎంపీటీసీ స్థానాలకు గురువారం పోలింగ్, 7న ఓట్ల లెక్కింపు చేపడతామని తెలిపారు. వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్ల భద్రతకు సిబ్బంది మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో అదనపు భద్రతా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. సిబ్బందిని పోలింగ్ పరికరాలతో సహా బస్సుల్లో సురక్షితంగా కేంద్రాలకు తరలించామని, ప్రయాణ సమన్వయం కోసం ప్రతి బస్సులో ఒక రూట్ అధికారిని నియమించామని వివరించారు. పోలింగ్ ప్రక్రియపై సిబ్బందికి ఇప్పటికే రెండు విడతల్లో పూర్తిస్థాయి శిక్షణ అందించామన్నారు. సాయంత్రం పోలింగ్ ముగిసిన వెంటనే బ్యాలెట్ బాక్సులను జాగ్రత్తగా సీల్ చేసి స్ట్రాంగ్ రూమ్‌లకు చేర్చాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ సమయంలో కేంద్రాల వద్ద ఎవరైనా ఆటంకాలు లేదా న్యూసెన్స్ సృష్టిస్తే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల రిటర్నింగ్ అధికారి డి. దామోదర్, ఎంపీడీఓ సీహెచ్ పద్మావతిదేవి, తహసీల్దార్ బి.రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
బుట్టాయగూడెం: మురసు తుపాను కారణంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నాలుగు మండలాల్లో గురువారం జరగాల్సిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ 6వ తేదీకి వాయిదా పడింది. భారీ వర్షాల కారణంగా వేలేరుపాడు, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం మండలాలకు చెందిన రిటర్నింగ్ అధికారులు ఆయా మండలాల్లోని పరిస్థితులను కలెక్టర్ దృష్టికి తీసుకురావడంతో ఆమె రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు విషయాన్ని నివేదించారు. దీంతో బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, వేలేరుపాడు, పోలవరం మండలాల్లో గురువారం జరగాల్సిన పోలింగ్‌ను శుక్రవారానికి మార్చుతున్నట్లు కమిషన్ తెలియజేసింది. ఈ మేరకు 6న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ను సజావుగా నిర్వహించి, 7వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహించాలని సూచించారు.
ఓటుకు వేళాయే
26 జెడ్పీటీసీ స్థానాలు, 443 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు
12.96 లక్షల మంది ఓటర్లు
1555 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
నాలుగు మండాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వాయిదా
7న యథావిధిగా కౌంటింగ్‌ప్రక్రియ
(ఏఐ సృష్టించిన చిత్రం)


