ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్. శ్రీదేవి ఆధ్వర్యంలో ఈనెల 21న ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చెక్ బౌన్స్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్. శ్రీలక్ష్మి తెలిపారు. బుధవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా 10 వేలకు పైగా చెక్ బౌన్స్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు. ఈ కేసుల విచారణకు సుదీర్ఘ సమయం పడుతుంది కాబట్టి కక్షిదారులు సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. లోక్ అదాలత్ ద్వారా పూర్తయిన కేసులకు అప్పీలు ఉండదని, దీనివల్ల సమయం, డబ్బు ఆదా అవుతాయని పేర్కొన్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ద్వారకాతిరుమల: శ్రీవారి హుండీల లెక్కింపు బుధవారం స్థానిక ప్రమోద కల్యాణ మండపంలో పారదర్శకంగా నిర్వహించినట్లు ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. ఏలూరు జిల్లా దేవాదాయశాఖ అధికారి కె.శ్రీనివాసు, ఆలయ ట్రస్ట్‌బోర్డు సభ్యులు, పోలీసుల పర్యవేక్షణలో ఈ లెక్కింపు నిర్వహించారు. గడిచిన 27 రోజులకు గాను స్వామివారికి నగదు రూపంలో రూ.2,52,47,879 ఆదాయం సమకూరింది. రోజుకు సగటున రూ.9,35,107 ఆదాయం వచ్చినట్లు ఈఓ వెల్లడించారు. నగదుతో పాటు కానుకల రూపంలో 127 గ్రాముల బంగారం, 3.466 కేజీల వెండి, భారీగా విదేశీ కరెన్సీ లభించాయి. చెల్లుబాటు కాని పాత రూ.2000, రూ.1000, రూ.500 నోట్ల రూపంలో రూ.8,500 వచ్చినట్లు పేర్కొన్నారు.


