జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించండి | - | Sakshi
Sakshi News home page

జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించండి

Nov 5 2026 1:22 AM | Updated on Nov 5 2026 1:22 AM

ఏలూరు టౌన్‌: రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి ప్రభుత్వ సేవలను ప్రజల ఇంటివద్దకే అందించడమే కాకుండా, నాణ్యమైన విద్య, వైద్యంతో సంక్షేమ పాలన అందించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ, ఏలూరు పార్లమెంట్‌ పరిశీలకులు వంకా రవీంద్రనాథ్‌ పేర్కొన్నారు. గ్రామీణాభివృద్ధి సాకారం కావాలంటే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఏలూరులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ నేతలు ఎప్పుడూ కార్యకర్తలకు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. ఏలూరు కార్పొరేషన్‌ ఎన్నికల్లో విజయం సాధించిన 24వ డివిజన్‌ కార్పొరేటర్‌ గేదెల సూర్యప్రకాష్‌, 32వ డివిజన్‌ కార్పొరేటర్‌ జక్కుల రవికుమార్‌ (బెనర్జీ), 53వ డివిజన్‌ కార్పొరేటర్‌ ఎస్‌.కె. ఆయేషా సుల్తానా రియాజ్‌లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

పురపోరులో వైఎస్సార్‌సీపీకి పెరిగిన ప్రజాదరణ

ఏలూరు కార్పొరేషన్‌తో పాటు నూజివీడు, జంగారెడ్డిగూడెం పురపాలక ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్‌సీపీకే మద్దతుగా నిలిచారని రవీంద్రనాథ్‌ తెలిపారు. గత సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ఆధిక్యత గణనీయంగా తగ్గిందని స్పష్టం చేశారు. జంగారెడ్డిగూడెంలో కూటమి ఆధిక్యం 15 వేల నుంచి 7 వేలకు, నూజివీడులో 15 వేల నుంచి 4 వేలకు, ఏలూరు కార్పొరేషన్‌లో 60 వేల నుంచి 39 వేలకు పడిపోయిందని వివరించారు. అధికారంలో ఉన్నప్పటికీ ఓటమి భయంతో ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని విమర్శించారు.

ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడతాం: జీఎంఆర్‌

ఏలూరు నగరపాలక ఎన్నికల్లో పార్టీ విజయానికి శ్రమించిన నాయకులు, కార్యకర్తలు మరియు సమన్వయకర్త జయప్రకాష్‌కు ఏలూరు మేయర్‌ అభ్యర్థి జీఎంఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయినా 2024 ఎన్నికల హామీలను నెరవేర్చలేక చేతులెత్తేసిందని మండిపడ్డారు. ఏలూరు నగరంలో తమపై నమ్మకంతో ఓటేసిన 37 వేల మందికి పైగా ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ప్రజల తరఫున నిలబడి పోరాడతామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ ఏలూరు నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, కై కలూరు పరిశీలకుడు నూకపెయ్యి సుధీర్‌బాబు, చింతలపూడి పరిశీలకుడు దాసరి రమేష్‌, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్‌గురునాథ్‌, కార్పొరేటర్‌ జక్కుల రవికుమార్‌ (బెనర్జీ), బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, వైఎస్సార్‌టీయూ జిల్లా అధ్యక్షుడు పల్లి శ్రీనివాస్‌, ఆర్‌టీఐ జిల్లా అధ్యక్షుడు వేంపాటి స్టాన్లీబాబు, నగర మహిళా అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల, నగర బీసీ సెల్‌ అధ్యక్షుడు కిలాడి దుర్గారావు, లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు ప్రత్తిపాటి తంబి, జిల్లా కార్యదర్శి సాసుపల్లి యుగంధర్‌ప్రసాద్‌, నగర మున్సిపల్‌ వింగ్‌ అధ్యక్షుడు బుద్దాల రాము తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ రవీంద్రనాథ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement