ఉగ్రరూపం దాల్చిన పెద్దవాగు
● జిల్లావ్యాప్తంగా 12 గంటల్లో 3195.4 మిల్లీ మీటర్ల వర్షపాతం
● ఏజెన్సీ ప్రాంతం అతలాకుతలం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): మురసు తుఫాను ప్రభావంతో మంగళవారం రాత్రి 8.30 గంటల నుంచి బుధవారం ఉదయం 8.30 గంటల వరకూ జిల్లా వ్యాప్తంగా 3195.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వర్షపాతం సగటున 114.1 మిల్లీ మీటర్లుగా నమోదైంది.
వర్షపాతం ఇలా.. భీమడోలులో 153 మిల్లీ మీటర్లు, దెందులూరులో 149.4, ఏలూరు రూరల్ పరిధిలో 92, ఏలూరు అర్బన్‌లో 104.2, కై కలూరులో 75, కలిదిండిలో 94.6, మండవల్లిలో 111, ముదినేపల్లిలో 107.2, నిడమర్రులో 117.2, పేదవేగిలో 95.4, పెదపాడులో 123.2, ఉంగుటూరులో 158.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయింది. అలాగే జంగారెడ్డి గూడెం డివిజన్ పరిధిలో బుట్టాయిగూడంలో 93.4, వేలేరుపాడులో 73, కామవరపుకోటలో 181, జంగారెడ్డిగూడెంలో 128.2, పోలవరంలో 97.6, టీ. నరసాపురంలో 137, ద్వారకాతిరుమలలో 137.2, కొయ్యలగూడెంలో 115.6, కుక్కునూరులో 62.6, జీలుగుమిల్లిలో 154 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదయింది. దీనితో పాటు నూజివీడు డివిజన్లో ఆగిరపల్లిలో 74.8, చాట్రాయిలో 63.4, ముసునూరులో 122.8, నూజివీడులో 95.8, చింతలపూడిలో 155.4, లింగపాలెంలో 123 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బుధవారం ఉదయం ఏలూరు డివిజన్లోని వివిధ మండలాల్లో 78.6 మిల్లీమీటర్లు, జంగారెడ్డిగూడెం డివిజన్లోని వివిధ మండలాల్లో 1062.6, నూజివీడు డివిజన్లో 14.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఏజెన్సీలో భారీ వర్షం
బుట్టాయగూడెం: మురసు తుపాను ప్రభావంతో ఏజెన్సీ ప్రాంతం తీవ్రంగా ప్రభావితమైంది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండవాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ ఏడాది కొండవాగులు ఈ స్థాయిలో పొంగిపొర్లడం ఇది రెండోసారి. కొండలపై నుంచి దూసుకొచ్చిన వరద నీరు లోతట్టు గ్రామాలను ముంచెత్తింది. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారులు జలమయం కావడంతో పలు ప్రాంతాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.
పొంగిపొర్లుతున్న వాగులు : బుట్టాయగూడెం మండలంలో జల్లేరు, పులిరామన్నగూడెం, చింతకొండ, కేఆర్‌పురం తూర్పు కాలువ, కొవ్వాడ కాలువ, గుబ్బల మంగమ్మ గుడి మార్గంలోని వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జల్లేరు వాగుపై నిర్మిస్తున్న నేషనల్ హైవే కొత్త బ్రిడ్జి సామాగ్రి వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. బుట్టాయగూడెం గ్రామం చుట్టూ వరద నీరు చేరడంతో ఆ ప్రాంతం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. గుబ్బల మంగమ్మ ఆలయ మార్గంలో వాగు ఉధృతి పెరగడంతో ఆలయ గేట్లను మూసివేశారు.
రిజర్వాయర్లకు భారీగా వరద నీరు
జల్లేరు జలాశయం, పోగొండ రిజర్వాయర్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ముందస్తు చర్యగా అధికారులు జల్లేరు జలాశయానికి చెందిన రెండు గేట్లను ఎత్తి సుమారు 500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.
ఎన్నికల సిబ్బందికి తప్పని తిప్పలు
పరిషత్ ఎన్నికల విధులకు వెళ్లే సిబ్బంది, పోలీసులు వాగుల ప్రవాహంతో తీవ్ర అవస్థలు పడ్డారు. బుట్టాయగూడెం–జంగారెడ్డిగూడెం మార్గంలోని మార్కండేయపురం వాగు పొంగడంతో వాహనాలు నిలిచిపోయాయి. సాయంత్రం 6 గంటల వరకు సిబ్బంది బుట్టాయగూడెం చేరుకోలేకపోయారు. అలాగే కేఆర్‌పురం సమీపంలోని వాగు ఉధృతి వల్ల పోలవరం నుంచి వచ్చే సిబ్బంది కూడా గంటల తరబడి నిలిచిపోయి, సాయంత్రానికి కార్యాలయాలకు చేరుకున్నారు.
జీలుగుమిల్లి మండలంలో స్తంభించిన రవాణా
జీలుగుమిల్లి మండలంలోనూ కొండవాగులు ఉప్పొంగాయి. జీలుగుమిల్లి – కామయ్యపాలెం మార్గంలో వాగు పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. లక్ష్మీపురం సమీపంలో ప్రధాన జాతీయ రహదారిపైకి భారీగా వరద నీరు చేరడంతో సుమారు కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న ఎస్సై క్రాంతికుమార్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని, వరద ఉధృతి తగ్గగానే ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
లక్ష్మీపురం వద్ద కొట్టుకుపోయిన జాతీయ రహదారి
మురుసు తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు ఏజెన్సీ ప్రాంతంలో వరద ఉధృతి ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురం వద్ద వరద నీరు తీవ్రంగా ప్రవహించడంతో జాతీయ రహదారి ఒక్కసారిగా కోతకు గురై కొట్టుకుపోయింది. రహదారి పూర్తిగా దెబ్బతినడంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు తీవ్రంగా స్తంభించిపోయాయి. ప్రధాన రహదారి తెగిపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు.
కేకేఎం ఎర్రకాలువ జలాశయానికి
కొనసాగుతున్న వరద
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీ కరాటం ఎర్రకాలువ జలాశయానికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. బుధవారం రాత్రి 7 గంటల సమయానికి జలాశయం నీటిమట్టం 82.10 మీటర్లకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 83.50 మీటర్లు కాగా, జలాశయం నిండటానికి ఇంకా 1.40 మీటర్లు మాత్రమే ఖాళీ ఉంది. జలాశయం మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 4.428 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 3.224 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులో ఇంకా 1.204 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు 4 గేట్లను ఎత్తి బయటకు (అవుట్ ఫ్లో) 19,756 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
వేలేరుపాడు: తెలంగాణ రాష్ట్రంలోని పెద్ద వాగు ప్రాజెక్టు ఉగ్రరూపం దాల్చడంతో వేలేరుపాడు మండంల ముంపునకు గురైంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన రింగుబండ బుధవారం ఉదయం 10 గంటలకు తెగిపోవడంతో వరద పోటెత్తింది. ఈ వాగు వెంబడి ఉన్న ఊళ్ళన్నీ నీటివశమమయ్యాయి. మండలంలోని మేడేపల్లి, కమ్మరిగూడెం, అల్లూరు నగర్, ఒంటిబండ, రామవరం ఉదయ నగర్. రామవరం ఊట గుంపు. గుళ్లవాయి తదితర గ్రామాల్లో ఇండ్లన్నీ నీట మునిగాయి. ఒక్క కమ్మరిగూడెం గ్రామంలో 170 ఇండ్లు నీట మునిగాయి. ఒక్కసారిగా వరదరావడంతో ప్రాణాలు అరచేత పట్టుకొని గ్రామస్తులంతా చేరువలో ఉన్న గుట్టవైపు పరుగులు తీశారు.


