చాలా ఆనందం
పరుగే ప్రపంచం..
తండ్రి ఆశలు.. కలలు నెరవేర్చేందుకు ఆమె వేసిన తొలి అడుగులు ఒలింపిక్స్ గడ్డపై పరుగులుగా మారాయి. తండ్రి తపనను చిన్నతనంలోనే అర్థం చేసుకుని ఆయన అడుగుజాడల్లో శ్రమిస్తూ పశ్చిమగోదావరి ఖ్యాతిని అంతర్జాతీయస్థాయిలో ఇనుమడింపజేస్తోంది తణుకువాసి దండి జ్యోతికశ్రీ. పట్టుదల, నిబద్ధతకు మారుపేరుగా నిలిచి పంటి బిగువున కష్టాన్ని నొక్కిపెట్టి మహిళా లోకానికి వన్నె తెస్తోంది. తమకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన జ్యోతికశ్రీని మా ఇంటి ‘బంగారం’ అంటున్నారు ఆ తల్లిదండ్రులు.
అథ్లెటిక్స్ ప్రస్థానం
● పాఠశాల విద్య నుంచి జ్యోతికశ్రీ తండ్రి సూచన మేరకు తణుకు చిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో తన 14వ ఏట నుంచి తండ్రితోపాటు పరుగు మొదలుపెట్టింది.
● అక్కడి నుంచి రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ప్రతిభ చాటుతోంది.
● 2024లో బహర్మాస్‌లో జరిగిన వరల్డ్ రిలే అథ్లెటిక్స్‌లో రెండో స్థానంలో నిలిచి 2024 ఆగస్టులో పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో అడుగుపెట్టింది.
● 4 ఇంటు 4 రిలేలో ప్రాతినిధ్యం వహించి టీమ్‌లో మంచి టైమింగ్ చేసింది.
● ఇప్పటివరకు అంతర్జాతీయ స్థాయిలో 4 మెడల్స్, జాతీయ స్థాయిలో 20, రాష్ట్రస్థాయిలో 30 మెడల్స్‌తోపాటు మొత్తంగా 100 వరకు పతకాలు సాధించింది.
● కేరళలోని త్రివేండ్రంలోని నేషనల్ కోచింగ్ క్యాంపులో శిక్షణ పొందుతూ రైల్వేలో సీసీటీఎస్‌గా ఉద్యోగం చేస్తోంది.
● ప్రస్తుతం గాయం కారణంగా ఏషియన్ గేమ్స్‌లో ప్రాతినిధ్యం వహించలేకపోయింది.
నా తల్లితండ్రుల కష్టం, గురువులు అందించిన సహకారంతో 2024లో ఒలింపిక్స్‌లో అడుగుపెట్టగలిగాను. నా కోసం ఎన్నో త్యాగాలు చేసిన నాన్న నా వెన్నంటే ఉంటూ మంచి భవిష్యత్తు అందించారు. 2027లో నేషనల్ గేమ్స్, ఏషియన్ చాంపియన్‌షిప్‌లో మెడల్స్ సాధించి 2028లో మరోసారి ఒలింపిక్స్‌లో అడుగుపెట్టేందుకు సన్నమద్ధమవుతున్నా. ఒలింపిక్స్‌లో పతకమే నా లక్ష్యం
– దండి జ్యోతికశ్రీ, అథ్లెటిక్
తణుకు అర్బన్ : తణుకుకు చెందిన దండి శ్రీనివాసరావు, లక్ష్మీ నాగ వెంకటేశ్వరి దంపతులకు ఇద్దరు కుమార్తెలు కాగా.. జ్యోతికశ్రీ చిన్నది. శ్రీనివాసరావు వివాహం ముందు నుంచి బాడీ బిల్డర్‌గా నైపుణ్యం సాధించారు. రాష్ట్రస్థాయిలో పలు ప్రదర్శనలు ఇచ్చారు. బీరువాలు తయారుచేసే వృత్తిలో జీవనం సాగిస్తున్న ఆయన వివాహానంతరం కుటుంబ స్థితిగతులు, ఆర్థిక సమస్యల కారణంగా తనకి ఇష్టమైన బాడీ బిల్డింగ్‌ను పక్కన పెట్లాల్సి వచ్చింది. ఈ క్రమంలో తన బిడ్డలను క్రీడాకారులుగా మార్చాలనుకుని నిశ్చయించుకున్నారు. క్రీడల్లో చురుగ్గా ఉండే చిన్న కుమార్తె జ్యోతికశ్రీని అథ్లెట్‌గా మార్చాలనుకుని.. తొలి గురువు తానే అయ్యారు.
నేను ఆశించిన దాని కంటే ఎక్కువగానే జ్యోతికశ్రీ సాధించింది. తణుకులో మొదలైన చిన్నపాటి అడుగులు నేడు ప్రపంచంతో పోటీపడే స్థితికి వెళ్లిందంటే ఎంత కఠోర శ్రమ పడిందో మాతోపాటు శిక్షణనిచ్చిన గురువులకే తెలుసు. జ్యోతికశ్రీ తండ్రిగా నన్ను పరిచయం చేస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఒలింపిక్స్ తర్వాత జ్యోతికశ్రీతోపాటు నాకు ఎన్నో సత్కారాలు దక్కాయి.
– దండి శ్రీనివాసరావు, జ్యోతికశ్రీ తండ్రి
దండిగా నైపుణ్యం..
విజయమే లక్ష్యం..
మా ఇంటి బంగారం
నాన్న కలను సాకారం చేస్తూ.. అథ్లెటిక్స్‌లో రాణిస్తున్న జ్యోతికశ్రీ
తణుకు నుంచి ఒలింపిక్స్ వరకూ..
తొలి అడుగు నాన్నతోనే..


