నూజివీడు: పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో ఈ ఏడాది ఆగస్టు 16న యువకుడు మృతి చెందిన ఘటనపై శనివారం విచారణ నిర్వహించారు. మండలంలోని బోర్వంచకు చెందిన రామకూరి ప్రేమ్‌బాబు (33) కడుపులో నొప్పిగా ఉండటం, వాంతులు అవుతుండటం, యూరిన్ కూడా రాకపోవడంతో ఆగస్టు 15న మధ్యాహ్నం 2 గంటల సమయంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. అయితే అతను ఆసుపత్రిలోనే తరువాత రోజు ఉదయం చనిపోయాడు. దీంతో అతని తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేయడంతో పాటు ఆ తరువాత సబ్‌కలెక్టర్‌కు, ఉన్నతాధికారులకు తమ కుమారుడికి సరిగా వైద్యం చేయకపోవడం వల్లనే చనిపోయాడని ఫిర్యాదు చేశారు. దీంతో జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి చెందిన వైద్యులు శారద, భీమడోలు సీహెచ్‌సీ వైద్యుడు ఆనంద్‌కుమార్, పాలకొల్లు ఏరియా ఆసుపత్రి ఆర్‌ఎంఓ డాక్టర్ జనార్ధన్ బాబులతో కూడిన బృందాన్ని విచారణ నిమిత్తం నియమించగా వారు నూజివీడు ఏరియా ఆసుపత్రికి వచ్చి విచారించారు. దీనిలో భాగంగా మృతుడి తల్లిదండ్రులను, డ్యూటీ చేసిన ఏఎన్‌ఎంలను, వైద్యుడిని విచారించి రాతపూర్వకంగా వారి స్టేట్‌మెంట్‌లను నమోదు చేసుకున్నారు. వైద్యుడు, నర్సులు పొంతన లేని అంశాలను తెలపడం గమనార్హం. యువకుడి కండీషన్ గురించి ఫోన్ చేస్తే పదేపదే ఫోన్ చేయొద్దని డాక్టర్ అనేవారని విచారణ బృందం వద్ద నర్సులు చెప్పారు. విచారణ నివేదికను తయారు చేసి పంపుతామని వైద్య బృందం పేర్కొంది.


