స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యం

Sep 11 2026 9:58 AM | Updated on Sep 11 2026 9:58 AM

స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యం

చింతలపూడి: రాష్ట్రంలో కూటమి అన్యాయాలను ఎండగడుతూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వెన్నుపోటు పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్‌) పిలుపునిచ్చారు. స్థానిక వీకేఎం ఫంక్షన్‌ హాల్‌లో గురువారం నియోజకవర్గ ఇన్‌చార్జి కంభం విజయరాజు అధ్యక్షతన వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డీఎన్నార్‌ మాట్లాడుతూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సమష్టిగా పనిచేయాలన్నారు. సూపర్‌ సిక్స్‌ హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలకు మొండిచేయి చూపిందన్నారు. నియోజకవర్గంలో ఎక్కడా ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వరాదని, కూటమి నేతలతో ఎవరైనా లాలూచీ పడితే పార్టీపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రూపు రాజకీయాలు, వ్యక్తిగత పట్టుదలను పక్కనపెట్టి గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయించాలని సూచించారు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీని అత్యధిక మెజార్టీతో గెలిపించి వైఎస్‌ జగన్‌కు కానుకగా అందించాలని, ఈ విజయం జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడానికి పునాది కావాలన్నారు.

కూటమి పాలనపై పోరాటం : మచిలీపట్నం నియోజకవర్గ పరిశీలకుడు జెట్టి గురునాథరావు మాట్లాడుతూ రెండున్నరేళ్లుగా కూటమి పాలనపై వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తోందన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లిందని, ముఖ్యంగా జంగారెడ్డిగూడెం, కామవరపుకోట, లింగపాలెం మండలాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

కూటమికి రోజులు దగ్గర పడ్డాయి

నియోజకవర్గ ఇన్‌చార్జి కంభం విజయరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తోందని, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. కూటమికి రోజులు దగ్గరపడ్డాయన్నారు. నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్‌, వార్డు సభ్యుల స్థానాలన్నింటినీ గెలుచుకోవడానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా కృషి చేయాలన్నారు. అనంతరం ‘వెన్నుపోటు పార్టీ..వెన్నుపోటు పాలన’ పోస్టర్లను నేతలు ఆవిష్కరించారు. ముందుగా ఇటీవల మృతి చెందిన పార్టీ ముఖ్య నేతలు జగ్గవరపు జానకీరెడ్డి, పుచ్చకాయల వినోద్‌రెడ్డి, వేమన్‌ రెడ్డి, గంగాధర్‌ రావులకు మౌనం పాటించి నివాళులర్పించారు. నియోజకవర్గ పరిశీలకుడు దాసరి రమేష్‌, జెడ్పీటీసీ మొలుగుమాటి నీరజా సుధాకర్‌, మున్సిపల్‌ విభాగం జిల్లా అధ్యక్షుడు బొడ్డు వెంకటేశ్వర్రావు, పట్టణ అధ్యక్షుడు కొప్పుల నాగేశ్వర్రావు, లింగపాలెం మండల అధ్యక్షుడు ఎ.శాంతారావు, కామవరపుకోట మండల అధ్యక్షుడు రాయంకుల సత్యనారాయణ, జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షుడు కర్పూరం గుప్తా, మండల అధ్యక్షుడు నాగేంద్ర, రాష్ట్ర పంచాయతీరాజ్‌ విభాగం కార్యదర్శులు సీహెచ్‌ జ్ఞానారెడ్డి, మల్నీడి బాబ్జి, మేధావుల విభాగం రాష్ట్ర కార్యదర్శి గోలి చంద్రశేఖర్‌రెడ్డి, జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడు త్సల్లాబత్తుల శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి ముప్పిడి శ్రీనివాసరావు, రాష్ట్ర మున్సిపల్‌ విభాగం కార్యదర్శి ఎ.సుబ్బారావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సొంగా సందీప్‌, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement