మంచి పాలన అంటే కూల్చడమేనా? | - | Sakshi
Sakshi News home page

మంచి పాలన అంటే కూల్చడమేనా?

May 16 2026 12:51 AM | Updated on May 16 2026 12:51 AM

మంచి పాలన అంటే కూల్చడమేనా?

ఉండిలో రఘురామ రాక్షసరాజ్యం

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు

ఉండి: ఉండి నియోజకవర్గంలో డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణంరాజు నేతృత్వంలో బుల్డోజర్‌, రాక్షస రాజ్యం నడుస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆరోపించారు. ఉండి మండలం ఉణుదుర్రు, సాగుపాడు గ్రామాల్లో అధికారులు అక్రమంగా కూల్చివేసిన ఇళ్ల బాధితులను శుక్రవారం ఆయన పరామర్శించారు. నివాసాలు కోల్పోయి రోడ్డున పడ్డ మహిళల బాధలను అడిగి తెలుసుకున్నారు. మహిళలు కన్నీటి పర్యంతమవుతుంటే వారిని ఓదార్చారు.

ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కొందరు భూస్వాముల స్వార్థం కోసం పోలీసుల అండతో 84 కుటుంబాలకు చెందిన 71 ఇళ్లను, ఆలయాలను తెల్లవారుజామున బుల్డోజర్లతో కూల్చి వేయడం అత్యంత దుర్మార్గమన్నారు. ఇంట్లోని సామాగ్రిని కూడా బయటకు తెచ్చుకోనివ్వకుండా అధికారులు నిరంకుశంగా వ్యవహరించారని మండిపడ్డారు. భూస్వాముల ఇళ్లు, గెస్ట్‌హౌస్‌లను వదిలేసి, పేదల ఇళ్లను మాత్రమే కూల్చడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. బాధితులకు సీపీఎం తరపున తాత్కాలిక పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కూల్చివేతలకు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదని, నివాసయోగ్యం కాని చోట సెంటున్నర భూమి ఇస్తే న్యాయం జరిగినట్టు కాదని హితవు పలికారు. ప్రభుత్వం ఎన్నికల వాగ్దానం ప్రకారం బాధితులకు 3 సెంట్ల భూమి, ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షల నగదు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఉండి నియోజకవర్గంలో పేదలకు జరుగుతున్న అన్యాయంపై పెద్ద ఎత్తున పోరాడతామని అన్నారు. నియోజకవర్గంలో బుల్డోజర్‌, రఘురామ రాక్షస పాలన సాగనివ్వబోమని పేదల పక్షాన ఉద్యమిస్తామని అన్నారు. కలెక్టర్‌, ఎస్పీలు చట్టవిరుద్ధమైన చర్యలను చూస్తూ మౌనంగా ఉండటం దారుణమన్నారు. పేదలకు న్యాయం జరిగే వరకు సీపీఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్‌వీ గోపాలన్‌, వాసుదేవరావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్‌వీ గోపాలన్‌, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు వాసుదేవరావు, కర్రి నాగేశ్వరరావు, ధనికొండ శ్రీనివాస్‌, జుత్తిగ నర్సింహమూర్తి, జక్కంపూడి సత్యనారాయణ, కేవీపీ జిల్లా కార్యదర్శి క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement