సేంద్రియ వ్యవసాయ పద్ధతులు ఎంతో మేలు | - | Sakshi
Sakshi News home page

సేంద్రియ వ్యవసాయ పద్ధతులు ఎంతో మేలు

May 16 2026 12:51 AM | Updated on May 16 2026 12:51 AM

చింతలపూడి: ప్రస్తుత రోజుల్లో రైతులు తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంటను పండించడానికి విచక్షణారహితంగా రసాయన ఎరువులు వాడుతున్నారు. ఫలితంగా భూముల్లో పంటలకు కావలసిన పోషకాలు అందుబాటులో లేక సమతుల్యత లోపించి ముందెన్నడూ లేని విధంగా ద్వితీయ సూక్ష్మ పోషక లోపాలు పంటల్లో కనిపిస్తుంది. ఈ పోషకాలు లోపించినప్పుడు సాగులో మిగతా యాజమాన్య పద్ధతులన్నీ సక్రమంగా పాటించకపోయినా దిగుబడులు తగ్గుతాయి. వీటిని అధిగమించడానికి సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మేలని వ్యవసాయ సహాయ సంచాలకులు వై.సుబ్బారావు సూచిస్తున్నారు. చింతలపూడి సబ్‌డివిజన్‌ పరిధిలో ఏటా ఖరీఫ్‌ సీజన్‌లో 35,542 ఎకరాల్లో వరి పంటను సాగు చేస్తుంటారు. ఇవి కాక 340 ఎకరాల్లో మొక్కజొన్న, 157 ఎకరాల్లో వేరుశనగ పంటలు పండిస్తారు. రబీ సీజన్‌లో సుమారు 1,500 హెక్టారుల్లో వరి, 18,000 హెక్టారుల్లో మొక్కజొన్న, 2, 500 హెక్టారుల్లో వేరుశెనగ పంటలను రైతులు సాగు చేస్తుంటారు.

ఎరువుగా జిప్సం

జిప్సంలో 24 శాతం కాల్షియం, 18 శాతం గంధకం ఉంటుంది. కాల్షియం, గంధకం మొక్కల పెరుగుదలకు అవసరమైన ద్వితీయ శ్రేణి పోషకాలను అత్యంత చౌకగా జిప్సం ద్వార అందించవచ్చు. ముఖ్యంగా నూనె గింజలు, పప్పు ధాన్యాల వంటి పంటల్లో గంధకం ఆవశ్యకత అధికంగా ఉంటుంది. కాల్షియం మొక్కల్లోని జీవకణాల అంచులు గట్టిగా ఉండటానికి, కణ విభజనకు, వేర్ల అభివద్ధికి గింజకట్టడానికి అవసరమవుతుంది. దీని వల్ల మొక్కలకు చీడపీడలను ఎదుర్కొనే శక్తి సమకూరుతుంది.

వేరుశనగలో ఇలా

వేరుశనగ పంటలో అధిక దిగుబడులకు జిప్సంను పూత దశలో వేసుకుని భూముల్లో కలియ బెట్టడం వల్ల వేరుశనగ ఊడలు జిప్సంలోని కాల్షియం, గంధకాన్ని తీసుకుని అధిక దిగుబడులు వస్తాయి. వేరుశెనగలో జిప్సం వినియోగం వల్ల కాయలు గట్టిగా ఉండి కాయ నిండా పప్పు వద్ధి చెంది గింజల్లో అధిక నూనె శాతం కలిగి ఉంటుంది. ఫలితంగా కాయలు అధిక బరువు కలిగి మంచి ధర పలుకుతాయి. కాబట్టి పూత సమయంలో ఎకరాకు 200 కిలోల చొప్పున భూమిలో తగిన తేమ ఉన్నప్పుడు మొక్కలకు దగ్గరగా వేసుకోవాలి. బీడు ,చౌడు భూముల్లో నీరు సరిగా ఇంకదు. గాలి ప్రసరణ తక్కువగా ఉంటుంది. భూమి భౌతిక లక్షణాలు క్షీణించి ఉంటాయి. ఈ పరిస్థితుల్లో మొక్కల వేర్లు సరిగా వద్ధి చెందక మొక్కల్లో ఎదుగుదల ఉండదు. ఇలాంటి భూముల్లో జిప్సం వినియోగంవల్ల నేల గుల్లబారి భూమిలో నీరు ఇంకే స్వభావం పెరిగి మొక్కల వేర్లు బాగా వృద్ధి చెందుతాయి. పంట దిగుబడి గణనీయంగా పెరుగుతుంది.

– వై సుబ్బారావు, చింతలపూడి వ్యవసాయ సబ్‌డివిజన్‌ ఏడీఏ

పాడి–పంట

Advertisement
 
Advertisement
Advertisement