● శ్రీవారికి.. ఇదే తొలి ఉత్సవం
● రేపు చినవెంకన్న క్షేత్రంలో ఉగాది వేడుకలు
ద్వారకాతిరుమల: పెద్ద పండుగల్లో అత్యంత విశిష్టమైన పండుగ ఉగాది. ఈ రోజుతోనే కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇది ముఖ్యంగా తెలుగువారి పండుగ. కర్ణాటక ప్రజలు కూడా మనతో పాటే ఉగాది పండుగను జరుపుకుంటారు. ఇతర రాష్ట్రాల వారు సైతం వారివారి కాలమాన ఆచార వ్యవహారాలను అనుసరించి ఉగాదిని జరుపుకుంటారు. ఆంగ్ల సంవత్సరం ముగింపు, ప్రారంభంలో పర్యావరణంలోను, పరిసరాల్లోను ఏ విధమైన మార్పు కనిపించదు. కానీ తెలుగు సంవత్సరాది అలా కాదు. ప్రకృతిలోనూ, వాతావరణంలోనూ స్పష్టమైన మార్పు కనబడుతుంది. శిశిర రుతువు ఫల్గుణ అమావాస్యతో తెలుగు సంవత్సరం ముగుస్తుంది. మరునాడు చీకట్లు పోయి వెలుగులు పెరిగే శుక్లపాడ్యమితో కొత్త సంవత్సరం మొదలవుతుంది. పాత సంవత్సరపు చీకటి అనుభవాల నుంచి అనందపు వెలుగుల్లోకి వెల్లువలా మనం అడుగు వేస్తాం. వృక్షాలు కొత్త చిగుళ్లతో, ఆకుపచ్చ శోభతో ప్రకృతి ఆహ్లాదపరుస్తూ ఉంగా పక్షుల కిలకిల రావాలు, కోయిల పాటలు వీనుల విందు చేస్తూ వినిపిస్తాయి.
శ్రీవారికీ ఇదే తొలి ఉత్సవం..
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్నకు ఉగాది పండుగే తొలి ఉత్సవం. అందుకే ఈ పండుగకు క్షేత్రంలో ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి ఏటా శ్రీవారి వైభవాన్ని చాటేలా ఈ ఉత్సవాలను ఆలయ అధికారులు వైభవంగా నిర్వహిస్తారు. అందులో భాగంగా ఈనెల 19న సాయంత్రం 6 గంటలకు ఉభయ దేవేరులతో స్వామివారు ఆలయం నుంచి వెండి శేషవాహనంపై బయల్దేరి, ఉగాది మండపం వద్దకు చేరుకుంటారు. అనంతరం మండపంలో శ్రీవారు, అమ్మవార్లను వేంచేపుచేసి అర్చకులు, పండితులు పంచాంగ శ్రవణాన్ని జరిపి, రాశి ఫలాలను చదివి వినిపిస్తారు. ఆ తర్వాత పండిత సత్కారాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ వేడుకలను పురస్కరించుకుని ఉగాది మండపం, పరిసరాలు విద్యుద్దీప కాంతులీనుతున్నాయి.


