భీమవరం: పెండింగ్‌లో ఉన్న డీఎలు, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయుల పోరుబాట కార్యక్రమంలో భాగంగా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ మంగళవారం కలెక్టర్ చదలవాడ నాగరాణికి వినతపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌టీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాకర శ్యాంసుందర్ క్రైస్ట్ సన్, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మురాల సుధాకర్, వై రమేష్ బాబు మాట్లాడుతూ తక్షణమే ఐఆర్ ప్రకటించి పీఆర్సి వేయాలని డిమాండ్ చేశారు. అన్ని పెండింగ్ డీఏలు తక్షణమే చెల్లించాలని, సంపాదిత సెలవులకు ఎన్‌క్యాష్‌మెంట్ చెల్లించాలని, రిటైర్డ్ ఉద్యోగుల అన్ని బెనిఫిట్స్ ఇవ్వాలని కోరారు. ఉద్యోగుల అవసరాల నిమిత్తం పీఎఫ్ రుణాలు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు గారపాటి నారాయణ, జిల్లా ట్రెజరర్ టీ పల్లయ్య, అత్తిలి, ఇరగవరం, తణుకు మండలాల అధ్యక్షులు తేన్నైటి నవీన్, కప్పల పాలస్మిత్, కొల్లి జయరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు పి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


