గ్రావెల్‌ మాఫియా ఆగడాలు | - | Sakshi
Sakshi News home page

గ్రావెల్‌ మాఫియా ఆగడాలు

Mar 16 2026 7:48 AM | Updated on Mar 16 2026 7:48 AM

ఆగిరిపల్లి: మండలంలో గ్రావెల్‌ మాఫియా రెచ్చిపోతుంది. అధికారం మాది.. తవ్వేస్తాం.. అధికారులు మమ్మల్ని ఏమి చేయలేరు అన్న రీతిలో బరితెగిస్తున్నారు. కొన్ని రోజుల నుంచి పగలూ రాత్రి తేడా లేకుండా మండలంలోని పలు గ్రామాల్లో అధికార పార్టీ నాయకులు అనుమతులు లేకుండా కొండలను పిండి చేస్తున్నారు. లారీలలో వందలాది ట్రిప్పులను తరలించి జేబులు నింపుకుంటున్నారు. గత మూడు రోజులుగా మంత్రి అనుచరులు అని చెప్పి ఎలాంటి అనుమతులు లేకుండా కల్లుటూరు శివారులో ఉన్న అసైన్‌మెంట్‌ భూమిలో కొండను తవ్వి లారీల్లో గ్రావెల్‌ను బయట ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మంత్రి పార్థసారథి ఫొటోతో కూడిన వాటర్‌ ట్యాంకర్‌ తవ్వకాలు జరుగుతున్న ప్రదేశంలో నీటిని చల్లుతున్న వీడియోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుండడంతో మండల ప్రజలు అవాక్కవుతున్నారు. ఆదివారం ఉదయం పత్రికా విలేకరులు గ్రావెల్‌ తవ్వకాలు జరుగుతున్న ప్రదేశానికి వెళ్లారని సమాచారంతో రెవెన్యూ అధికారులు హుటాహుటిన వెళ్లి సంఘటన స్థలంలో ఉన్న పొక్లెయిన్‌ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అమ్మవారి గూడెంలో మాలగట్టును అక్రమార్కులు కొన్ని నెలల నుంచి ప్రతిరోజు రాత్రి తవ్వేయడంతో అక్కడ తాడిచెట్టు లోతులో గొయ్యి ఏర్పడింది. మైనింగ్‌ అధికారులు మాత్రం మాఫియాపై చర్యలు తీసుకోవడం లేదు. కొన్ని రోజుల క్రితం తవ్వకాలు జరుగుతున్నాయని సమాచారం రావడంతో మహిళా రెవెన్యూ అధికారి అక్కడికి వెళ్లగా.. తవ్వకాలు ఆపం, ఏం చేసుకుంటావో చేసుకో అని బెదిరించారు. పోతవరప్పాడుచెరువు, ఆగిరిపల్లిలోని అగ్గిరాయి చెరువులో ఇష్టానుసారంగా మట్టిని తవ్వేస్తున్నారు. సామాన్య ప్రజలు ఇంటి కోసం ట్రాక్టర్‌ మట్టిని తవ్వుకుంటే అధికారులు వచ్చి ట్రాక్టర్లు సీజ్‌ చేస్తారు. అధికార పార్టీకి చెందిన నాయకులు గ్రావెల్‌, మట్టిని అక్రమంగా తరలిస్తున్న పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement