వేరుశెనగ కోతలో జాగ్రత్తలు | - | Sakshi
Sakshi News home page

వేరుశెనగ కోతలో జాగ్రత్తలు

Mar 16 2026 7:48 AM | Updated on Mar 16 2026 7:48 AM

చింతలపూడి: భారతదేశంలో పండించే నూనె గింజల పంటల్లో వేరుశెనగ అతి ముఖ్యమైంది. వేరుశెనగ కోతలు పూర్తయ్యాక సరైన జాగ్రత్తలు పాటిస్తే విత్తనాలు రాబోయే కాలంలో పనికి వస్తాయి. లేదంటే పుచ్చుపట్టి పనికి రాకుండా పోతాయి. వేరుశెనగలో కోసిన పంటను తగిన తేమ (9 శాతం) వచ్చే వరకు మొక్క నుంచి కాయలను వేరు చేయడానికి ముందు ఎండ బెట్టాలి. మెట్ట ప్రాంతంలో ప్రస్తుతం వేరుశనగ పంటను భద్రపరుచుకునే పనిలో రైతులు ఉన్నారు. ఈ ఏడాది చింతలపూడి సబ్‌ డివిజన్‌లో 200 ఎకరాల్లో రైతులు పంటను వేశారు. విత్తనాలను భద్ర పరుచుకుని వచ్చే పంటకు ఉపయోగించుకోవడంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు వై.సుబ్బారావు సూచనలు చేస్తున్నారు.

వేరుశెనగ ఎండబెట్టే విధానం

ఇది రెండు రకాలుగా చేయొచ్చు. వేరుశెనగ కాయలు పై భాగానికి వచ్చేటట్లు చెట్లను చిన్న, చిన్న కుప్పలుగా వేయాలి. లేదా మొక్కలను కర్రలకు కట్టి కాయలను పక్కకు వచ్చేలా ఎండబెట్టుకోవచ్చు.

తేమశాతం తగ్గించాలి

కాయల్లో తేమ శాతం ఎక్కువగా ఉంటే ఎండలో ఆరబెట్టకుండా తేమను 7 నుంచి 8 శాతానికి తీసుకురావాలి. వేడి గాలులను వదిలే పరికరాలను ఇందుకు ఉపయోగించవచ్చు. వేరుశెనగ పంటను నిల్వ చేయడానికి ఒకసారి వాడిన సంచులను మళ్లీ వాడకూడదు. పాలిథీన్‌ పేపర్‌ ఉన్న గోనె సంచులు బాగా ఎండిన వేరుశనగ కాయలను నిల్వ చేయడానికి ఉపయోగం.

ఎండలో ఆరబెట్టకూడదు

రబీ కాలంలో పీకేటప్పుడు ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెంటీగ్రేడ్‌ కంటే ఎక్కువ ఉంటుంది. కాయలను నేరుగా ఎండలో ఆరబెట్టకూడదు. నీడలో ఆరబెట్టాలి. ఎండతీవ్రత ఉదయం 11 గంటల వరకు సాయంత్రం 4 గంటల తరువాత తక్కువగా ఉంటుంది. ఆయా సమయాల్లో ఆరబెట్టుకోవాలి. ఎండబెట్టే సమయంలో వేరే రకాల కాయలు కలవకుండ చూసుకోవాలి.

నిల్వ చేసుకునే విధానం

వేరుశెనగ విత్తనం కోసం బాగా ముదిరిన కాయలను నిల్వ చేసుకోవాలి. కాయలను కదిలిస్తే ఘల్లుమని శబ్దం రావాలి, అప్పుడే బాగా ఎండినట్లు అర్థం. కాయలను నిల్వ చేసుకోవడానికి శుభ్రమైన పాలిథీన్‌ లైనింగ్‌ ఉన్న గోనె సంచులను వాడాలి. గోనె సంచులను 0.5 శాాతం మలాథియాన్‌ ద్రావణంలో ముంచి బాగా ఆరబెట్టుకోవాలి. దీని వల్ల కాయల్లోని గింజలకు శిలీంధ్రాల బెడద ఉండదు.

వై.సుబ్బారావు, సహాయ వ్యవసాయ సంచాలకుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement