సుబ్బారాయుడిని దర్శించుకున్న భక్తులు
ముదినేపల్లి రూరల్: ప్రసిద్ధి చెందిన సింగరాయపాలెం–చేవూరుపాలెం సెంటర్లోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం భక్తులు పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని స్వామి పుట్టలో పాలు పోసి స్వామివారిని దర్శించుకున్నారు. పాలపొంగళ్ళ శాల వద్ద మహిళలు నైవేద్యాలు తయారుచేసి స్వామికి సమర్పించారు. నాగబంధాల వద్ద స్వామి మూర్తులను ప్రతిష్ఠించేందుకు అర్చకులతో పూజలు చేయించి ప్రతిష్ఠ తంతు నిర్వహించారు. నాగబంధాల వద్ద, గోకులంలోని గోవులకు మహిళలు పసుపు కుంకుమలతో పూజలు చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అన్నప్రసాద ఏర్పాట్లు చేశారు. అన్నదాన కార్యక్రమానికి భక్తలు పోటెత్తడంతో ఆలయ సహాయ కమిషనర్ ఆర్.గంగా శ్రీదేవి ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేశారు.
బుట్టాయగూడెం: బుట్టాయగూడెం మండలం కామవరం సమీపంలో అటవీప్రాంతంలో కొలువైన గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ప్రత్యేక బస్సుల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. అనంతరం దూపదీప నైవేద్యాలతో అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అధికంగా తరలివచ్చిన భక్తుల వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీతోపాటు పోలీసులు కూడా బందోబస్తు నిర్వహించారు.
నరసాపురం రూరల్: సెలవు దినం కావడంతో సముద్ర తీరం పర్యాటకుల రాకతో కళకళలాడింది. మొగల్తూరు మండలంలోని కేపీ పాలెం, పేరుపాలెం గ్రామాలతో పాటు నరసాపురం మండలంలోని పెదమైనవానిలంక, చినమైనవానిలంక గ్రామాల పొడవునా విస్తరించి ఉన్న బీచ్ ప్రాంతం ఆదివారం ఉదయం నుంచే సందర్శకులతో కిక్కిరిసిపోయింది. ప్రకృతి ప్రేమికులు, యువత ప్రత్యేక వాహనాలు, ద్విచక్ర వాహనాలపై భారీ సంఖ్యలో తరలిరావడంతో తీరమంతా కోలాహలం నెలకొంది. ఉదయాన్నే బీచ్‌కు చేరుకున్న పర్యాటకులు ఉత్సాహంగా సముద్ర కెరటాలలో స్నానాలు చేస్తూ సేదతీరారు. ఒడ్డుకు కొట్టుకువస్తున్న కెరటాల మధ్య ఇసుక తిన్నెలపై చిన్నారులు ఆటలాడుకుంటూ సందడి చేశారు. తీరానికి సమీపంలో ఉన్న ఆలయాలను పర్యాటకులు దర్శించుకున్నారు.
ఆకివీడు: స్థానిక గంగానమ్మ కోడు వీధిలో పాత కక్షల నేపథ్యంలో ఆదివారం ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. మేకల పవన్ కుమార్ అనే వ్యక్తిపై మేకల వెంకటేశ్వరరావు గోపీచంద్ చాకుతో దాడి చేయడంతో అతనికి తీవ్ర గాయాలు కాగా ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈమేరకు ఆసుపత్రి నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎస్సై హెచ్ నాగరాజు తెలిపారు.
సుబ్బారాయుడిని దర్శించుకున్న భక్తులు
సుబ్బారాయుడిని దర్శించుకున్న భక్తులు


