రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లు–నరసాపురం రోడ్డులో పెదగరువు వెళ్లే రోడ్డు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భవిరిశెట్టి ప్రభు కుమార్ (32) అక్కడికక్కడే మృతి చెందాడు. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నుంచి ద్విచక్ర వాహనంపై తన సోదరి ఇంటికి పాలకొల్లు వస్తున్న ప్రభు కుమార్ పెదగరువు రోడ్డు వద్దకు వచ్చే సరికి లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రభు కుమార్‌ను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పృథ్వీ తెలిపారు.
కై కలూరు: ద్విచక్రవాహనంపై ఆగివున్న వ్యక్తిని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఆలపాడు జాతీయ రహదారి ఆదర్శ స్కూల్ వద్ద ఆదివారం జరిగింది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు పంచాయతీ బొమ్ములూరుకు చెందిన చిన్నపరుపు నాగశ్రీను(49) బడ్డీ కొట్టు నిర్వహిస్తున్నాడు. కై కలూరులో బంధువుల ఇంటికి వచ్చి తిరిగి వెళ్తుండగా.. ఆదర్శ స్కూల్ వద్ద పక్కకు ఆపి నిలబడ్డాడు. ఇంతలో కై కలూరు నుంచి ఆకివీడు వెళ్తున్న కారు గట్టిగా ఢీకొట్టడంతో నాగశ్రీను మరణించాడు. కుమారుడు భానుప్రసాద్ ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్సై వి.రాంబాబు కేసు నమోదు చేశారు.


