మామిడిపై నల్ల తామర దాడి | - | Sakshi
Sakshi News home page

మామిడిపై నల్ల తామర దాడి

Feb 23 2026 7:35 AM | Updated on Feb 23 2026 7:35 AM

మామిడ

మామిడిపై నల్ల తామర దాడి

ప్రతికూల వాతావరణంతో నష్టం

మాడిపోయిన మామిడి పూత

నూజివీడు: ఈ ఏడాది మామిడి తోటల్లో 90 శాతం తోటలు పూతతో కళకళలాడాయి. దీంతో దిగుబడి బాగుంటుందని, కష్టాలు తీరతాయని మామిడి రైతులు భావించారు. ఇంతలోనే నల్ల తామరకు, ప్రతికూల వాతావరణం తోడవడంతో వచ్చిన పూతంతా మాడిపోయింది. దీంతో మామిడిపై పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలైనట్లేనని రైతన్నలు లబోదిబోమంటున్నారు.

నూజివీడు డివిజన్‌లో ప్రధాన వాణిజ్య పంటగా మామిడి దశాబ్దాలుగా సాగు చేస్తున్నారు. నూజివీడు రసాలన్నా.. సువర్ణరేఖ.. బంగినపల్లి అన్నా దేశ విదేశాల్లో ఎంతో ప్రసిద్ధి. అలాంటి మామిడి పరిస్థితి రానురాను దయనీయంగా తయారవుతోంది. గత రెండేళ్లుగా కాపు లేకపోవడం.. ఈ ఏడాది పూత పెద్ద ఎత్తున రావడంతో మామిడి ఆదుకుంటుందనే గంపెడాశతో ఉన్న రైతులను నల్లతామర, ప్రతికూల వాతావరణం నట్టేట ముంచింది. నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు, చాట్రాయి, చింతలపూడి, లింగపాలెం మండలాల్లో దాదాపు 40 వేల ఎకరాల్లో మామిడి తోటలున్నాయి. ఈ మామిడి తోటల్లో డిసెంబరు నుంచి పూతలు ప్రారంభమై, జనవరిలో గణనీయంగా రావడంతో రైతులు ఆనందపడ్డారు. బంగినపల్లి, తోతాపురి, రసాలు, సువర్ణరేఖ, తియ్యమామిడి తదితర అన్ని రకాల్లో పూతలు ముమ్మరంగా వచ్చాయి. ఫిబ్రవరి 2 నుంచి మామిడి తోటలపై తామర పురుగు దాడి చేయడం, ఉదయం 9 గంటల వరకు మంచు పడటంతో వచ్చిన పూతలో దాదాపు 70 శాతం పూత నిలువునా మాడిపోయింది. ఒక్కొక్క రైతు పూత వచ్చిన దగ్గర నుంచి పూత నిలుపుకోవడం కోసం 10 నుంచి 12 సార్లు రసాయన మందులు పిచికారీ చేసినప్పటికీ చివరలో తామర పురుగు ఆశించడంతో చేసిన ప్రయత్నమంతా వృథా అయింది. రైతుల ఆశలు అడియాశలయ్యాయి.

కనిపించని పిందె కట్టు

డివిజన్‌లోని మొత్తం విస్తీర్ణంలో 90 శాతం తోటల్లో ఈ ఏడాది పూతలు వచ్చాయి. మామిడి అనేది ఒక ఏడాది కాస్తే, మరో ఏడాది కాపు తక్కువగా ఉంటుంది. తామర పురుగు ఆశించడం, ప్రతికూల వాతావరణంతో పూత కాడలకు, పూమొగ్గలకు ఆశించి అందులోని రసాన్నంతా పీల్చేయడంతో పూతంతా మాడిపోయింది. ఎన్నిసార్లు రసాయన మందులు పిచికారీ చేసినా వాటిని నియంత్రించడం సాధ్యపడలేదు. దీంతో లక్షలాది రూపాయల పెట్టుబడులు పెట్టిన రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోయి ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో విలవిల్లాడుతున్నారు. వరుసగా మూడేళ్లు మామిడి తోటల వల్ల దెబ్బతినిపోయామని, తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

మామిడిపై నల్ల తామర దాడి 1
1/1

మామిడిపై నల్ల తామర దాడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement