ఏసీబీ దాడుల్లో డ్రగ్ ఇన్‌స్పెక్టర్ అరెస్టు
జంగారెడ్డిగూడెం: ఏసీబీ దాడుల్లో శుక్రవారం జంగారెడ్డిగూడెం డ్రగ్ ఇన్‌స్పెక్టర్, అతని సహాయకుడు పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ జీవీ కృష్ణారావు వివరాల ప్రకారం.. నల్లజర్ల మండలం ఆవుపాడుకు చెందిన అచ్యుత బాబా దుర్గా సాయి జంగారెడ్డిగూడెంలో మెడికల్ షాప్ పెట్టడానికి ఈ నెల 6న డ్రగ్ లైసెన్స్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకున్నాడు. ఆన్‌లైన్ దరఖాస్తుకు, అవసరమైన పత్రాలను జతచేసి జంగారెడ్డిగూడెం డ్రగ్ ఇన్‌స్పెక్టర్ కంపా సురేష్ కుమార్‌ను సంప్రదించాడు. దరఖాస్తు చేసి చాలా రోజులు అవుతున్నా.. లైసెన్స్ అందకపోవడంతో సురేష్‌ను సంప్రదించాడు. డ్రగ్ ఇన్‌స్పెక్టర్ డబ్బులు డిమాండ్ చేశాడు. జంగారెడ్డిగూడెం మెడికల్ షాప్స్ అసోసియేషన్ కోశాధికారి తడికమళ్ల శివరామకృష్ణను కలవాలని, ఎంతో అతను చెబుతాడని సూచించడంతో దుర్గాసాయి అతనిని కలిశాడు. రూ.20 వేలు ఇవ్వాలని చెప్పడంతో దుర్గాసాయి ఏసీబీని ఆశ్రయించాడు. శుక్రవారం దుర్గాసాయి నుంచి శివరామకృష్ణ రూ.20 వేలు తీసుకుంటుండగా పట్టుకున్నారు. శివరామకృష్ణను అదుపులోకి తీసుకుంటుండగా చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు అడ్డుపడ్డారు. సురేష్ కుమార్, శివరామకృష్ణను అరెస్టు చేసి రాజమండ్రి ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. ఏసీబీ సీఐలు ఎం.బాలకృష్ణ, కె.శ్రీనివాసరావు పాల్గొన్నారు.


