సొసైటీ ఉద్యోగుల పోరుబాట | - | Sakshi
Sakshi News home page

సొసైటీ ఉద్యోగుల పోరుబాట

Feb 21 2026 7:31 AM | Updated on Feb 21 2026 7:31 AM

సొసైటీ ఉద్యోగుల పోరుబాట

సొసైటీ ఉద్యోగుల పోరుబాట

సమ్మెలోకి ఉద్యోగులు

రైతులకు అందని ‘సహకార’ సేవలు

జిల్లాలోని 254 సొసైటీలు మూత

ఉద్యోగుల డిమాండ్లు

● జీఓ 36ను అమలు చేసి ఉద్యోగులందరికీ ప్రొసీడింగ్స్‌ ఇచ్చి జీతభత్యాలు చెల్లించాలి.

● సహకార ఉద్యోగులకు కూడా రిటైర్‌మెంట్‌ వయసును 62 ఏళ్లకు పెంచాలి.

● ప్రతి ఐదేళ్లకు ఒకసారి వేతన సవరణ చేయాల్సి ఉంది. అయితే 2019, 2024ల్లో చేయనందున రెండు వేతన సవరణలతోపాటు అప్పటివరకు మధ్యంతర భృతి చెల్లించాలి.

● 2019 తరువాత సహకార సంఘాల్లో చేరిన ఉద్యోగులందరినీ పర్మినెంట్‌ చేయాలి.

● ఉద్యోగులకు ఆరోగ్య బీమా రూ.5 లక్షలు, టర్మ్‌ ఇన్సూరెన్స్‌ రూ.20 లక్షలకు కల్పించాలి.

● ఉద్యోగులు మరణిస్తే కారుణ్య నియామకం కింద కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. వీటితో పాటు ఇతర సమస్యల పరిష్కారానికి ఉద్యోగులు సమ్మెలోకి దిగారు.

నూజివీడు: దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి, తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సహకార సంఘాల ఉద్యోగులు సమ్మెబాట పట్టారు.

ఈనెల 16 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లడంతో జిల్లాలోని 254 సహకార పరపతి సంఘాలు (పీఏసీఎస్‌లు) తలుపులు తెరుచుకోవడం లేదు. సొసైటీల కార్యకలాపాలు స్తంభించడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. డిసెంబరు మొదటి వారం నుంచి జనవరిలో సంక్రాంతి వరకు దశల వారీగా పోరాటాలు చేసినా ప్రభుత్వం వారి ఉద్యమాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. కనీసం చర్చలకు కూడా పిలవలేదు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగారు.

జిల్లాలో 254 సొసైటీలు

జిల్లాలో 254 సొసైటీలు ఉండగా ఉద్యోగులంతా నిరవధిక సమ్మెలోకి వెళ్లారు. ప్రతి నియోజకవర్గంలోని సొసైటీ ఉద్యోగులంతా రోజుకో కేంద్ర సహకార బ్యాంకు బ్రాంచీ వద్ద ఆందోళనలు చేస్తున్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరం మరో 38 రోజుల్లో ముగుస్తుండగా ఈ దశలో రుణాలను వసూలు చేయాల్సి ఉండగా, ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లడంతో రుణాల వసూళ్లు నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే సొసైటీలు నష్టాల్లోకి వెళ్లి సహకార వ్యవస్థ దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement