నిధుల దుర్వినియోగంపై విచారణ చేయాలి
చింతలపూడి: చింతలపూడి మహిళా మార్ట్‌లో నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపించాలని సీఐటీయూ, ఏపీ వెలుగు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో వీఓఏలు శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. వెలుగు వీఓఏలు, మెప్మా ఆర్పీల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభాషిణి మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం సుమారు రూ.48 లక్షల పెట్టుబడితో ప్రారంభించిన మహిళా మార్ట్ అవినీతి, నిర్లక్ష్యం, అక్రమాల కేంద్రంగా మారిందని ఆరోపించారు. ప్రస్తుతం మార్ట్‌లో రూ.4 లక్షల విలువైన సరుకులు మాత్రమే ఉండటం అనుమానాస్పదంగా ఉందన్నారు. మిగిలిన రూ.44 లక్షల విలువైన సరుకులు ఎక్కడికి వెళ్లాయో అంతుచిక్కడం లేదన్నారు. మహిళలకు లాభాలు ఇస్తామని హామీ ఇచ్చి, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు. అలాగే గణిజర్లకి చెందిన వీఓఏ ఈదర సరితను రాజకీయ ఒత్తిళ్లతో అక్రమంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అనంతరం తహసీల్దార్ డీఎల్ ప్రమద్వరకు వినతిపత్రం అందజేశారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్వీఎస్‌ఎన్ నారాయణ, మెప్మా ఆర్పీల సంఘ అధ్యక్షురాలు ఝాన్సీ, కార్యదర్శి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.


