ఫైర్‌లైన్స్‌తో అగ్ని ప్రమాదాలకు చెక్
అటవీ ప్రాంతంలో ప్రత్యేక నిఘా
ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం
● అడవుల్లో అగ్నిప్రమాదాల నివారణకు ఏర్పాట్లు
● 50 కిలోమీటర్ల పరిధిలో ఫైర్‌లైన్స్ నిర్వహణ
బుట్టాయగూడెం: వేసవికాలం వచ్చిందంటే అడవుల్లో అగ్ని ప్రమాదాలు సంభవించి వృక్ష సంపదకు, వన్యప్రాణులకు హాని కలిగే పరిస్థితులు నెలకొంటున్నాయి. అడవుల్లో అగ్నిప్రమాదాల వల్ల వాతావరణ సమతుల్యం కూడా దెబ్బతినే ప్రమాదం నెలకొంటుంది. దీంతో అడవుల్లో అగ్నిప్రమాదాల నివారణకు అటవీశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. దీనిలో భాగంగా సుమారు 50 కిలోమీటర్ల పరిధిలో ఫైర్‌లైన్స్ ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఫైర్ బ్లోయర్స్‌ను కూడా సిద్ధం చేసి అటవీని అగ్ని ప్రమాదాల నుంచి సంరక్షిస్తున్నారు.
జిల్లాలో విస్తరించి ఉన్న అటవీప్రాంతం
జాతీయ అటవీ విధానం ప్రకారం మూడో వంతు భూభాగంలో చెట్లు ఉండాలి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో సుమారు 1.32 లక్షల హెక్టార్ల పరిధిలో అటవీప్రాంతం విస్తరించి ఉంది. ఇందులో 85 శాతం పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోనే ఉందని అధికారులు చెబుతున్నారు. అడవులను సంరక్షించడంతో పాటు వనాల్లో ఉండే జంతువుల రక్షణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
అగ్నిప్రమాదాలు ఇలా
వేసవి కాలంలో చెట్ల ఆకులు ఎక్కువగా రాలిపోతుంటాయి. అటవీప్రాంతంలోకి పశువులను తీసుకు వెళ్లిన పశువుల కాపరులు, తునికాకు, చింతపండు, ఇప్పపూలు, అడ్డపిక్కలు, తదితర వాటి సేకరణ కోసం వెళ్లిన వారిలో ఎవరైనా అనుకోకుండా చుట్ట, సిగరెట్, బీడీ వంటివి తాగి పడేస్తే అవి ఎండిన ఆకులకు అంటుకొని మంటలు వ్యాప్తి చెంది పెద్ద మొత్తంలో అడవులకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అలాగే ఆకతాయిల చేష్టల వల్ల కూడా అడవుల్లో అగ్నిప్రమాదాలు సంభవిస్తుంటాయి. గిరిజన ప్రాంతంలో అడవుల్లో ప్రతి ఏటా ఏదో ఒక ప్రాంతంలో అడవికి నిప్పు రాజుకుని మంటలు చెలరేగుతున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని అడవుల్లో అగ్నిప్రమాదాల నివారణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
ఫైర్‌లైన్స్ ఏర్పాటు ఇలా
అడవుల్లో అగ్నిప్రమాదాల నివారణలో భాగంగా ఫారెస్టు అధికారులు అటవీ ప్రాంతంలో ఫైర్‌లైన్స్ ఏర్పాటు చేస్తారు. అటవీ ప్రాంతంలో కాలిబాటలో ఐదు మీటర్ల వెడల్పుతో వీటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. చుట్టు పక్కల ఉన్న ఎండిన ఆకులను కాలి బాటలో పరిచి నిప్పు పెడతారు. ఒక వేళ ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించి మంటలు చెలరేగినా ఈ దారి వరకే మంటలు వ్యాప్తి చెంది ఆరిపోతాయి. మిగతా ప్రాంతానికి మంటలు వ్యాప్తి చెందకుండా ఫైర్‌లైన్స్ అరికడతాయి. అడవుల సంరక్షణకు ప్రతి ఏటా అటవీ శాఖ అధికారుల ఆధ్వర్యంలో వేసవి ప్రారంభంలో ముందస్తు చర్యలు చేపడతారు. ఫైర్‌లైన్స్ ద్వారా దాదాపు 2 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేయడం ద్వారా అగ్నిప్రమాదాలు రాకుండా అరికట్టవచ్చని అధికారులు చెబుతున్నారు. అయితే పశ్చిమ ఏజెన్సీప్రాంతంలో అటవీ విస్తరణ అధికంగా ఉండటం వల్ల సుమారు 50 కిలోమీటర్ల మేర ఫైర్‌లైన్స్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. గత ఏడాది తీసుకున్న చర్యల వల్ల కేవలం 2 హెక్టార్లలో మాత్రమే అడవి అగ్నిప్రమాదానికి గురైందని అటవీశాఖ అధికారులు తెలిపారు.
శాటిలైట్ ద్వారా సమాచారం
అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటే వెంటనే సమాచారం అందించేందుకు అటవీశాఖ ప్రధాన కార్యాలయంలో ఫైర్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. శాటిలైట్ ద్వారా వచ్చే సమాచారాన్ని తక్షణమే అటవీశాఖ అధికారులకు చేరవేస్తుంది. జిల్లాలో ఎక్కడైనా అటవీప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించి మంటలు చెలరేగితే ఆ ప్రాంతానికి తక్షణమే సమాచారం అందించే వీలుంటుంది. దీనితో ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమై ఆయా ప్రాంతానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువస్తారు.
వేసవి కాలంలో అటవీ ప్రాంతంలో సంభవించే అగ్నిప్రమాదాల నివారణకు రాత్రి పగలు తేడాలేకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. ఫైర్‌లైన్స్ ఏర్పాటు చేసి ఎండిన ఆకులను పరిచి అవి పూర్తిగా కాలిపోయే వరకూ కాపలా ఉంటారు. అలాగే అనుకోకుండా మంటలు వ్యాప్తి చెందితే అందుబాటులో ఉన్న సిబ్బంది పరుగులు తీసి ఆ మంటలను అదుపు చేస్తారు. వీటి వల్ల అగ్నిప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉంటాయి.
అడవులు, జంతువుల సంరక్షణ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. వేసవిలో సంభవించే అగ్ని ప్రమాదాల నివారణకు ఫైర్ వాచర్స్ ద్వారా కృషి చేస్తున్నాం. 50 కిలీమీటర్ల పరిధిలో ఫైర్ లైన్స్ ఏర్పాటు చేస్తున్నాం. వీటి ద్వారా మంటలను వ్యాప్తి చెందకుండా నివారించేలా కృషి చేస్తున్నాం. అలాగే అడవుల్లో అగ్నిప్రమాదాల నివారణపై పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు పూర్తి అవగాహన కలిగించే విధంగా కృషి చేస్తున్నాము.
– ఎస్‌కే వల్లీ, రేంజ్ అధికారి, పోలవరం
ఫైర్‌లైన్స్‌తో అగ్ని ప్రమాదాలకు చెక్
ఫైర్‌లైన్స్‌తో అగ్ని ప్రమాదాలకు చెక్


